రైతన్న ఉసురు తీసిన అప్పులు

కరీంనగర్‌ : అప్పుల భారంతో పంట చేనులోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం .. రైతు ఆరేల్లి పోషయ్య (53) అనే దళితుడికి భూమి లేదు. అప్పులు చేసి రెండెకరాల అటవీ భూమిని చదును చేసుకున్నాడు. రెండేళ్లుగా ఇందులో మొక్కజోన్న, వరి సాగుచేస్తున్నాడు. పంటల సాగు, కుటుంబపోషణకు అప్పు చేయాల్సి వచ్చింది. ‘అటవీ భూమి సాగు చేస్తున్నావు.కేసు నమోదు చేస్తాం .అంటూ అటవీశాఖ అధికారులు బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో పోషయ్య గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు.మొత్తం మూడు లక్షల అప్పు కావడం ,సాగు చేసిన భూమిపై బెదిరింపులు కొనసాగుతుండడం ..అప్పుల వాళ్లు వేదింపులు పెరగడంతో జీవితంపై విరక్తి చెందిన పోషయ్య చేనులోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఘటనా స్థలాన్ని ఏఎస్తై రవీందర్‌ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.