వివేక్‌ పాతగూటి పాట


కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు
హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) :
పెద్దపల్లి ఎంపీ జి. వివేక్‌ మళ్లీ పాతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరుపుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావుకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కేసాఆర్‌ ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపు అడుగులు వేస్తోన్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు ఆ పార్టీలో చేరిన తమ పాత కాపులను తిరిగి రప్పించే పనిలో పడింది. మంగళవారం ఉదయం జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షట్కార్‌ నివాసంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వివేక్‌ను పిలిపించుకుని  మంతనాలు సాగిచినట్టు తెలుస్తోంది. ఎలాగో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నందున టిఆర్‌ఎస్‌ ప్రభావం భవిష్యత్తులో ఉండదని తెలంగాణలో కాంగ్రెస్‌ హవానే కొనసాగుతుందని డిప్యూటీ సీఎంతో సహా కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌కు నచ్చజెప్పినట్టు వార్తలొస్తున్నాయి. భవిష్యత్తులో కెసిఆర్‌ కుటుంబ సభ్యులదే టిఆర్‌ఎస్‌లో పెత్తనం కొనసాగే అవకాశం ఉంటుందని.. వారి ఏకపక్ష అజమాయిషీలో ఉండడం కష్టమవుతుందని వివేక్‌కు వారు స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడం వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని వివేక్‌ వారితో చెప్పగా, కాంగ్రెస్‌ ఇప్పుడు ప్రజాభిష్టాన్ని మన్నించిందని అందువల్ల మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని డిప్యూటీ సీఎం ఆహ్వానించినట్టు సమాచారం. వివేక్‌తో పాటు నాగర్‌ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం కూడా కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌కు చేరారు. వివేక్‌తో పాటు ఆయనను కూడా తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. క్రమంగా టిఆర్‌ఎస్‌ ప్రభావాన్ని ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ దూకుడును తగ్గించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు నేతలతో కాంగ్రెస్‌ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నుండి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిన సీనియర్‌ రాజకీయ నాయకుడు కె.కేశవరావును కూడా వెనక్కు తెచ్చేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతోన్నట్టు తెలిసింది.  ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులను కెసిఆర్‌కు దూరం చేసి తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేసింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్న ఉద్యోగ సంఘం జేఏసీ నాయకులకు స్పష్టమైన టికెట్‌ హామీనిచ్చి కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కెసిఆర్‌ వ్యవహార శైలిపై, గతంలో ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై గుర్రుగా ఉన్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్‌ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ను వదలి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిన నాయకులను తిరిగి పార్టీలోకి తేవాలని కాంగ్రెస్‌ అధిష్టానం, తెలంగాణ క్రాంగెస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లోని టిఆర్‌ఎస్‌ నాయకులను పార్టీలోకి తిరిగి తెచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్‌ షాక్‌ ఇచ్చేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతోందని తెలుస్తోంది.