పోలిసుల్లో గుబులు:
జిల్లాలో సంచలనం సృష్టించిన గోదావరిఖని వన్‌టౌన్ కానిస్టేబుల్ ఎర్రగోల్ల రమేశ్ హత్యకేసులో సీఐడి చార్జిషీట్ దాఖలుతో పోలిసుల్లో గుబులు మొదలైంది. ఈ కేసులో నిందితులు పోలిసులే కావడంతో వారిపై చర్యల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విచారణ సుదీర్ఘకాలంపాటు సాగగా ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. 2010 ఫిబ్రవరి 9న గోదావరిఖనిలో ఓ కేసు విషయమై విచారణకు వెళ్తున్న కానిస్టెబుల్ రమేశ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. మొదట ప్రమాదంగా భావించినా విచారణలో హత్య అని తేలడంతో ఉన్నతాధికారులు పూర్తి విచారణకు ఆదేశించారు. విచారణలో నమ్మలెని నిజాలు వెలుగుచూశాయి. సోంతశాఖ కానిస్టెబుల్ హత్య విషయం తెలిసి, నిందితుడిని కాపాడేందుకు పోలిసు శాఖ అధికారులు ఈ కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేసినట్లుగా తేలింది. దీంతో అప్పటి డీఐజి రవిశంకర్ అయ్యన్నార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీ విచారణ చేయించారు. కేసును పక్కదారి పట్టించేందుకు డీఎస్పీలు రాజేంద్రప్రసాద్, హబీబ్‌ఖాన్, సీఐలు విద్యాసాగర్, వెంకటరమణ యత్నించారని తేలింది. దీంతో ఉన్నతాధికారులు వీరిని కొంత కాలం పాటు సస్పెండ్ చేశారు. తర్వాత అప్రాధాన్య విభాగాల్లో పోస్టింగ్ ఇచ్చారు. కొంత కాలానికి రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చిన వీరు మళ్ళి కీలక పోస్టింగ్‌లు పోందారు. వీరికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చి పోలిసుశాఖ తన పరువు మరింత దిగజార్చుకుంది. దీనిపై జిల్లాలో తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో వారిని మళ్ళీ జిల్లా నుంచి బదిలీ చేశారు. తాజాగా, సీఐడి అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడంతో పోలిసుల్లో మళ్లి గుబులు మొదలైంది. చార్జిషీట్ దాఖలుతో విచారణ వేగవంతం కానుంది. కోర్టు వాయిదాలకు సదరు నిందితులైన అధికారులు హజరవాల్సి ఉంటుంది.డీఎస్పీలు రాజేంద్రప్రసాద్, హబీబ్‌ఖాన్, సీఐలు విద్యాసాగర్, వెంకటరమణపై శాఖాపరమైన చర్యలు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సోంత శాఖ పీసీ హత్యకేసును నీరుగార్చేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పోలిసు అధికారులకు ఈ కేసు విచారణ ఓ చెంపపెట్టులాంటిదని ఆ శాఖ అధికారులే పేర్కోంటున్నారు. అప్పటి డీఐజీ రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే ఈ కేసులో నిజాలు బయటకొచ్చాయని తెలుపుతున్నారు.