ఉభయ సభల్లో తెలంగాణ చర్చ కొనసాగుతుంది
సభా సలహాసంఘంలో చర్చకే మొగ్గు
శాసనసభ బాటలోనే మండలి
శుక్రవారం వరకూ చర్చ, తర్వాత కొనసాగించే అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 17 (జనంసాక్షి) :
శాసనసభ, శాసనమండలిలో తెలంగాణ ముసాయిదాపై చర్చ కొనసాగించాలని బీఏసీ సమావేశాల్లో నిర్ణయించారు. ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ, సమావేశాల కొనసాగింపుపై బీఏసీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా చివరకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు అంగీకరించారు. బిల్లుపై చర్చకు బీఏసీ ఓకే చెప్పడంతో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన బీఏసీ సమావేశంలో సీమాంధ్ర నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రాంత నేతల ఒత్తిడికి బీఏసీ ఓకే చెప్పక తప్పలేదు. రేపటి నుంచి తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతుందని స్పీకర్ చెప్పినట్లు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు హరీష్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శుక్రవారం వరకు బిల్లుపై చర్చ జరుగుతుందని చెప్పారు. సమయం సరిపోకపోతే సభ పొడిగింపుపై స్పీకర్ రేపు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని పేర్కొన్నారు. జనవరిలో మరోసారి సమావేశమై తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించనున్నారు. అయితే సమావేశాలను బుధవారంతో వాయిదా వేసి జనవరి 2 లేదా 3 నుంచి ప్రారంభించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బీఏసీలో ప్రతిపాదించారు. సమావేశం జరగుతున్న సమయంలో ఇరు ప్రాంతాల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రేపటి నుంచి తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దామని సీమాంధ్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రేపటితో సమావేశాలు ముగించి జనవరి 2 లేదా 3 నుంచి టీ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహిద్దామన్న సీమాంధ్ర మంత్రుల ప్రతిపాదనను డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాల్సిందేనని వీరిద్దరూ పట్టుబట్టారు. రేపటి నుంచి టీ ముసాయిదా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. క్లాజుల వారీగా చర్చపై ఇరు ప్రాంతాల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రతి అంశంపై ఓటింగ్ జరగాల్సిందేనని సీమాంధ్ర నేతలు పట్టుబట్టారు. ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని సీఎం కిరణ్ ఇది వరకే చెప్పారు. ఆనం ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, మంత్రి శ్రీధర్‌బాబులు తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశాలను కొనసాగించాలని వారు పట్టుబట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం శాసనసభ వ్యవహారాల సలహా సంఘ(బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో సహా, టిడిపి, టిఆర్‌ఎస్, వైకాపా, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, లోక్‌సత్తా పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా బీఏసీ సమావేశంలో తన అభిప్రాయాలు చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ బయటకు వచ్చేసినట్లు తెలిసింది. చర్చ జరగాలని, సభ్యులందరికీ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండాలని సీఎం ఈ సమావేశంలో చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో బిల్లు ప్రవేశపెట్టారని టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు బీఏసీలో ఆరోపించారు. వెంటనే బిల్లు తిప్పి పంపాలని తెలిపారు. అనంతరం సమావేశం నుంచి వాకౌట్ చేశారు. శాసనసభ బీఏసీ సమావేశం నుంచి వైకాపా సభ్యులు కూడా వాకౌట్ చేశారు. అయితే శాసనసభను అడ్డుకోవడం సమంజసం కాదని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ అన్నారు. సభ సజావుగా నడిపేందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభ్యులను కోరారు.మరోవైపు బుధవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర పునర్వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ ప్రారంభమవుతుందని స్పీకర్ చెప్పారని శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు హరీశ్‌రావులు పేర్కొన్నారు. శుక్రవారం వరకు బిల్లుపై చర్చ జరుగుతుందని, సమయం సరిపోకపోతే సభ పొడిగింపుపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడిస్తానన్నారని వారు పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ నేపథ్యంలో అసెంబ్లీలో రేపటి నుంచి ప్రశ్నోత్తరాలు రద్దు కానున్నాయి. నేరుగా ఉదయం 9 గంటల నుంచే టీ ముసాయిదా బిల్లుపై చర్చ జరగనుంది. సమావేశంలో ప్రతి క్లాజ్‌పై చర్చించనున్నారు. ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. టీ ముసాయిదా బిల్లుతో పాటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, వరదల నష్టంపై కూడా సభలో చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. అయితే చర్చతో పాటు ఓటింగ్ జరగాలని సిఎం పట్టుబట్టారని సమాచారం. సమైక్యంపై తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బిఏసిలో డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం అంగీకరించక పోవడంతో వాకౌట్ చేసింది. తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించాలని సీమాంధ్ర టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో ఆయన వాకౌట్ చేశారు. వారు మాట్లాడుతూ కిరణ్ 135 రోజులుగా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాగా, శాసన సభ సమావేశాలను రేపటితో ముగించి జనవరి 2 లేదా 3 నుండి ప్రారంభిద్దామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదించగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చను కొనసాగించాలని పట్టుబట్టారు. రేపటితో సమావేశాలు ముగించి జనవరిలో రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించుదామని ప్రభుత్వం తెలపగా టి నేతలు ససేవిూరా అన్నారు. అయితే శుక్రవారం వరకు సభను నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు. రేపటి నుండి తెలంగాణపై చర్చ అసెంబ్లీని శుక్రవారం వరకు కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై బుధవారం నుండి చర్చ జరగనుంది. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం జనవరిలో సమావేశాలు ఉంటాయి. శుక్రవారం వరకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఎప్పుడు బిఏసి సమావేశానికి పదకొండు మంది హాజరు అవుతారు. ఆరుగురిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.