రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉంది

నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తాంధ్ర మీదుగా కోస్తా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించిందన్నారు. దీంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆయా కారణాల ఫలితంగా తేలికపాటి వర్షాలకు అవకాశం ఏర్పడిందన్నారు. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ తీరానికి సమీపంలో కూడా ఉపరితల అవర్తనం ఉన్నా దాని ప్రభావం రాష్ట్రంపై ఉండదని అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రణస్థలంలో 4సెం.మీ.లు, భీమునిపట్నంలో 3సెం. మీ.ల వర్షం కురిసిందన్నారు.