జెండాలు.. ఎజెండాలు పక్కకి
జై బోలో తెలంగాణ
ఒక్కతాటిపైకి తెలంగాణ సభ్యులు
హైదరాబాద్, జనవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం పది జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కతాటిపైకి వచ్చారు. జెండాలు.. ఎజెండాలు పక్కనబెట్టి జై బోలో తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు నిస్వార్థంగా పోరాడుతామని నేతలు పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో గల క్లబ్‌హౌస్‌లో శుక్రవారం తెలంగాణ ప్రాంత ప్రతినిధులు సమావేశమయ్యారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాల నుంచి మంత్రి శ్రీధర్‌బాబును తప్పించడంపై ప్రతినిధులు ఏకగ్రీవంగా ఖండించారు, శాసనసభ సమావేశాలకు తెలంగాణ ప్రాంత నేతలంతా తప్పనిసరిగా హాజరుకావాలని నిర్ణయానికి వచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖను సమైక్య జేఏసీ కన్వీనర్ శైలజానాథ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాంత నేతలందరినీ శ్రీధర్‌బాబు సమన్వయ పరచాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోరారు. ఒకవేళ సీమాంధ్రులు సభను జరగనివ్వకపోతే బిల్లుపై అభ్యంతరాలపై లేఖ రాయలని నిర్ణయించారు. అవసరమైతే ఎమ్మెల్యేలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి అన్ని విషయాలు కాంగ్రెస్ అధిష్టానానికి వివరించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగీతారెడ్డి మాట్లాడుతూ, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలవడం శుభపరిణామమని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబుకు మద్దతుగా ఏక వాక్య తీర్మానం చేశామని చెప్పారు. సమైక్య తీర్మానాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని మంత్రి అన్నారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పు బాధాకరమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యే సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కీలక సమయంలో శాఖను మార్చడం అన్యాయమన్నారు. సీఎం ఏకపక్షంగా వ్యవహరి స్తుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ముసాయిదా బిల్లులో అభ్యంతరాలపై ఒకే వాదన విన్పిద్దామని సూచించారు. చర్చకు రాకుంటే ఒకే వాక్యంతో జవాబు ఇద్దామని తెలిపారు. తెలంగాణ ముసాయిదాపై చర్చ సందర్భంగా పది జిల్లాల ఎమ్మెల్యేలు ఏక్యంగా గళం వినిపించాలని, సీమాంధ్రుల కుట్రలకు దీటుగా జవాబివ్వాలని తీర్మానించినట్లు చెప్పారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలను ప్రతిఘటించి తీరుతామని నేతలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వేళ కూడా సీమాంధ్రులు కుట్రలకు పదను పెడుతున్నారని, బిల్లుపై చర్చ జరగకుండా చూడటం ద్వారా వారు రాష్ట్రపతిని అవమాన పరుస్తున్నారని ఈటెల మండిపడ్డారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తారని, సభలోనూ తెలంగాణ ప్రజలే తమకు అధిష్టామని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ప్రతినిధులు సభ జరుగకుండా రచ్చ చేస్తుంటే ఆయా పార్టీల పెద్దలు ఏం చేస్తున్నారని ఈటెల ప్రశ్నించారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఫ్లోర్ కోఆర్డినేషన్ కమిటీ వేయాలని నిర్ణయించారు. అలాగే ఉమ్మడిగా ఢిల్లీకి వెళ్లాలని దానికి శ్రీధర్‌బాబు నేతృత్వం వహించాలని తీర్మానించారు. తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా, నిస్వార్థంగా పోరాడదామని తెలంగాణ నేతలు పేర్కొన్నారు. సిద్ధాంతాలు వేరయినా తెలంగాణ కోసం ఒక్కటిగా పోరాడుతామన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరక్కుండా చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ నేతల మంతా ఒకే మాట, ఒకే బాటగా నడుస్తామని మంత్రి జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ సభలో జరుగుతున్న కుట్రలను జాతీయ విూడియా ద్వారా కేంద్రానికి, అధిష్టాన పెద్దలకు వివరిస్తామన్నారు. తెలంగాణ బిల్లు గడప దాటేందుకు అసెంబ్లీలో అందరం ఐక్యంగా పని చేస్తామని తెలిపారు. జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి వివరిస్తామన్నారు. సీమాంధ్ర నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని టిఆర్‌ఎస్ నేత ఈటెల అన్నారు. శ్రీధర్‌బాబు శాఖను మార్చి శైలజానాథ్‌కు ఇవ్వడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరిని శ్రీధర్‌బాబు సమన్వయ పరచాలని నేతలు కోరారు. అందరం ఐక్యంగా ఉందామని, ఇకనుంచి పరస్పర విమర్శలు మానుకుందామని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సభలో సమైక్యాంధ్ర తీర్మానం చేసేందుకే శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు నేతలు అభిప్రాయపడ్డారు. కీలకమైన సమయంలో ఉద్దేశ పూర్వకంగానే శాఖ మార్చారన్న శ్రీధర్‌బాబు తనకు సంఘీభావం ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ సమన్వయ పరుస్తానని, అవసరమైతే అందరం కలిసి ఢిల్లీ వెళ్లి అన్ని విషయాలను వివరిద్దామన్నారు. శ్రీధర్ బాబు క్షేమం కోసమే తాను ఆయన శాఖను మార్చానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు చెప్పారని సమాచారం. శ్రీధర్ బాబు శాఖ మార్పు పైన తెలంగాణ ప్రాంత నేతలు అందరూ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీధర్ శాఖ ఎందుకు మార్చారని నిలదీశారు. దీంతో శ్రీధర్ బాబు క్షేమం కోసమే తాను శాఖను మార్చాల్సి వచ్చిందని, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరుగుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు.