సఫారీ టూర్‌లో ధావన్‌ ధనాధన్‌

ప్రిటోరియా ,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి): దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న అనధికార ట్రై సిరీస్‌లో భారత్‌ ఎ జట్టు బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌ దుమ్మురేపుతున్నాడు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఎ జట్టుపై డబుల్‌ సెంచరీ చేసి జట్టుకు భారీస్కోరు అందించాడు. ఈ డాషింగ్‌ ఓపెనర్‌ కేవలం 150 బంతుల్లో 248 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ధావన్‌ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు , 7 సిక్సర్లు ఉన్నాయి. లిస్ట్‌ ఎ క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక స్కోర్‌గా నమోదైంది. లిస్ట్‌ ఎ క్రికెట్‌లో సర్రే బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ బ్రౌన్‌ 268 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా… ధావన్‌ 248 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ధావన్‌ సునావిూ ఇన్నింగ్స్‌ భారత్‌ ఎ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 433 పరుగుల భారీస్కోర్‌ సాధించింది. అటు ఇదే మ్యాచ్‌లో పుజారా కూడా సెంచరీ సాధించగా.. మురళీ విజయ్‌ 40 పరుగులు చేశాడు.