కొలువుదీరిన కేజ్రీవాల్
ప్రమాణం చేసింది నేనూ కాదు.. ఢిల్లీ ప్రజలు
లంచం ఇవ్వద్దు
అడిగితే ఓ నంబరిస్తా ఫోన్ చేయండి
అధికార గర్వం మంత్రుల తలకెక్కొద్దు
సామాన్యుల్లా మెలగండి సేవ చేయండి : కేజ్రీవాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 28 (జనంసాక్షి) :
ఢిల్లీ రాజకీయాల్లో కొత్త శక్తి ఆవిష్కృతమైంది. అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు అరవింద్ కేజీవ్రాల్ న్యూఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శనివారం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజీవ్రాల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ రామ్‌లీలా మైదనాంలో ప్రజల సమక్షంలో ఈ ప్రమాణ కార్యక్రమం అత్యంత సాదాసీదాగా సాగింది. హిందీలో ఆయన ప్రమాణం చేశారు. సమాచారహక్కు కార్యకర్త, మాజీ జర్నలిస్టు మనీశ్ సిశోడియా, తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా అతి పిన్న వయసులో ప్రమాణం చేసిన వ్యక్తిగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ శాసనసభలో అత్యంత చిన్న వయసు ఎమ్మెల్యే రాఖీ బిర్లా(26), ఢిల్లీ నగరంలో ఆప్ తరపున విద్యుత్, తాగునీరు కోసం పోరాడిన గిరీశ్ సోనీ, ఇంజినీరింగ్, లా పట్ట భద్రుడు సౌరభ్ భరద్వాజ్, ఆర్కిటెక్ట్ వృత్తి నిపుణుడు సత్యేంద్ర జైన్, ఖరగ్‌పూర్ ఐఐటీ పూర్వ విద్యార్థి, న్యాయవాది సోమ్‌నాథ్ భారతిలు కూడా మంత్రలుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి తరలి వచ్చిన ఢిల్లీ వాసులతో రామ్‌లీలా మైదాన్ జన సంద్రంగా మారింది.తన లాంటి సామాన్యుడు ముఖ్యమంత్రి అయ్యారంటే అది ఢిల్లీ ప్రజల విజయమేనన్నారు. అధికారులు, నాయకులు, పోలీసులూ కాదు ప్రభుత్వాన్ని నడిపేది ప్రజలేనని వెల్లడించారు. ప్రజల కోసం, దేశం కోసం ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విశ్వాస పరీక్షలో నెగ్గితే సరే లేకుంటే మళ్లీ ప్రజాతీర్పు కోరతామని తెలిపారు. ఇవాళ చరిత్రాత్మకమైన రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా నీతివంతమైన, జవాబుదారీ పాలన అందిస్తానని సీఎంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజీవ్రాల్ ప్రకటించారు. ప్రమాణస్వీకారం అనంతరం కేజీవ్రాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుతోనే తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మన ముందున్నది మహాసంగ్రామమేనని ఢిల్లీ ప్రజల అన్ని సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజల సహకారంతో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతిని అకిడతామని చెప్పారు. దుష్ట రాజకీయాల వల్లే అందాల్సి సౌకర్యాలు ప్రజలకు అందడం లేదన్నారు. మాది ప్రజల ప్రభుత్వం, దేశ రాజకీయాలను శుద్ధి చేస్తామని కేజీవ్రాల్ స్పష్టం చేశారు. అన్నట్లుగానే కేజ్రీవాల్ అతని అనుచరులు మెట్రో రైలులో వచ్చారు. కేజీవ్రాల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దాదాపు 60 వేల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద యెత్తున సందడి నెలకొంది. ప్రమాణ స్వీకారం తర్వాత కేజీవ్రాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతటి విప్లవం వస్తుందని తాము ఊహించలేదని ఆయన అన్నారు. ఇది ప్రజల విజయమని అన్నారు. అన్నా హజారే శుభాకాంక్షలు అందజేశారు. అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేకపోతున్నానని అన్నారు. తన శుభాశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.
భ్రష్టుపట్టిన రాజకీయాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని కేజీవ్రాల్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత ఆయన మాట్లాడుతూ, అన్నా అన్నట్లు ఇవి బురదమయ రాజకీయాలని, అయితే ఈ బురదలోనే దిగి వీటిని శుభ్రం చేయాల్సి ఉందన్నారు. దేశంలో నేడు చారిత్రాత్మకమైన రోజు అని, ఇది సామన్యుడి విజయమని, ఇది ఆరంభం మాత్రమే ఇంకా పోరాడాల్సింది చాలా ఉందన్నారు. ప్రమాణ స్వీకారం చేసింది కేజీవ్రాల్ ఒక్కడే కాదు.. ప్రతి ఢిల్లీవాసి ప్రమాణస్వీకారం చేసినట్లేనని కేజీవ్రాల్ పేర్కొన్నారు. డబ్బుతోనే కాకుండా, నిజాయితీగా ఎన్నికలు గెలవచ్చని ఆమ్‌ఆద్మీ నిరుపించిదన్నారు. ఈ ప్రభుత్వం రెండు కోట్ల ప్రజల సర్కార్ అని ఆయన వివరించారు. రాజకీయాలు బురద అని ”అన్నా’ ఎప్పుడూ అంటుండేవారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బురదను క్లీన్ చేయడానికే చీపురు రాజ్యం వచ్చిదన్నారు. లంచం ఇవ్వవద్దని, అలాగే తీసుకోవద్దన్నారు. ఇందుకు అందరూ సహకరించాలన్నారు. రాజకీయాల్లో డబ్బులతోనే కాకుండా నిజాయితీగా కూడా ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని నిరూపించామని ఆయన అన్నారు. ఈ రోజు కేజీవ్రాల్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదని, ఢిల్లీకి చెందిన ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల ప్రభుత్వమని ఆయన అన్నారు. రాజకీయాలు బురద అని అన్నా హజారే అంటుండేవారని, ఆ బురదను ఊడ్చివేయడానికి చీపురు రాజ్యం వచ్చిందని ఆయన అన్నారు. అవినీతి అంతానికి ఫోన్ నెంబర్ తనకు అన్నా హజారే ఆశీస్సులున్నాయని ఆయన చెప్పారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే ఫోన్ చేసి చెప్పాలని, అందుకు తాము ఫోన్ నెంబర్ ఇస్తామని, రెండు రోజుల్లో ఆ ఫోన్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. లంచం ఇవ్వను, తీసుకోను అని ఆయన ప్రజలతో శపథం చేయించారు. పదవుల కోసం కాదు, సమస్యల పరిష్కారానికే పోరాడమని ఆయన చెప్పారు. తాము తిరిగి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, తిరిగి పెద్ద యెత్తున విజయం సాధించి అధికారానికి వస్తామని ఆయన చెప్పారు.ఇది ప్రారంభం మాత్రమేనని, పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దేశంలో ఇది చారిత్రకమైన రోజు అని ఆయన అన్నారు. తమ వద్ద మంత్రదండం లేదని, ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే రేపే సమస్యలు పరిష్కారం కాబోవని, అయితే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు ఢిల్లీ ప్రజలకు నీతవంతమైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రజలు కలిసి పనిచేస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. అధికారులు, నాయకులు, పోలీసులూ కాదు ప్రభుత్వాన్ని నడిపేది ప్రజలేనని వెల్లడించారు. ప్రజల కోసం, దేశం కోసం ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విశ్వాస పరీక్షలో నెగ్గితే సరే లేకుంటే మళ్లీ ప్రజాతీర్పు కోరతామని తెలిపారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఇది సామాన్యుల సభ అని, అయితే ఎవరూ అత్యుత్సాహంతో ముందుకు వచ్చి పోలీసులకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. ఢిల్లీ ప్రజలు ఈసారి శాసన సభ ఎన్నికల్లో చాలా పెద్ద విజయం సాధించారు. దేశవాసులు చాలా నిరాశలో ఉన్నారు. ఈ దేశాన్ని ఏమీ బాగుచేయలేమని, రాజకీయాలు కుళ్లిపోయాయని అనుకున్నారు. కానీ, నిజాయితీతో కూడా రాజకీయాలు చేయొచ్చని, దాంతోనే గెలవచ్చని ఢిల్లీ ప్రజలు చేసి చూపించారు. రెండేళ్ల క్రితం అసలు ఇలా ఆలోచించగలిగేవాళ్లం కూడా కాదు. ఇది కేవలం మా వల్ల కాదు. ఇదేదో దేవుడు చేసిన చమత్కారం. అందుకే ఈశ్వరుడు, అల్లా అందరికీ కృతజ్ఞతలు. ఇది కేవలం ప్రారంభమే. ఇంకా చాలా పోరాడాల్సి ఉంది. ఇది కేవలం మా ఆరుగురం మాత్రమే పోరాడలేం. ఢిల్లీకి చెందిన కోటిన్నర మంది మొత్తం పోరాడితేనే అవినీతిని అరికట్టగలం అన్నారు. సమస్యలన్నింటికీ పరిష్కారం మా వద్దే ఉందన్న గర్వం మాకు లేదు. అలాంటి సమాధానం కూడా మా దగ్గర లేదు. కానీ, ఢిల్లీ ప్రజలంతా ఒక్కటైతే పరిష్కారం లేని సమస్యలంటూ మిగలవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఎందుకు బాగోలేదంటే రాజకీయాలు బాగోలేదు. కరెంటు బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తాయి, నీళ్లు ఎందుకురావు, రోడ్లు ఎందుకు పాడయ్యాయి.. అన్నీ కుళ్లు రాజకీయాల వల్లే. వాటిని బాగు చేయాలనే నేను వాటిలోకి వచ్చాను. సంతోష్ కోహ్లీ అనే సహచరురాలిని మేం కోల్పోయాం. ఆమె లేకపోవచ్చు గానీ, ఆమె ఆత్మ మాత్రం ఎక్కడున్నా సంతోషిస్తుంది. గత కొన్ని రోజులుగా నేను ఢిల్లీలోని కొందరు అధికారులను కలిశాను. కొందరు అవినీతిపరులు కావచ్చు గానీ చాలామంది నిజాయితీపరులున్నారు. వాళ్లతోనే మనం వ్యవస్థను బాగుచేయచ్చు. దేశమంతా కూడా ఒక్కటిగా అయితే, ప్రజలు ఒక్కటిగా అయితే, నాయకులు ఒక్కటిగా అయితే అవినీతి, పేదరికాలను దేశం నుంచి తరిమి కొట్టగలం. మా మంత్రులు, కార్యకర్తలు అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను. మన మనస్సులో ఎప్పుడూ గర్వం రాకూడదు. అలా వస్తే ఇన్నాళ్ల పోరాటం వృథా అవుతుంది. ఇతర పార్టీల గర్వాన్ని అణిచేందుకు వచ్చాం. మన గర్వాన్ని అణిచేందుకు మరో పార్టీ రావల్సిన అవసరం రాకూడదు. మేం మంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వడానికి రాలేదు. సేవ చేయడానికి వచ్చాం. ఈ సేవా భావాన్ని మనం మరువకూడదు.ఢిల్లీ ప్రజలంతా కలిసి చాలా పెద్ద శక్తులతో పోరాడారు. ఆ శక్తులన్నీ ఊరికే కూర్చోవు. నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి గానీ ఇప్పుడు వాటిని ప్రస్తావించను. మన మార్గంలో చాలా రాళ్లు, ముళ్లు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదుర్కోడానికి మేం సిద్ధం. రాబోయే ఏ ఎన్నికనైనా కూడా ఎదుర్కోడానికి నేను సిద్ధం. మావిూద చాలా పెద్ద బాధ్యతను ఢిల్లీ వాసులు ఉంచారు. కానీ ఈ బాధ్యతను నెరవేర్చాలంటే మాకు ఢిల్లీ ప్రజల సాయం కావాలి. వారి ఆశలు చూస్తే నాకు భయం వేస్తుంది. మాతో ఎలాంటి తప్పులు తెలిసి, తెలియక చేయించద్దని భగవంతుడిని కోరుతున్నాను. పోరాటంలో నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ చాలా మంచి వ్యక్తి. ఆయన పార్టీ గురించి మాత్రం నేను చెప్పలేను. కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీలకూ ఇదే వినతి. విూరు చేస్తున్న పని దేశం కోసమే అయితే.. పార్టీ విభేదాలు మర్చిపోండి. ఈ పోరాటంలో నాతో కలిసి రండి. వారం రోజుల తర్వాత విశ్వాస తీర్మానం వస్తుంది. కొందరు అందులో మేం ఓడిపోతామంటున్నారు. దాని గురించి మాకు బాధ లేదు. ఓడిపోతే మళ్లీ ప్రజల ముందుకు వస్తాం. ఎన్నికల్లో పోరాడతాం. ప్రజలు మాకు అప్పుడు భారీ మెజారిటీ ఇస్తారు. గత రెండేళ్లుగా దేశంలో చాలా పోరాటాలు జరుగుతున్నాయి. అన్నా హజారే ఇక్కడకు వచ్చి దీక్ష చేసినప్పుడు దేశమంతా కదిలి వచ్చింది. ఇలా ఎలా జరిగిందని నేను ఆలోచించాను. అలాగే నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు కూడా అందరూ రోడ్లవిూదకు వచ్చారు. దేశంలో చాలా పెద్ద విప్లవం వస్తోంది. ఇది రాబోయే రోజుల్లో పెద్దశక్తిగా మారుతుందన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు మనమంతా కలిసి ఢిల్లీని మార్చాలి. ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోము, ఇవ్వబోమని శపథం చేయాలి. రేషన్ కార్డు కావాలన్నా, ఏం కావాలన్నా ఇన్నాళ్లూ లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఇక మీదట ఎవరైనా లంచం అడిగితే విూరు ఇవ్వబోమని చెప్పద్దు. విూకు రెండు రోజుల్లోనే ఓ ఫోన్ నెంబర్ ఇస్తాం. దానికి ఫోన్ చేసి చెప్పండి. లంచగొండులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందాం. మీ పని నేను చేయిస్తాను. జీవితంలో ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వను, తీసుకోను అని అందరూ శపథం చేయండ’ అంటూ తన ప్రసంగం ముగించారు. చివరిలో ఎప్పటిలాగే తమ పార్టీ ప్రార్థన చేశారు.. అదే సమయంలో ప్రజలందరితో చేయించారు. ఆయన ప్రసంగానికి ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
కేజీవ్రాల్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ తన మొదటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వంలోని మంత్రులుగానీ, అధికారులుగానీ ఎర్రబుగ్గలు వినియోగించడానికి వీలు లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినాహా అధికారులకు ఎస్కార్ట్ వాహనాలు సమాకూర్చడం కుదరదని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజీవ్రాల్ మంచి పాలన అందిస్తారనే నమ్మకం ఉందని ప్రజాస్వామ్య నేత అన్నాహాజారే ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అన్నా అభినందనలు తెలిపారు. అనారోగ్య కారణాల కారణంగా ఆయన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి హజారు కాలేదు. ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
- ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్
- నారా లోకేశ్ కు భక్తుడి ఫిర్యాదు.. 24 గంటల్లోనే చర్యలు
- పెద్ద ధన్వాడకు భారీగా చేరిన రైతులు
- ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు
- అక్రమ వలసదారుల్లో గుబులు
- ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..
- దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మరిన్ని వార్తలు