అభివృద్ధి మాత్రమే యువత భవిష్యత్తును నిర్ణయిస్తుంది : మోడీ

రాంచీ : జార్ఖండ్‌ సహజ వనరులకు నిలయమైనా అభివృద్ధిలో వెనకబడి ఉందని, జార్ఖండ్‌ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవలసిన సమయం ఇదని భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. రాంచీలో విజయ్‌ సంకల్ప్‌ ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ప్రజల ఆకాంక్ష మేరకే వాజ్‌పేయి జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. ఆనాడు ఏర్పాటుచేసిన మూడు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి మాత్రమే యవత భవిష్యత్తును నిర్ణయిస్తుందని మోడీ పేర్కొన్నారు. భాజపా పాలనలో ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందన్నారు. 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ జార్ఖండ్‌ ప్రజల ఆకాంక్షను పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా తాగునీటి కష్టాలు తీరలేదన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుతవం భారీగా కోతలు పెడుతోందని మోడీ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో భాజపాను గెలిపించాలని ఆయన జార్ఖండ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.