సంపూర్ణ తెలంగాణే లక్ష్యం
13 సవరణలు జరగాల్సిందే : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 7 (జనంసాక్షి) :
సంపూర్ణ తెలంగాణ రాష్ట్రమే తమ లక్ష్యమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలను అంగీకరించబోమని, తాము ప్రతిపాదించిన 13 సవరణలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుంటే వెంటనే బిల్లును కేంద్రానికి వాపస్ పంపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకోవడానికి అడుగడుగునా కుట్ర జరగుతోందన్నారు. తెలంగాణ బిల్లులోని 13 అంశాలపై తాము సవరణలు కోరుతున్నామని వెల్లడించారు. ఈమేరకు ఢిల్లీ వెళ్లి అందరు రాజకీయ నేతలను కలిసి మద్దతు కూడగడతామన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీకి కేవలం అభిప్రాయం చెప్పే అవకాశమే ఇచ్చారని, నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వలేదని తెలిపారు. దీనిపై సవరణలు చేసే అధికారం సభ్యులకు లేదన్నారు. తెలంగాణ బిల్లును ఆపేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలు ఫలించవని పేర్కొన్నారు. బిల్లుపై చర్చ జరిగినా జరుగకున్నా తెలంగాణ బిల్లు జనవరి 23 తర్వాత కేంద్రానికి చేరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన బిల్లును ఆపడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుట్ర జరుగుతోందని కోదండరాం ఆరోపించారు. బిల్లుకు సవరణలు పెడితే ఓటింగ్‌ను ఆమోదించే పరిస్థితి లేదని అన్నారు. బిల్లును ఆపి ఇరుప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హితవుపలికారు. విద్యుత్ పంపిణీ విషయంలో గందరగోళానికి తావిచ్చేలా బిల్లులో ప్రతిపాదన ఉందని చెప్పారు. గవర్నర్ నుంచి శాంతిభద్రతల అధికారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విభజన అనంతరం ఉమ్మడి హైకోర్టు కాకుండా రెండు హైకోర్టులు ఉండేలా సవరణలు చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గోదావరి నదీ జలాలకు బోర్డు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక పీఎస్సీని నియమించాలని అన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని సహించబోమని పేర్కొన్నారు. హైకోర్టును ఉమ్మడిగా ఒప్పుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. స్థానికత ఆధారంగానే పెన్షనర్లను గుర్తించాలని డిమాండ్ చేశారు. గోదావరిపై వాటర్‌బోర్డు అవసరంలేదని, కృష్ణా వాటర్ బోర్డును హైదరాబాద్‌లోనే ఉంచాలని కోరారు. ఇదిలావుంటే తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కే కేశవరావు విమర్శించారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ‘సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష’ శిబిరంలో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చను అడ్డుకునేందుకు సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ అతి తెలివిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. టీ బిల్లుపై స్పీకర్ అఫిడెవిట్లు- అడగడం తప్పేనని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించిన మంత్రి శైలజానాథ్‌కు సభలో అడుగుపెట్టే హక్కులేదని ధ్వజమెత్తారు. సంపూర్ణ తెలంగౄణ లక్ష్యంగా ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ముగిసింది. ఈ దీక్షలో రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాంతోపాటు పలువురు జేఏసీ నేతలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు. వేలాదిగా తెలంగాణ వాదులు తరలివచ్చి దీక్షను విజయవంతం చేశారు. ఎలాంటి ఆంక్షలులేని సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా నేడు ఉద్యోగ సంఘాలు దీక్షను చేపట్టడం జరుగుతుందని టిఎన్జీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ పేర్కొన్నారు. ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంబానికి ముందు ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంచ అయిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న తరుణంలో సీమాంధ్ర నేతల కుట్రలు ఇంకా ఇంకా కొనసాగ డాన్ని తిప్పికొట్టడంతోపాటు కేంద్రానికి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకే ఈదీక్ష కొనసాగుతుందన్నారు. 60ఏళ్ల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఇస్తుంటే కూడా ఇంకా తమ కాళ్లవద్ద పడి ఉండాలనే రీతుల్లో సీమాంధ్రులు చేస్తున్న ప్రయత్నాలను కచ్చితంగా తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈనెల 23వతేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆగనే ఆగదన్నారు. లక్షలాది ఉద్యోగాలు కొల్లకొట్టారని, నీళ్లు, నిధులు దోచుకు పోయారన్నారు. ఇంకా అలాంటి చర్యలు చేపట్టేందుకే నేడు సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నందుకు తమకేం పూర్తిగా సంతోషం లేదని, బిల్లులో 13, 14 సవరణలు చేయాల్సి ఉందన్నారు. అవి పూర్తయితేనే సంపూర్ణ తెలంగాణ అందుబాటులోకి వస్తుందన్నారు. ఉద్యోగం చేస్తున్న వారికి తెలంగాణ వారే పెన్షన్ చెల్లించాలనే దుర్మార్గపు ప్రయత్నాలుచేయడం అవివేకమన్నారు. తెలంగాణాకు చెందిన వారికి ఇంకా ఇంకా నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేందుకుచేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. కేంద్రానికి బిల్లు పోయి న తర్వాత డిల్లీకి పోయి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టి సవరణలు చేయించుకుంటామన్నారు. బిల్లును ఇప్పటికి కూడా తొక్కి పెడతామని సిఎం అనుకున్నా, ప్రతిపక్ష నేత భావించినా కూడా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని దేవిప్రసాద్ హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణ సాదించుకుని సీమాంద్ర నేతల చెంపచెల్లుమనిపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంతకాలం తాము ప్రశాంతంగా ఉంటే చేతగాని వారుగా సీఎం, ప్రతిపక్షనేత, వైసీపీలు భావిస్తున్నాయని దీనిని తిప్పికొట్టేందుకే మరోసారి రంగంలోకి దిగామన్నారు. కార్యక్రమంలో మల్లేపల్లి లక్ష్మయ్య, దేశపతి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, విఠల్, రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.