విశాఖ రాజధాని అయితే విభజనకు ఒప్పుకుంటాం


మంత్రి కొండ్రు మురళి చీలిన సీఎం కోటరీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనను తాము వ్య తిరేకించడంలేదని, అయితే సీమాంధ్రకు రాజధానిగా విశాఖపట్నాన్ని చేస్తే అందు కు తాము ముందుండి విభ జనకు సహకరిస్తామని రా ష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి పేర్కొన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై కుండబద్దలు కొట్టినట్లుగా అభిప్రాయాలను వెల్లడించారు. లేదంటే ఉత్తరాంధ్రను తెలగాణలో కలపాలన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ నేతలు అవసరమైతే పార్టీ మారేందుకు కూడా వెనుకాడబోరన్నారు. టిడిపి, వైసిపిలతో తమ వారు టచ్‌లో ఉన్నారన్నారు. సరైన స్థానం లభిస్తుందంటే పార్టీలో చేరడం ఖాయమన్నారు. లేనిపక్షంలో కొత్తగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు, షర్మిల యాత్రలను ఏపిఎన్జీఓలు అడ్డుకోవాలని మంత్రి సూచించారు. వారి యాత్రల వల్ల ఉద్యమం నీరుగారిపోయే ప్రమాదం ఉందన్నారు. సీమాంధ్రలోని మంత్రులంతా ఐకమత్యంతోనే ఉన్నామని, ఇందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదన్నారు. ఓడిపోతామనే భయంతో ఉన్నవారే నేడు రాజీనామాలు చేస్తూ తొందర పడుతున్నారని కొండ్రు మురళి తమమంత్రులు, ఎమ్మెల్యేలపై సెటైర్లు విసిరారు. వేరే పార్టీల్లో ఖర్చీప్‌లు వేసుకుని సిద్ధంగా ఉన్నవారే రాజీనామాలు చేస్తున్నారన్నారు. తాము మాత్రం కాంగ్రెస్‌తోనే ఉంటామని, కాంగ్రెస్‌ను ఒప్పించి మెప్పించి సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీఎం కిరణ్‌ కోరుతుండగా, ఆయన కోటరీలో ముఖ్యుడిగా పేరున్న కొండ్రు మురళీ ఒప్పుకోవడంతో ఆయన కోటరీ నిలువునా చీలినట్టయింది.