సీమాంధ్ర ఎమ్మెల్యేల వైఖరి రాజ్యాంగ విరుద్ధం
సంపూర్ణ తెలంగాణే లక్ష్యం : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఎమ్మెల్యేల వైఖరి రాజ్యాంగ విరుద్ధమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జనవరి 7న మహాధర్నాను నిర్వహించనున్నట్లు కోదండరామ్ అన్నారు. శనివారం ఆయన సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరిస్తున్న వైఖరి రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చించకుండా దానిపై విపరీత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన పార్టీలకు అసెంబ్లీలో చర్చను అడ్డుకునే నైతిక హక్కు లేదని కోదండరామ్ అన్నారు. సీమాంధ్ర నేతలకు చట్ట సభల పట్ల గౌరవం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు సభను సజావుగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ పక్రియను వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అనుమతితోనే సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముసాయిదాపై చర్చ ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ముసాయిదాపై చర్చ ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ బిల్లును చించివేసిన ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జనవరి 7 తర్వాత అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు- చేస్తామని తెలిపారు. సమైక్యవాదం వినిపిస్తున్న సీమాంధ్ర నేతల్లోనే ఐక్యత లేదని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.