నేటి నుంచి బిల్లుపై చర్చ

వాయిదా తీర్మానాలు తిరస్కరణ
చర్చ ప్రారంభమైంది
శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క నిర్ణయాన్ని గౌరవిస్తా
శుక్రవారంలోపు లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలపండి
స్పీకర్‌ మనోహర్‌ రూలింగ్‌
హైదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) :
అసెంబ్లీలో నేటి నుంచి తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమవుతుందని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సభలో సభ్యులు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను తిరస్కరించానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదాపై చర్చించేందుకు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల మూడోరోజు అదే సీన్‌ పునరావృత్తమైంది. సోమవారం సభ ప్రారంభం కాగానే సమైక్య తీర్మానం కోసం వైసిపి, టిడిపి నేతలు పట్టు బడుతూ స్పీకర్‌ పోడియం చుట్టు ముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో టిఆర్‌ఎస్‌, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌, బిజెపి సిపిఐ ఎమ్మెల్యేలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభలో చర్చించాలని కోరుతూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో ఇరు ప్రాంతాల నినసల మధ్య స్పీకర్‌ ఈరోజు పార్టీలిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చకు తెలుగుదేశంపార్టీ, సమైక్య తీర్మాణం కోసం వైసిపిలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. వాటిని స్పీకర్‌ తిరస్కరిస్తున్నట్లు నిరసనల మధ్య ప్రకటించారు. ఈరోజు నుంచి కచ్చితంగా సమావేశాలు జరుగుతాయనే ధీమాతో ముఖ్యమంత్రి, స్పీకర్‌ ఉండగా అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. బిల్లుపై చర్చ జరుగకుంటే మాత్రం డీమ్డ్‌ టూ ఆన్సర్‌ అనే పద్దతిన ఈనెల 23న రాత్రి బిల్లుపై చర్చించే అవకాశం ఉండనే ఉండదనే విషయాన్ని గుర్తించాలని సీమాంధ్ర ప్రతినిధులు సభకు అడ్డుతగులుతున్న వారికి లాబీల్లో చెప్పడం సోమవారం సమావేశాల్లో ముఖ్యాంశం. సభ వాయిపడ్డ తర్వాత స్పీకర్‌ మనోహర్‌ నేతృతత్వంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టారు. బీఏసీకి అన్ని పార్టీల శాసనసభా పక్షనేతలు హాజరు అయ్యారు. సీఎం, విపక్షనేత లేకుండానే చర్చ సాగింది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నలుగురు సభ్యులు హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ వైఎస్‌ విజయమ్మతో పాటు డెప్యుటీ ఫ్లోర్‌ లీడర్లు.. శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరుకాగా టీడీపీనుంచి ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. డెప్యుటీ సీఎంతోపాటు అసెంబ్లీ వ్యవహారాలశాఖా మంత్రి శైలజానాథ్‌, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్‌లు ఆరేపల్లి మోహన్‌, అనిల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైందన్నారు. శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. శుక్రవారంలోగా సభ్యులు ముసాయిదాపై లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలపాలని, అది తాము ఇచ్చిన నిర్ణీత ప్రొఫార్మాలోలోని ఇవ్వాలని బీఏసీ స్పీకర్‌ మనోహర్‌ రూలింగ్‌ ఇచ్చారు. అఫిడవిట్లు, లెటర్‌హెడ్‌లు అంగీకరించబోమని స్పష్టం చేశారు. తెెలంగాణ ముసాయిదా బిల్లులోని మార్పులు, చేర్పులపై సభాపతి నాదెండ్ల మనోహర్‌ అభిప్రాయాలు కోరారని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి సోమవారం చెప్పారు. టి బిల్లుపై శుక్రవారం లోగా సభ్యులు అభిప్రాయం చెప్పాలని స్పీకర్‌ బిఏసిలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయమై కిరణ్‌ మాట్లాడుతూ మార్పులు, చేర్పులపై స్పీకర్‌ అభిప్రాయాలు కోరారన్నారు. ప్రతి అంశం పైన చర్చ, ఓటింగ్‌ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదిలావుంటే రెండో దఫా బీఏసీ సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వాకౌట్‌ చేశారు. ముసాయిదా బిల్లును తిప్పి పంపాల్సిందేనని సీమాంధ్ర ప్రాంత టిడిపి ఎమ్మెల్యేలు కోరారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైకాపా కోరింది. బిల్లుపై చర్చ జరగాల్సిందేనని ప్రభుత్వం, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సభకు అడ్డుపడేవారిని సస్పెండ్‌ చేసి చర్చ కొనసాగించాలని టిఆర్‌ఎస్‌, టిడిపి తెలంగాణ నేతలు కోరారు.మొదటిసారి ఉదయం పదిగంటల ప్రాంతంలో ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు మూడు గంటలపాటు సాగింది. అయినా ముసాయిదా బిల్లుపై చర్చకు ఏకాభిప్రాయం కుదరలేదు. స్పీకర్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో ముసాయిదా బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైందా లేదా అని సభ్యులు అక్బరుద్దీన్‌ ప్రశ్నించగా, ఆ వివాదంతో సంబంధం లేకుండా చర్చను కొనసాగిద్దామని సభాపతి సమాధానమిచ్చారు. సమైక్య తీర్మానం చేశాకే చర్చకు సహకరిస్తామని వైకాపా తెలిపింది. గతంలో తీర్మానానికి పట్టుబడితే సస్పెండ్‌ చేశారని, ఇప్పుడూ అలాగే చేసి చర్చను కొనసాగించాలని టిఆర్‌ఎస్‌ సభ్యులు సూచించారు. అయితే ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే సమావేశం అర్థంతరంగా ముగిసింది.
చర్చకు సహకరించాలి : మంత్రి శైలజానాథ్‌
చర్చకు సహకరించాలని సభ్యులను కోరామని శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శైలజానాథ్‌ అన్నారు. మరోవైపు చర్చకు అనుకూలంగా మంగళవారం నుంచి ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. చర్చ జరక్కుండా అభిప్రాయాలను ఎలా తెలుసుకుంటామని మంత్రి అన్నారు. చర్చ విషయంలో పార్టీల్లో ఏకాభిప్రాయం లేదన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ జాతకాలు బయటపడతాయని వైకాపా, టిడిపిలు చర్చకు భయపడుతున్నాయని ఆయన విమర్శించారు. చర్చకు అడ్డుపడుతూ ఆ రెండు పార్టీలు పరోక్షంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయన్నారు. బిల్లుపై సవరణలు ప్రతిపాదిస్తామని, లిఖితపూర్వకంగా అభిప్రాయాలు చెబుతామని శైలజానాథ్‌ తెలిపారు. చర్చ జరగకుండా చూడడంలో ఈ రెండు పార్టీలు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై టీడీపీలో ఏకాభిప్రాయం లోపించిందని మంత్రి శైలజానాథ్‌ తెలిపారు. సభలో చర్చ జరగకపోతే అది తెలంగాణ ఏర్పాటుకే సహకరించినట్లువుతుందన్నారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన ఆయన విభజన బిల్లుపై సభలో చర్చ జరగకపోతే కొత్తరాష్ట్ర ఏర్పాటుకు సహకరించినట్లేనని తెలిపారు. టీ బిల్లుపై చర్చించేందుకు టీడీపీ, వైఎస్సార్‌ సీపీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చ సందర్భంగా కూడా సమైక్య తీర్మానం ప్రవేశపెట్టవచ్చని స్పష్టం చేశారు. ఇదిలావుంటే మంత్రి శైలజానాథ్‌ శాఖ మార్పుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ బిఎఎసిలో మండిపడ్డారు. ఆయన శాఖను శాసనసభ వ్యవహారాలకు మారుస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. శాసన సభ్యులకు ఎలాంటి బులెటిన్‌ ఇవ్వకుండా శాఖ మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ నడిచే సమయంలో మంత్రులు శాఖలు మారిస్తే ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలికదా? అని ప్రశ్నించారు. మరోవైపు బిల్లుపై చర్చించాలా? వద్దా అనే విషయంలో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీఏసీలో టీడీపీ నేతలు ప్రాంతాల వారిగా అభిప్రాయాలు చెప్పారన్నారు. ఆ భేటీకి ఫ్లోర్‌ లీడర్లు మాత్రమే రావాలని ప్రభుత్వ పరంగా ఇప్పటికే తెలిపామన్నారు. విభజన బిల్లుపై తరగతులు వారిగా చర్చ జరగాల్సిందేనన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందా? లేదా? అని శాసనసభా వ్యవహరాల సలహా సంఘంలో చర్చకు వచ్చింది. సభలో పాల్గొన్న సభ్యులే ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభమయిందని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. అజెండాలో కూడా ఆ అంశం ఉందని ఆయన తెలిపారు. టీడీపీకి విభజనపై ఎటువంటి స్పష్టతలేదు. తెలంగాణ టిడిపి నేతలు విభజనకు ఆమోదిస్తుంటే, సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ మాత్రం శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని పట్టుబట్టింది. ఏ నిర్ణయం తీసుకోకుండానే బిఏసి సమావేశం ముగిసింది. అయితే దీనిపై మంగళవారం చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఇదిలావుంటే అసెంబ్లీ తీర్మానం తర్వాతే ఇప్పటివరకు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఇదే విషయాన్ని బీఏసీలో చెప్పామని టిడిపినేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి లోపల ఒకమాట, బయట మరో మాట మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ చిచ్చు పెట్టింది వైఎస్‌ అయితే, ఆర్టికల్‌ 3ను కేంద్రానికి గుర్తుచేసింది జగన్‌ అని ఆయన ఆరోపించారు. జగన్‌ సమైక్యవాది అయితే ఏపీఎన్జీవోల్లో చీలిక తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించారని ఆయన ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రం విడిపోవాలని కోరుకునే ఏకైక వ్యక్తి జగన్‌ అన్నారు. రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణబిల్లుపై శాసనసభలో చర్చను కొనసాగించాలని భాజపా శాసనసభ్యుడు లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నవారిని సభనుంచి సస్పెండ్‌ చేయాలని ఆయన కోరారు. బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం రాకుండా తెలంగాణ, సీమాంధ్రకు చెందిన దేశం నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌, దేశం పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.