ఆంధ్రోళ్ల ఆగడాలపై రాష్ట్రపతిని కలుస్తాం
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 20 (జనంసాక్షి) :
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్ర విభజన బిల్లు పరిణామాలను వివరిస్తామని రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. బిల్లులోని మార్పులు, చేర్పుల అంశాలపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సంతకాలు సేకరిస్తామని, బిల్లు పరిణామాలపై తెలంగాణవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అయితే తెలంగాన బిల్లు పాస్ అయ్యే వరకు అప్రమత్తంగా ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలను సాగనివ్వమని కోదండరామ్ అన్నారు. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముసాయిదా బిల్లులోని అభ్యంతరాలపై సవరణలను డిమాండ్ చేస్తూ అఫిడవిట్‌పై తెలంగాణ ప్రాంత ఎమ్మల్యేల సంతకాల సేకరణ చేస్తామని చెప్పారు. బిల్లుపై తెలంగాణలో జిల్లాల వారిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, బిల్లును తెలుగు, ఉర్దూ, భాషల్లోకి తర్జుమా చేసి అందరికీ పంచుతామని చెప్పారు. రాష్ట్రపతిని కలసి తాజా పరిస్థితులను వివరస్తామని, ఎమ్మెల్యేలు సంతాకాలు చేసిన అఫిడవిట్లు ఆయనకు అందజేస్తామని చెప్పారు. బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చిన సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్వయహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. అభ్యంతరాలను చర్చించాల్సి ఉండగా బిల్లు ప్రతులను చించి వేయడం దారుణమన్నారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. తెలంగాణ కల సాకారమవుతున్న దశలో వారు ఇలా వ్వయహరించి ఈ ప్రాంత ప్రజలను అవమానించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తప్పదని తెలిసి వారు ఇలా వ్వయహరిస్తున్నారని టీజీవో నేతలు అన్నారు. బిల్లుపై చర్చించకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని దేవిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదన్నారు. బిల్లు పాసయ్యే వరకు తెలంగాణ ప్రజలు అప్రమమత్తంగా ఉండాలన్నారు. సీమాంధ్రుల కుట్రలను అడ్డుకోవాలన్నారు. తక్షణం అసెంబ్లీలో చర్చించి గడువలోగా బిల్లును కేంద్రానికి పంపాలన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారిని ఈ ప్రాంత ప్రజలు క్షమించరని టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ అన్నారు. అసెంబ్లీలో వారి చర్య ప్రజలు ఏవగించుకునేలా ఉందన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ఈ సమావేశంలో మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.