500 జనాభా గల ప్రతి గిరిజన ఆవాసాన్ని

ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలి
గిరిజన ప్రజాసమాఖ్య డిమాండ్‌
అమరావతి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా గల ప్రతి గిరిజన తండా, గ్రామం, గూడెంని ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలని గిరిజన ప్రజాసమాఖ్య జాతీయ కమిటీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 500 జనాభా గల గిరిజన ఆవాసాలను ప్రత్యేక గిరిజన గ్రామంగా గుర్తించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆ వినతి పత్రంలో తెలిపారు. అయితే ఆ జీఓని 2011 జనాభా లెక్కల ప్రకారం అనేక ఆంక్షలతో రూపొందించారని పేర్కొన్నారు. ఆ జీఓ ప్రకారం 9 జిల్లాల్లో 147 గిరిజన ఆవాసాలు మాత్రమే పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆ జీఓని పున:పరిశీలించి, ఆంక్షలను తొలగించి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీను గుర్తించాలని ఆయన కోరారు. గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడే విధంగా గిరిజన ఆవాసాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.