అర్ధ శతాబ్దపు నిరీక్షణ
రాష్ట్రపతి రాజముద్రే తరువాయి
న్యూఢిల్లీ, డిసెంబర్ 18 (జనంసాక్షి) :
దేశ ప్రజలు యాభై ఏళ్లు ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అర్ధశతాబ్దపు నిరీక్షణ ఫలించింది. మంగళవారం రాజ్యసభ ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుకు బుధవారం లోక్‌సభ కూడా పచ్చజెండా ఊపింది. రాష్ట్రపతి రాజముద్ర పడిందంటే లోక్‌పాల్ బిల్లు-2011 చట్టం కానుంది. బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంతో కేంద్రం లోక్పాల్ బిల్లును రాష్ట్రపతికి పంపింది. పెద్దగా చర్చ లేకుండానే బిల్లు ఆమోదించి పంపడం విశేషం. దీంతో లోక్‌పాల్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. లోక్‌పాల్ బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదం తెలపగా, ఇవాళ లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన చరిత్రాత్మకమైన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గందరగోళ పరిస్థితుల మధ్య బిల్లును నేడు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలతో చేయడంతో లోక్సభ దద్దరిల్లింది. గందరగోళం కొనసాగుతుండగానే లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బీజేపీ బిల్లును సమర్థించింది. సమాజ్‌వాది పార్టీ బిల్లును వ్యతిరేకించింది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో అన్నాహజారే దీక్ష శిబిరం వద్ద సందడి నెలకొంది. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల తర్వాత లోక్‌సభ పునః పరిశీలన నిమిత్తం లోక్‌పాల్ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చర్చను ప్రారంభిస్తూ రెండేళ్లుగా లోక్‌పాల్‌పై సభ లోపల, వెలుపల చర్చ జరుగుతోందన్నారు. లోక్‌పాల్‌పై సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని తుది రూపం ఇచ్చినట్లు చెప్పారు. ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లును పునః పరిశీలించి ఆమోదిద్దామని సూచించారు. కేంద్రానికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని విమర్శించారు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించే విషయంలో కేంద్రం ఏడాది జాప్యం చేసిందన్నారు. ఇదిలావుంటే లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మంగళవారం రాజ్యసభలోను వీరు వాకౌట్ చేశారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ లోక్‌పాల్‌పై కాంగ్రెస్, బిజెపి తొందరపడుతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం తెస్తున్న లోక్ పాల్ బిల్లు ప్రమాదకరంగా ఉందన్నారు. జేడీయూ అధినేత శరద్‌యాదవ్ మాట్లాడుతూ ప్రధాని పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాలి, ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవడం మంచిది కాదని పేర్కొన్నారు. చర్చ అనంతరం లోక్‌పాల్ బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సేవ్ ఆంధప్రదేశ్ నినాదాలతో స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. రెండు అవిశ్వాస తీర్మాన నోటీసులు అందాయని, సభ సజావుగా జరగనిస్తేనే అవిశ్వాస నోటీసులను పరిగణలోకి తీసుకుంటామని స్పీకర్ విూరాకుమార్ ప్రకటించారు. అనంతరం లోక్‌సభ పునః పరిశీలన నిమిత్తం లోక్‌పాల్ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. లోక్‌పాల్ బిల్లుపై చర్చ జరుగు తుండగా మరో వైపు సీమాంధ్ర ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు ఆమోదంతో చరిత్ర నెలకొల్పబోతున్నామన్నారు. లోక్‌పాల్‌తో మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యం కాదని రాహుల్ వాఖ్యానించారు. లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించడంతో రాలేగావ్‌సిద్ధిలోని అన్నాహజారే దీక్షా శిబిరం వద్ద సంబరాలు జరుపుకున్నారు. లోక్‌పాల్ బిల్లును లోక్‌సభ ఆమోదిస్తే దీక్ష విరమిస్తానని హజారే ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు హజారేకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ రెండేళ్లుగా లోక్‌పాల్ బిల్లు కోసం పోరాటం చేశామని, లోక్‌పాల్‌బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ బలమైన లోక్‌పాల్‌ను కోరుకుంటున్నారన్నారు. లోక్‌పాల్‌తో అవినీతి నిర్మూలన సాధ్యం కాకపోయినా ప్రజలకు ఉపశమనం లాంటిదన్నారు. లోక్‌పాల్‌లో సవరణలు సూచించిన సెలెక్ట్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లోపు లోక్‌పాల్ చట్టం అమలు చేయాలని హజారే డిమాండ్ చేశారు.
దీక్ష విరమించిన అన్నా
పూనా : లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే దీక్షను విరమించారు. లోక్‌పాల్ బిల్లును ఆమోదించాలని కోరుతూ మహరాష్ట్రలోని రాలెగావ్ సిద్ధిలో తొమ్మిది రోజులుగా హజారే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించడంతో రాలెగావ్ సిద్ధిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుచిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా అన్నా జిందాబాద్ అంటూ నినాదాలు మర్మోగాయి. లోక్‌పాల్ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో గత మంగళవారం నుంచి దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే ఈరోజు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ పాల్ బిల్లు కోసం గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నానని, ఇప్పటికైనా ఆమోదం పొందడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజల న్యాయం జరిగేటట్లు ఈ బిల్లు రూపోందించారని, లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని హాజారే అన్నారు. మన దేశానికి స్వాత్యంత్రం వచ్చిన 63 ఏళ్లలో ఈ చట్టం ఓక మైలు రాయి అని ఈ బిల్లు వల్ల దేశాన్ని పూర్తిగా మార్చడం సాధ్యం కాకపోయినా కనీసం కొంతవరకూ పెదలకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హజారే కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు కోసం తనతో పాటు ప్రజలందరు రెండేళ్ళు గా ఎదురు చూస్తున్నారని అందరి కల నెరవేరిందని, దేశ ప్రజలందరికి అన్నా హాజారే శుభాకాంక్షలు తెలిపారు. బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించటంతో కేంద్రం లోక్పాల్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఆయన ఆమోద ముద్ర అనంతరం బిల్లు చట్టం కానుంది. దీంతో రాలెగావ్‌లో కూడా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.
అవినీతి అంతానికి లోక్‌పాల్ వజ్రాయుధం : రాహుల్
అవినీతిని అంతం చేయడానికి లోక్‌పాల్ వజ్రాయుధం లాంటిదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌పాల్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు ఆమోదంతో చరిత్ర నెలకొల్పబోతున్నామన్నారు. లోక్‌పాల్‌తో మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యం కాదని రాహుల్ వాఖ్యానించారు. అవినీతిని అంతమొందించాలనే భావన దేశ ప్రజల్లో బలంగా వచ్చినప్పుడే లంచం ఇవ్వడం మానేస్తారని అన్నారు. ప్రతి పనికి ఇంత అని ఇవ్వడం అలవాటుగా మారిందని, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కూడా తాము చేయించే పనులకు ఇంత అని వసూలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఈ బిల్లు ద్వారా అలాంటి అవినీతి కొంత వరకు తగ్గుతుందన్నారు.