రాజకీయాల్లోకి నాథన్ బ్రాకెన్
సిడ్నీ ,ఆగష్ట్ 12 (జనంసాక్షి): ఆస్టేల్రియా మాజీ ఫాస్ట్‌బౌలర్ నాథన్ బ్రాకెన్ కొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటి వరకూ క్రికెటర్‌గా అలరించిన బ్రాకెన్ ఇకపై రాజకీయ నాయకునిగా మారనున్నాడు. ఆస్టేల్రియాలో వచ్చే నెల జరగనున్న జాతీయ ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా సిడ్నీ నుండి బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.సిడ్నీలోని న్యూసౌత్‌వేల్స్ సీట్ నుండి బ్రాకెన్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సీట్ లేబర్ పార్టీ ఆధీనంలో ఉంది. ఆ పార్టీ తరపున గతంలో గెలిచిన క్రెయిగ్ థామ్సన్ ఇటీవల క్రెడిట్ కార్డ్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు మధ్ధతివ్వాలని ట్విట్టర్ ద్వారా ఈ మాజీ ఆసీస్ బౌలర్ కోరాడు. 35 ఏళ్ళ బ్రాకెన్ మోకాలి గాయం కారణంగా గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రాకెన్ తన కెరీర్‌లో 116 వన్డేలు ఆడి 174 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐదు టెస్టుల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. న్యూసౌత్ వేల్స్‌లో ప్రధానంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బ్రాకెన్ చెబుతున్నాడు.