కిరణ్‌ రెచ్చగొట్టే చర్య

శాసనసభ వ్యవహారాల నుంచి శ్రీధర్‌బాబు తొలగింపు
సమైక్యవాద జేఏసీ కన్వీనర్‌ శైలజానాథ్‌కు బాధ్యతలు
భగ్గుమంటున్న తెలంగాణ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు తెగబడ్డాడు. శాసనసభ వ్యవహారాల శాఖను తెలంగాణకు చెందిన శ్రీధర్‌బాబు నుంచి తప్పించి సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ కన్వీనర్‌గా పనిచేస్తున్న ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. మూడో తేదీన శాసనసభ, మండలిలో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు తన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. శాసనసభ వ్యవహారాల నుంచి శ్రీధర్‌బాబును తప్పించి, తన వద్ద అట్టే పెట్టుకున్న వాణిజ్య పన్నుల శాఖను అప్పగించాడు. ఒక్క శ్రీధర్‌బాబునే తప్పిస్తే తెలంగాణను అడ్డుకునేందుకే అనే సంకేతాలు వెళ్తాయని మరో మంత్రి వట్టి వసంతకుమార్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన తెలుగుభాషాభివృద్ధి శాఖను కట్టబెట్టాడు. రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్‌ చేసేందుకు కిరణ్‌ చేసిన ప్రయత్నాలకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం తలొగ్గి ఫైల్‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు వద్దకు పంపగా, ఆయన ఆ ఫైల్‌ను కనీసం చూడకుండానే పక్కనబెట్టారు. అదివరకు సీఎం కిరణ్‌తో సన్నిహితంగా ఉండే శ్రీధర్‌బాబు ప్రోరోగ్‌ ఫైల్‌ను తన వద్దే పెట్టుకోవడం ద్వారా సీమాంధ్రలో సీఎం కిరణ్‌ ప్రతిష్ట కోల్పోయేలా చేశాడు. అప్పటి నుంచి సీఎం కిరణ్‌, మంత్రి శ్రీధర్‌బాబుపై గుర్రుగా ఉన్నారు. అలాగే శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని సీఎం అనగా, చర్చ మొదలైందని, కావాలంటే రికార్డులు చూసుకోమని సీఎంకు చురక అంటించాడు శ్రీధర్‌బాబు. తన వరుస చర్యలతో సీఎంకు కోపం తెప్పించిన శ్రీధర్‌బాబు ముసాయిదాపై చర్చ సమయంలో మరిన్ని ఇబ్బందులు సృష్టించవచ్చని సీఎం నిర్దారణకు వచ్చాడు. ఇందులో భాగంగానే ఉన్నట్టుండి మంత్రుల శాఖల మార్పుల పేరుతో శ్రీధర్‌బాబు వద్ద ఉన్న కీలకమైన శాఖను తప్పించాడు. ఈమేరకు మంత్రుల శాఖల మార్పుకు సంబంధించి ఫైల్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం పంపాడు. గవర్నర్‌ ఆమోదముద్ర పొందగానే శాఖల మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది. శుక్రవారం నుంచి శాసనసభలో ముసాయిదాపై చర్చ ప్రారంభం కానుండగా సీమాంధ్ర నేతలకు మంత్రుల శాఖ మార్పు ఊపునిస్తుందని సీఎం వర్గీయులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతరేకంగా ఉన్న కిరణ్‌ తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని శాసనసభ సాక్షిగా అడ్డుకునే చర్యలను ముమ్మరం చేశాడు. కిరణ్‌ అభిప్రాయాలకు కేంద్రం కూడా విలువ ఇవ్వకపోవడం, బిల్లుపై జనవరి 23 వరకు శాసనసభలో ముసాయిదాపై చర్చ జరుగనుండటం తో సీమాంధ్రుల చేతిలో శాసనసభ వ్యవహారాల శాఖ ఉండటం కీలకమని సీఎం భావించారు. ఈమేరకు వేగంగా చర్యలు చేపట్టారు. శాసనసభలో విభజన చర్చ సందర్భంగా గతంలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఎలా వ్యవహరించారు. శాసనసభల్లో చర్చల సరళి, విధానం పద్ధతులపై ఇటీవల అధ్యయనం చేసిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ బిల్లుపై చర్చకు సన్నద్ధమయ్యారు. ఈనేపథ్యంలో సీఎం కిరణ్‌ సీమాంధ్ర ప్రజల్లో బలం పెంచుకునేందుకు శ్రీధర్‌బాబును కీలక సమయంలో కీలకమైన శాఖ నుంచి తప్పించారు. సాధారణ రోజుల్లో శాసనసభ వ్యవహారాల శాఖను అంతగా పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఆ శాఖ తెలంగాణ నేత చేతుల్లో ఉండటం కీలకమైనదిగా ఈ ప్రాంత ప్రజలు భావించారు. ఈనేపథ్యంలో శ్రీధర్‌బాబు నుంచి శాఖను తప్పించడం ద్వారా తెలంగాణను దెబ్బకొట్టవచ్చని సీఎం కిరణ్‌ భావించారు. సీఎం సిర్ణయంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పది జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులే సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు తెలిపారు.