మోడీ వెన్నులో కేజ్రీ వణుకు

దేశ రాజధానిలో పనిచేయని మోడీ మేనియా
సీట్లు పెరిగినా పడిపోయిన ఓట్ల శాతం
ఆప్‌ విస్తరణ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో మోడీ ప్రభావానికి గండి
2014 ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కమలనాథుల అంతర్మథనం
సెక్యులర్‌ ముసుగుకు మోడీ ఆరాటం
వెంటాడుతున్న 2002 నరమేధం
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) :
దశాబ్దం క్రితం కేంద్రంలో అధికారం కోల్పోయిన బీజేపీ ఎలాగైనా మళ్లీ దాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఈసారి అధికారం దక్కకపోతే ఇక ఎప్పటికీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తోందని ఆ పార్టీ అగ్రనాయకత్వం నిర్దారణకు వచ్చేసింది. ఊరిస్తోన్న ఢిల్లీ పీఠం.. నానాటికీ తీసికట్టుగా మారుతోన్న పార్టీ ప్రాభవం.. నాయకత్వలేమి.. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా సీనియర్‌ నేతల వైఖరి. రామమందిర నిర్మాణం.. హిందుత్వ ఎజెండా ఓట్లు రాల్చని ధైన్యం. వీహెచ్‌పీ, భజరంగదళ్‌ నాయకత్వం బీజేపీని తూర్పారబట్టి తూ.. అన్న వైనం. సెక్యులర్‌ దేశంలో మత రాజకీయాలను.. మెజార్టీ ప్రజల మనోభావాలను రగల్చడం ద్వారా ఒకనాడు ఢిల్లీ అధికారపీఠాన్ని దక్కించుకున్న ఆ పార్టీ కార్గిల్‌యుద్ధంతో అధికారాన్ని నిలుపుకుంది. పాలనలో ఎన్‌డీఏ వేసిన తప్పటడుగులతో ఆ కూటమిని రెండు పర్యాయాలు ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు తప్పితే.. అనే పరిస్థితుల్లో హిందుత్వ అతివాద రాజకీయాలతో గుజరాత్‌లో మూడుసార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్‌ చేసింది. అద్వానీలాంటి అగ్రనేతలు వద్దంటున్నా వినకుండా, నమో.. నీవే దిక్కంటూ వ్యక్తి పూజకు దిగజారింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం నమో ప్రసాదమంటూ ఆకాశానికెత్తేసింది. ఫలితాల కిక్కు వీడి ఓట్ల లెక్కలు చూసి కళ్లు బైర్లు కమ్మి పడిపోయింది. దేశవ్యాప్తంగా మోడీ మేనియా తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందని ఆశపడ్డ ఆ పార్టీ నాయకత్వానికి ఢిల్లీ ఫలితాలు దిమ్మదిరిగేలా చేశాయి. ఒకేఒక్కడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నే కాదు బీజేపీ భవిష్యత్‌ ఆశాకిరణం మోడీ మేనియాను చీపురుతో ఊడ్చేశాడు.
ఇప్పుడు దేశ రాజకీయాల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలనం. అతి సామాన్యుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు ప్రజాస్వామ్యంపై కొత్త ఆశలు చిగురింపజేశాడు. పార్టీ ప్రారంభించిన ఏడాది కాలంలోనే దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఐఆర్‌ఎస్‌కు అతి తక్కువ కాలంలోనే గుడ్‌బై చెప్పి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన కేజ్రీవాల్‌ ఆరేళ్ల తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. సమాచార హక్కు చట్టంపై దేశవ్యాప్తంగా ఉద్యమించిన ఆయన రామన్‌ మెగసెసే అవార్డును సొంతం చేసుకున్నారు. అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు నడిపారు. సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకొని అనతికాలంలోనే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువతను, విద్యార్థులను, సామాన్య ప్రజలను భాగస్వాములను చేశారు. ఆ తర్వాత అన్నాతో విభేదించి రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు సహచరుల నుంచే విమర్శలు ఎదురైనా ఏమాత్రం వెరవకుండా ముండుగువేశారు కేజ్రీవాల్‌. ఇలాంటి పార్టీల్నెన్నో చూశాం అంటూ ఎద్దేవా చేసిన రాజకీయ పక్షాలను చావుదెబ్బ తీశాడు. తన లక్ష్యం అవినీతి నిర్మూలన అని, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండి తనాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తానని ప్రతిన బూనాడు. తనలాగే ఆలోచించే.. తనలాగే పనిచేసే బృందంతో కలిసి ముండుగువేశారు. ఏడాది కాలంలోనే ఢిల్లీలో నివసించే సాధారణ ప్రజలు, మధ్యతరగతి, ఆటోవాలాలు, విద్యార్థులు, యువతను ఆకర్షించాడు. ఓట్లంటే పెట్టుబడి రాజకీయాలుగా మార్చేసిన పార్టీల వైఖరికి భిన్నంగా, మద్యం సీసా, నోటు ఇవ్వందే ఓటు వేయరన్న అపవాదు ఎదుర్కొంటున్న ప్రజలను స్వచ్ఛందంగా పోలింగ్‌ బూత్‌ల వైపు నడిపించారు కేజ్రీవాల్‌. ఒక్క రూపాయి పంచకుండా, ఎలాంటి ప్రలోభాలు ఎరచూపకుండా, తాయిలాలు ఇవ్వకుండా ఢిల్లీ ఓటర్లను లైన్లో నిల్చొబెట్టి మరీ ఈవీఎం మీటా నొక్కింపజేశారు. అవినీతిని ఊడ్చేస్తానని చీపురుకట్ట గుర్తుతో ప్రజలను ఓట్లు అభ్యర్థించిన కేజ్రీవాల్‌ అధికారానికి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోయారు. ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పనిచేస్తానని చెప్పారు. 70 ఎమ్మెల్యే స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ 28 సీట్లు సొంతం చేసుకుంది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఎనిమిది సీట్లతో సరిపెట్టుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోందనుకుంటున్న తరుణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతిస్తామంటూ ముందుకొచ్చాయి. ఢిల్లీలో కేజ్రీవాల్‌ మేనియాను ఉపయోగించుకొని 2014లో కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని రెండు రాజకీయ పక్షాలు భావించాయి. కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలపై ఎన్నికల భారం తప్పించేందుకు ప్రజాభిప్రాయానికి వెళ్లారు. మెజార్టీ ప్రజల ఆమోదంతో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తీసుకొని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి కేజ్రీవాల్‌ ఎంతగా కష్టపడ్డారో అధికారం చేపట్టాక అంతే ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సాధారణ ప్రజలతో కలిసి మెట్రో రైళ్లో ప్రయాణించి వచ్చాడు. ప్రభుత్వ బంగళా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని నిరాకరించాడు. సాధారణ కుర్చీపై కూర్చొని ఢిల్లీ పాలనపగ్గాలు నిర్వర్తిస్తున్నాడు. బుగ్గకార్లను తానే కాదు తన మంత్రివర్గ సహచరులు కూడా ఉపయోగించబోరని స్పష్టం చేశాడు. పాలన అంటే జవాబుదారీతనమే తప్ప అడంబరాలు కాదని కేజ్రీవాల్‌ చేతల్లో చూపాడు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నడుపుతానని, పది రోజుల్లో వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని పేర్కొన్నాడు. తద్వారా తాను ఓట్లు అడిగే ముందే కాదు అధికారంలో ఉన్నా ఆమ్‌ ఆద్మీనేనని నిరూపించాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీని దేశం మొత్తం విస్తరింపజేస్తానని, మొదట దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అడుగుపెడతామని చెప్పాడు.
కేజ్రీవాల్‌ మేనియా దేశమంతా విస్తరిస్తున్న సమయంలో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. తాము ఎన్నో ఆశలు పెట్టుకొని గుజరాత్‌ను తెచ్చుకున్న మోడీ ప్రభావం కేజ్రీ ముందు దిగదుడుపేనని గుర్తించింది. ఇందుకు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనే ప్రమాణికంగా తీసుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40.31 శాతం ఓట్లతో 43 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 36.34 శాతం ఓట్లతో 23 స్థానాలు దక్కించుకుంది. 14.05 శాతం ఓట్లను సాధించిన బీఎస్పీ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకుంది. లోక్‌జనశక్తి పార్టీ 1.35 శాతం ఓట్లతో ఒక్క సీట్లో గెలుపొందింది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ దాదాపు 15 శాతం ఓట్లు కోల్పోయి కేవలం ఎనిమిది సీట్లకు పరిమితమైంది. ఈసారి ఎనిమిది స్థానాలు అధికంగా సాధించి 31 సీట్లలో గెలుపొందిన బీజేపీ 33 శాతం ఓట్లే సాధించింది. అంటే ఢిల్లీలో బీజేపీ 3.34 శాతం ఓట్లు కోల్పోయింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 30 శాతం ఓట్లతో 28 సీట్లు సాధించింది. కేవలం ఏడాది వ్యవధిలో 30 శాతం ఓట్లను సాధించడం మామూలు విషయం కాదు. అదీ నోట్లు, మందు బాటిళ్లతో ఓట్లు కొనుగోలు చేసే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా 30 శాతం ఓట్లు పొందడం కేజ్రీవాల్‌ ఘనతే. దేశమంతటా మోడీ మేనియా పనిచేస్తుందని, ఆయన గ్లామర్‌తో తమ పార్టీకి ప్రజలు ఓట్లు గుద్దేస్తారని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా మారింది ఢిల్లీ ఫలితాల తర్వాత.
సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు నేతల తలరాతలను ఎలా మారుస్తాయో మనం గతంలో ప్రత్యక్షంగా చూశాం. దేశంలోని 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, జార్ఖండ్‌లో జేఎంఎం, నాగాలాండ్‌లో ఎన్‌పీఎఫ్‌, బీహార్‌లో జేడీ(యూ), సిక్కింలో ఎస్డీఎఫ్‌, తమిళనాడులో ఏఐఏడీఎంకే, త్రిపురలో సీపీఎం, ఉత్తప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, మహారాష్ట్రలో కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మినహా మోడీ ప్రభావం మరెక్కడా కనిపించడం లేదు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యూపీఏ 37.22 శాతం ఓట్లతో 262 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 24.63 శాతం ఓట్లతో 159 స్థానాల్లో విజయం సాధించింది. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 26.53 శాతం ఓట్లతో 145 లోక్‌సభ స్థానాలు దక్కించుకోగా బీజేపీ 22.16 శాతం ఓట్లతో 138 ఎంపీలు దక్కించుకుంది. 1999 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 37.06 శాతం ఓట్లతో 270 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ 0.15 శాతం ఓట్లు కోల్పోయినా 16 స్థానాలు అధనంగా దక్కించుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ 28.30 శాతం ఓట్లతో 156 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో యూపీఏ 2.48 శాతం ఓట్లను అధికంగా దక్కించుకున్నా తొమ్మిది లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. 1998 ఎన్నికల్లో బీజేపీ 25.59 శాతం ఓట్లతో 182 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్‌ పార్టీ అంతకంటే 0.33 శాతం ఓట్లను అధికంగా పొందినా 141 (25.82 శాతం ఓట్లు) స్థానాలే సాధించింది. ఈ ఎన్నికల్లో 5.4 శాతం ఓట్లతో సీపీఎం 32 లోక్‌సభ స్థానాల్లో విజయడంకా మోగించగా, సమాజ్‌వాదీ పార్టీ 4.93 శాతం ఓట్లతో 20 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ 4.67 శాతం ఓట్లు దక్కించుకున్నా కేవలం ఐదు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆర్జేడీ 2.78 శాతం ఓట్లతో 17, టీడీపీ 2.77 శాతం ఓట్లతో 12 సీట్లలో విజయం సాధించాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు శాతం ఓట్లు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును శాసిస్తాయి. వస్తూనే ఢిల్లీలో 30 శాతం ఓట్లు దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలకు అతి త్వరగా విస్తరించే అవకాశముంది. నరేంద్రమోడీకి కాస్తో కూస్తో పట్టున్న ప్రాంతాల్లో కేజ్రీవాల్‌ పాగా వేస్తే బీజేపీకి అధికారం కాదు కదా కనీసం గౌరవ ప్రథమైన స్థానాలు దక్కడం కూడా కష్టమే. మరోవైపు ఒక్కప్పటి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు మోడీ కారణంగా అటువైపు చూడ్డం కూడా లేదు. ప్రస్తుతానికి భాగస్వామ్య పక్షంగా ఉన్న మరో హిందుత్వ అతివాద పార్టీ శివసేనా మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. మోడీకి ప్రమోషన్‌ను నిరసిస్తూ ఎన్‌డీఏలో ప్రధాన భాగస్వామ్యపక్షం జేడీ(యూ) బయటకు వచ్చేసింది. దక్షిణాదిలో అధికారాన్ని దక్కించుకున్న కర్ణాటకలో పార్టీ చావుదెబ్బ తిని ఉనికిని వెదుక్కోవాల్సిన పరిస్థితి. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకే మినహా మరే పార్టీ ఎన్‌డీఏ వైపు చూడ్డం లేదు. మోడీ ప్రభావంతో వచ్చే పాజిటివ్‌ ఓటు కోసం ఎన్‌డీఏ వెనుక పరుగెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల ఎన్‌డీఏకు ఎలాంటి ప్రయోనమూ లేదు. ఆయనకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏపీలో గెలిచే ఒకటి అరా సీట్లను బీజేపీ కోల్పోయింది. మోడీ మత తత్వంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని ఆలస్యంగా గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు ఆయనకు సెక్యులర్‌ ముసుగు తొడిగి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం విజయవంతంగా విఫలమైంది. కార్పొరేట్‌ మీడియా, సంస్థలు మినహా సామాన్యులెవరూ మోడీ వెనుక నడవడం లేదు. ఆయన 2002లో గోద్రాలో సృష్టించిన నరమేధం బీజేపీని వెంటాడుతోంది. ఆయనకు మద్దతుగా నిలిస్తే అవే హత్యా రాజకీయాలకు మద్దతిచ్చిన వారవుతామని ప్రాంతీయ పార్టీలు ఎన్‌డీఏ వైపు చూసేందుకే భయపడుతున్నాయి. మరోవైపు కేజ్రీవాల్‌ అధికారం దక్కించుకున్నాక సామాన్యుడిలా మారి దేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. ఈనేపథ్యంలో గుజరాత్‌ మారణహోమం బాధితుడిని తానుకూడా అంటూ మోడీ మొన్నటికి మొన్న మీడియా ఎదుట విచారం వ్యక్తం చేశారు. అవన్నీ రాజకీయ పక్షాలను చేరువ చేసుకోవడానికే అని స్పష్టమవుతున్న సందర్భంలో చంద్రబాబులాంటి అవకాశవాదులు మినహా ఎవరూ బీజేపీ వైపు నిలవడం లేదు. ఆమ్‌ ఆద్మీ కేజ్రీవాల్‌ దెబ్బకు మోడీ, బీజేపీ వెన్నులో వణుకుపుట్టింది. దాని తాలుఖూ ప్రతిఫలం 2014 సాధారణ ఎన్నికల్లో వ్యక్తమవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.