కెసిఆర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

-విగ్రహాలు ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

– డిజిపిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

-కరీంనగర్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ సిటీ, ఆగస్టు 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అకారణంగా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా టిఆర్‌ఎస్‌ అధినేత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఉపసంహరించుకోవాలని కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లోని ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధించే దిశగా యుపిఏ, సిడబ్ల్యుసి తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వానికి పంపడం జరిగిందని చెప్పారు. తదనంతరం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతుందని, ఈ తరుణంలో ఆవేశంలో ఉన్న సీమాంధ్రులను రెచ్చగొట్టేవిధంగా కెసిఆర్‌ వాఖ్యలు చేయడం మానుకోవాలని కోరారు. ఆవేదనలో ఉన్న సీమాంధ్రులను రెచ్చగొట్టద్దని కాంగ్రెస్‌ శ్రేణులకు సోనియా హితబోధ చేసినట్లు తెలిపారు. తెలంగాణవాదులకు సంస్కారం ఉందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సహృద్బావ వాతావరణంలో తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి ఉండేందుకు సీమాంధ్రులే పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ నెల 9 నుంచి సెప్టెంబర్‌ 17వ తేదీ వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యే, పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణలో ప్రత్యేక సంబరాలు జరుపుకోనున్నట్లు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన రాష్ట్ర డిజిపికి సీమాంధ్రలో జాతీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం జరుగుతుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పోలీసుల సాక్షిగా సీమాంధ్రలో అఘాయిత్యాలు జరుగుతుంటే లా అండ్‌ ఆర్డర్‌ ఏమైందని నిలదీసారు. డిజిపిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలుగుజాతిని ప్రపంచ దేశాల్లో కీర్తింపజేసిన తెలంగాణబిడ్డ పివి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, అంజయ్య, జలగం వెంగళరావు విగ్రహాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయవద్దని సీమాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర కోరుతున్న అక్కడి ప్రజలు పివి నర్సింహారావులాంటి మహా నేతల విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ మాత్రం ఎన్‌టిఆర్‌, వైఎస్సాఆర్‌, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తామంతా శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొనడం వల్లనే ఈ విగ్రహాలు మిగిలాయని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అర్భన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, నాయకులు సునీల్‌రావు, కన్న కృష్ణ, ఆర్ష మల్లేషం, వాల రమణారావు, గందె మహేశ్‌, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

-టిఎన్‌జిఓస్‌ల సన్మానం

తెలంగాణ ప్రజల అక్షాంను గౌరవిస్తూ సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి తెలంగాణ సాధించే దిశగా తీసుకున్న అనుకూల నిర్ణయంలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ను ఆదివారం ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో టిఎన్‌జిఓ నాయకులు సన్మానించారు. తెలంగాణ ప్రకటనను స్వాగతిస్తూ కేక్‌ కట్‌ చేసి బాణా సంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జిఓస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఏ హమీద్‌, నర్సింహస్వామి, సుద్దాల రాజయ్యగౌడ్‌, మారం జగదీశ్వర్‌, గాజుల నర్సయ్య, గూడ ప్రభాకర్‌రెడ్డి, రామకిషన్‌, శ్రీధర్‌, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వేముల రవీందర్‌, దారం శ్రీనివాస్‌రెడ్డి, హరిమిందర్‌సింగ్‌, రాజేశ్‌, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, సురేందర్‌రెడ్డి, అశోక్‌, రాజేందర్‌, సత్యనారాయణ, సైదులు, మల్లేశం, రమేష్‌, రాఘవరెడ్డి, నారాయణ, కోటేశ్‌, చందు, వెంకటరత్నం, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.