7న జిల్లాకు చంద్రబాబు రాక
గుంటూరు, జూలై 27 : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 7న రేపల్లే నియోజకవర్గంలో పర్యటిస్తారని తెదెపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బిసి ఉద్యమ కారుడు ఛత్రపతి మహారాజ్ జయంతిని పురస్కరించుకొని స్థానిక తెదెపా కార్యాలయంలో శుక్రవారం నాడు సమావేశం నిర్వహించారు. అనగాని మాట్లాడుతూ, నిజాంపట్నం మండలంలో వాన్‌పిక్ బాధితులను కలిసి వారి ఆవేదనను పంచుకొంటారని తెలిపారు. మొదట రేరుకపల్లి మండలం నడింపల్లి అడువుల దీవిలో ఎన్టీఆర్ విగ్రహాలను, కూచినపూడిలో బీసి ఉద్యమనేత సర్దారు గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. అనంతరం గ్రామాల్లో వాన్‌పిక్ బాధితులను కలుస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5,6 తేదీల్లో వాన్‌పిక్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి వారిలో చైతన్యం తెస్తామని తెలిపారు. జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, తెదెపా నాయకులు నాగేశ్వరరావు, మురళీధర్ పాల్గొన్నారు.