పాక్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు

వాషింగ్టన్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లో అసలే దారుణంగా ఉన్న హిందువులు, షియాలు, క్రిస్టియన్ల పరిస్థితి ఇటీవలీ కాలంలో మరింత దిగజారింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూఎస్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) అనే సంస్థ వెల్లడించింది. విదేశాల్లో మతస్వేచ్చ ఉల్లంఘనలను ఈ సంస్థ పరిశీలిస్తుంది. పాకిస్థాన్‌లో గడిచిన ఏడాదిన్నర కాలంలో 203 సంఘటనలు చోటుచేసుకోగా, వాటిలో 700 మంది మరణించారు, మరో 1100 మంది గాయపడ్డారు. వివిధ ఉగ్రవాద సంస్థలు ప్రధానంగా షియా వర్గంపై దాడులు ఎక్కువగా చేశాయి. ఆత్మాహుతి దాడులు, తుపాకి కాల్పులతో అక్కడున్న హిందువులు, క్రిస్టియన్లు, షియాల పరిస్థితి బాగా క్షీణించినట్లు యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ తన నివేదికలో తెలిపింది. 2012 జనవరి నుంచి 2013 జూన్‌ వరకు హిందువులపై 16, సిక్కులపై 3 దాడులు జరిగాయి. వీటిలో ఇద్దరు హిందువులు, ఒక సిక్కు మరణించాడు. ఏడుగురు హిందువులపై అత్యాచారాలు, కాల్పులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన నవాజ్‌ షరీఫ్‌ సర్కారుకు ఇవి సవాళ్లుగా మారాయని ఈ సంస్థ తెలిపింది.