రోజర్స్‌ కప్‌ విజేతలు నాదల్‌, సెరెనా

టొరంటో,ఆగష్ట్‌ 12 (జనంసాక్షి): ప్రతిష్టాత్మకమైన రోజర్స్‌ కప్‌ టైటిల్‌ను స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో నాదల్‌ రైనోక్‌పై ఈజీ విక్టరీ కొట్టాడు. అటు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ గెలుచుకుంది. ఏడాది చివరి గ్రాండ్‌శ్లామ్‌ యుఎస్‌ ఓపెన్‌కు ముందు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల వింబుల్డన్‌లో సత్తా చాటలేకపోయిన నాదల్‌ రోజర్స్‌ కప్‌ను గెలుచుకున్నాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఈ మాజీ నెంబర్‌ వన్‌ 6-2, 6-2 స్కోర్‌తో మిలోస్‌ రైనోక్‌పై విజయం సాధించాడు. సెవిూస్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జకోవిచ్‌ను ఓడించిన నాదల్‌ తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాడు. తొలి సెట్‌ ప్రారంభం నుండే పూర్తి ఆధిపత్యం కనబరిచి కెరీర్‌లో 25వ ఏటీపీ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అమెరికా నల్లకలువ సెరెనా విలియన్స్‌ కైవసం చేసుకుంది. ఈ ఫైనల్‌ కూడా ఏకపక్షంగానే ముగిసింది. యుఎస్‌ ఓపెన్‌కు ప్రిపరేషన్‌గా భావించిన తుది పోరులో ఆమె 6-2, 6-0 స్కోర్‌తో అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ సొరానా క్రిస్టేపై ఈజీవిక్టరీ కొట్టింది. ప్రస్తుతం వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా ఉన్న సెరెనా ఖాతాలో ఇది 54వ టైటిల్‌.