సౌదీలో నతాఖా .. తడాఖా -వందల సంఖ్యలో తెలుగువారి అరెస్టులు
దుబాయ్ : సౌదీ అరేబియా ప్రభుత్వం నతాఖా చట్టం కింద అక్రమంగా నివసిస్తున్న విదేశియులపై కొరడా ఝుళిపిస్తోంది. సౌదీకి వివిధ దేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వారు తమ నివాస ప్రతిపత్తి (అఖామా) ని సరిచేసుకోవడం ..లేదా ,దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన ఏడు మాసాల గడువు ముగియడంతో అక్కడి అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు ముమ్మరం చేశారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు పెద్దగా అరెస్ట్ కాలేదు. కానీ మంగళవారం మాత్రం వందల సంఖ్యలో అరెస్టు అయినట్లు తెలుస్తోంది. ముఖ్య నగరాలైన ధమామ్, రియాద్ ,జిద్దా తైప్ ఆల్‌ఖుబర్, మదీనా తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించగా ,వందల సంఖ్యలో తెలుగువాళ్లు పట్టుబడినట్లు అక్కడి పోలీస్ ప్రతినిధి నవాప్ ఆల్ బెట్ ద్రువీకరీంచారు. అవుట్ పాస్‌లు కలిగి ఉన్నవారిని వదిలేసి నివాస ధ్రువీకరణ పత్రాలు లేనివారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్లే అరెస్ట్ చేసి బలవంతంగా ప్రత్యేక పోలీసు వాహనాల్లో జైళ్లకు తరలించినట్లు సమాచారం. రోడ్లతో పాటు ప్రధాన వీధుల్లో ముమ్మర తనిఖీలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు గదుల్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
షర్మిట్ల కోసం పడరాని పాట్లు
సౌదీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎగ్జిట్ పర్మిట్ల కోసం తెలుగువాళ్లు పడరాని పాట్లు పడుతున్నారు.గడువు కంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సైతం సకాలంలో ఎగ్జిట్ పర్మిట్ లభించలేదు.గడువు ముగియడంతో మరికొందరు చాటుమాటుగా వెళ్లి పర్మిట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినా… ఫలితం లేకుండా పోతోంది. దీంతో ప్రధాన కార్యాలయాల సమీపంలో తమకు తెలిసిన వారి నివాసాల్లో పోలీసుల కంటబడకుండా తలదాచుకుంటున్నారు. కొందరికి అవుట్ పాస్‌లు లభించినా …చేతిలో చిల్లి గవ్వలేక ,అప్పులు లభించక తల్లడిల్లుతున్నారు. మరికొందరు డబ్బులు సమకూర్చుకున్నప్పటికీ హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం నేపథ్యంలో విమానాల టికెట్ల రేట్లు అధికమయ్యాయి,. దీంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది.