కదిలిన తెలంగాణ జగన్నాథ రథం

సీమాంధ్రుల జగన్నాటకాలు
దొంగ రాజీనామా డ్రామాలు
రంగు బయటపడ్డ వైకాపా
న్యూఢిల్లీ, జూలై 25 (జనంసాక్షి) :
తెలంగాణ జగన్నాథ రథం కదిలింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసింది. రాబోయే నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టేందుకు కావాల్సిన ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం ఢిల్లీలో మినీ కోర్‌ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం విభజనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనాయణకు దిశా నిర్దేశనం చేసింది. పార్టీ లైన్‌ దాటి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశమున్న నేతల వివరాలు ఇప్పటికే సేకరించిన అధిష్టానం వారిని అదుపు చేయాలని ముగ్గురు ముఖ్యులకు సూచించింది. తెలంగాణపై పార్టీ, ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉందని సోనియాగాంధీ నేరుగా సీఎం సహా ఇతర సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పారు. పార్టీ వైఖరితో విభేదించే వారిని కట్టడి చేసి తీరాలని మౌఖిక ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినట్లుగా సమాచారం. దీంతో సీమాంధ్ర నేతలు ఏమీ చేయలేని అశక్తతతో మళ్లీ రాజీనామా డ్రామాలకు తెరతీశారు. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు ఈ రాజీనామాల డ్రామాను షురూ చేశారు. వైకాపా దీనిని సొమ్ము చేసుకొని సీమాంధ్ర ప్రాంతంలో పట్టునిలుపుకోవాలనే యత్నాలు ముమ్మరం చేసింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు స్పీకర్‌కు ఫ్యాక్స్‌ చేశారు. ఈ చర్య ద్వారా వైకాపా తన అసలు రంగును బయటపెట్టుకుంది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. అనంతపురంలో మాట్లాడిన మంత్రి శైలజానాథ్‌ కూడా రాజీనామాలు చేయబోమనే చెప్పారు. ఉదయం వరకు స్తబ్దుగా ఉన్న సీమంధ్ర నేతలు.. ఒక్క సరిగా రాజీనామాలకు దిగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపధ్యం, తొలి విడతలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో.. 2, 3వ విడతల్లో లబ్ది పొందాలన్న వ్యుహంతోనే వైసిపి రాజీనామాలకు తెర లేపిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బూటకమని పిసిసి చీఫ్‌ బొత్స కొట్టి పారేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగానే రాజీనమా చేస్తున్నామని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా సందర్భంగా ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మరికొంత మంది వైకాపా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే కాంగ్రెస్‌ విబజనపై తన అభిప్రాయం చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని చెప్పాలని, ఆ తర్వాత సంప్రదింపులు జరపాలని డిమాండ్‌ చేసారు. ముందుగా వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన ఏడుగురు శాసన సభ్యులు రాజీనామా చేశారు. ఆ పార్టీకి పదిహేడు మంది శాసన సభ్యులు ఉన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసన సభ్యురాలుగా ఉన్నారు. ఆ తరవాత విజయమ్మ తప్ప మిగిలిన శాసన సభ్యులు కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. వారు స్పీకర్‌ ఫార్మాట్లో తమ రాజీనామాలను ఫ్యాక్స్‌ చేశారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజనను కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కాకుండా రాజకీయంగా ఆలోచిస్తోందని బాలినేని విమర్శించారు. రాష్ట్ర బాగోగులను ఆ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయి, రాయలతెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయనే ఆలోచిస్తోందన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్టాన్ని విభజించాలనుకుంటున్నట్లుగా ఉందని మండిపడ్డారు.