బిల్లుపై కొనసాగుతున్న చర్చ

ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా
గవర్నర్‌గిరీ వద్దు.. ఆంక్షలు అసలే వద్దు
పది సవరణలు.. స్పీకర్‌ ఫార్మాట్లో అభిప్రాయాలు ఇచ్చిన టీ సభ్యులు
వైఎస్సార్‌ సీపీ సభ్యుల ఒక రోజు సస్పెన్షన్‌
హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుపై శాసనసభ, మండలిలో చర్చ కొనసాగుతోంది. గురువారం సభ ప్రారంభం కాగానే మళ్లీ గందరగోళం చెలరేగినా వైసీపీ సభ్యులను సస్పెండ్‌ చేసి ఉభయ సభల్లో చర్చను కొనసాగించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఇంతకాలం మొండిపట్టు పట్టిన సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు చివరకు చర్చకు దిగివచ్చినా సమైక్య తీర్మానం అంటూ మొదటి నుండి గొంతెత్తుతున్న వైసీపీ గురువారం అదే కొనసాగించింది. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి సభాకార్యక్రమాలకు అడ్డుపడ్డారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో స్పీకర్‌ మనోహర్‌ సభను అరగంట సేపు వాయిదా చేశారు. వైసీపీ సభ్యుల సమైక్య నినాదాలకు తెలంగాణ సభ్యులు కూడా జై తెలంగాణ నినాదం చేయడంతో సభ హోరెత్తింది. సభలో ప్రశాంతంగా చర్చ కొనసాగితేనే బాగుంటుందని స్పీకర్‌ ఎంత నచ్చజెప్పినా వైసీపీ వినలేదు. ఆ పార్టీ ఇచ్చిన సమైక్య వాయిదా తీర్మానాన్ని, సీపీఎం ఇచ్చిన కనీసవేతన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. అయితే విభజన బిల్లులో లోపాలున్నాయని, పూర్తి సమాచారం సభముందు పెట్టిన తర్వాతే చర్చ చేపట్టాలని వైకాపా సభ్యులు మండలిలో ఛైర్మన్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో మండలి ఛైర్మన్‌ సభను అరగంట వాయిదా వేశారు. అంతకు మంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ. రాష్ట్రం సమైక్యంగా ఉండటం వైకాపాకు ఇష్టం లేదని, వైకాపా మోసపూరిత వైఖరితో వ్యహరిస్తోందని విమర్శించారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి ద్రోహం చేయొద్దని వైకాపా సభ్యులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని సభలో ప్రవేశ పెట్టేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. విభజన బిల్లు అసమగ్రంగా ఉందని, తగిన సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. శైలజానాథ్‌ మాట్లాడుతుండగా వైకాపా సభ్యులు అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై సమగ్రంగా చర్చించేందుకు గాను బుదవారం జరిగిన శాసనమండలి బీఏసీ సమావేశంలో అంగీకరించిన పార్టీలు గురువారం సభ ప్రారంభం కాగానే సమాచారం ఇచ్చాకే చర్చించాలని పట్టుబట్టాయి. ఈ తరుణంలో చైర్మన్‌ చక్రపాణి ఎంత చెప్పినా సభ్యులు వినలేదు. దీంతో సభలోనే ఉన్న శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శైలజానాథ్‌ ను ప్రకటన చేయాలని చైర్మన్‌ పేర్కొన్నారు. దీంతో ఆయన సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగానే వైసిపి ఎమ్మెల్సీలు ఫ్లోర్‌ లీడర్‌ అప్పారావు నేతృత్వంలో చైర్మన్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. మంత్రి ప్రసంగాన్ని తప్పు పట్టారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ తమను నిందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ తరుణంలో మంత్రి శైలజానాథ్‌ వైసిపిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. వారికి నిజంగా చర్చ జరుగాలనే ఉద్దేశ్యం లేనే లేదన్నారు. రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారం అందించేందుకే వారి నాయకుడు జగన్‌ సభలను అడ్డుకునేందుకు డైరెక్షన్స్‌ ఇస్తున్నాడని ఆరోపించారు. సమైక్యం ముసుగులో వైసిపి విభజనకు సహకరిస్తుందని ఆరోపించారు. పార్టీ నేతలు రెండు సభల్లోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని తూర్పార పట్టారు. రాష్ట్రానికి కేంద్రంనుంచి ఎలాంటి సమాచారం రాలేదని, వస్తే దాచిపెట్టాల్సిన పని ప్రభుత్వానికి లేదన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో పూర్తి కాగానే సబ్యులకు పంపిణీ చేస్తామన్నారు. అయితే ఈతరుణంలో మంత్రి వైసిపిపై తీవ్ర స్థాయిలో మాటలు వెల్లడించడంతో వైసిపి నేతలు అగ్గివిూద గుగ్గిలం అయ్యారు. మంత్రికి సభలో మాట్లాడే హక్కు లేనేలేదన్నారు. తాము చర్చకు సంబందించిన అంశాలు అడిగితే ప్రజలను సభను తప్పుదారి పట్టించేవిధంగా వైసిపిని విమర్శిస్తున్నాడని ఆరోపించారు. మంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ వారి అభ్యంత రాలపై సమాధానం చెప్పేందుకే తాను ప్రయత్నిస్తున్నానని అంటూనే వైసిపి పై విమర్శల వర్షం గుప్పించారు. టీ బిల్లుపై వైసిపి చర్చకు సహకరించాలన్నారు. లేని పక్షంలో విభజనకు వైసిపి సహకరిస్తుందనే భావించాల్సి వస్తుందన్నారు. సభ్యులు ఏం మాట్లాడాలనుకున్నా కూడా కచ్చితంగా నిర్మొహమాటంగా చెప్పవచ్చన్నారు. అలాంటి అవకాశం ఉన్నా కూడా ఎందుకు అడ్డుకోవడమని నిలదీశారు. అసలు విభజనకు సహకరించాలా, వ్యతిరేకించాలో కూడా తేల్చుకునే పరిస్థితిలో ఆపార్టీ నేతలు లేకపోవడం దౌర్బాగ్యమని ఆరోపించారు. మంత్రి సమాధానం చెప్పుతున్నప్పటికి వైసిపి నేతలు అడ్డుకోవడంతో గందర గోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహించిన చైర్మన్‌ చక్రపాణి సభను అరగంట సేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వైసీసీ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో 15 మందిని ఒక రోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు 9 సవరణలు సూచించారు. ఈ మేరకు లిఖిత పూర్వక పత్రాలను వారు సిద్ధం చేసుకున్నారు. సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్న నాలుగున్నర కోట్లమంది ప్రజలు ఎలాంటి ఆంక్షలను సహించరని వారు స్పస్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులో తెలంగాణపై విధించేందుకు ప్రతిపాదించిన అంశాలను సవరించాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పట్టుబట్టారు. ప్రాణహిత చేవెళ్ల జాతీయ ¬దా కల్పించాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ బిల్లుపై సవరణలను స్పీకర్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందజేశారు. రాష్ట్రపతి పంపిన బిల్లు-2013కు టీఆర్‌ఎస్‌ తరపున కొన్ని సవరణలు, సూచనలు స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశామని హరీష్‌రావు తెలిపారు. ఈ బిల్లును టీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగ్‌ పెట్టకూడదని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వమే ఆమోదిస్తుందని తెలిపారు. బిల్లుపై ఓటింగ్‌ జరిపే అధికారం శాసనసభకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత విద్యా విధానం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగితే ఈ ప్రాంత విద్యార్థులు నష్టపోతారని, అందుకే ఐదేళ్లకే కుదించాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లులో 10 సవరణలు, సూచనలు ప్రతిపాదించామని ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఉమ్మడి రాజధాని కాల పరిమితి మూడేళ్లకు కుదించాలని, హైదరాబాద్‌పై తెలంగాణ సీఎం అధికారం ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పడగానే మూడు నెలల్లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను, పెన్షనర్లను గుర్తించాలి, సీమాంధ్ర పెన్షనర్ల భారం తెలంగాణ రాష్ట్రం మోయలేదని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ తెలంగాణకే ఇవ్వాలి. తెలంగాణకు వెటర్నరీ యూనివర్శిటీ, ఏఐఐఎంసీ, ఐఐఎం, ఎన్టీపీసీ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి.)ఆస్తుల ప్రాతిపదికన ప్రభుత్వరంగ సంస్థలను విభజించాలి. హెచ్‌వోడీలు, జోనల్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లు ఏ ప్రాంతంలో ఎక్కువ పని చేస్తే ఆ ప్రాంతానికే పరిమితం చేయాలి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి.వీటన్నిటినీ వివరణల రూపంలో అందజేశామన్నారు.
విభజన బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని మంత్రి వట్టి వసంతకుమార్‌ అన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చను కొనసాగించిన మంత్రి వట్టి తన ఆవేదనను, ఆందోళనలను వ్యక్తం చేశారు. కేంద్రం విభజన నిర్ణయం ద్వారా సీమాంధ్రపై కత్తి కట్టిందని అన్నారు. ఎందుకు విబజన చేస్తున్నారో ఏం అవసరమొచ్చిందో చెప్పలేదన్నారు. విభజన వ్లల కలిగే ప్రయోజనాలేంటో కూడా తెలియడం లేదన్నారు. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్ర 50 ఏళ్లు వెనక్కి పోతుందని ఆందోళన చెందారు. రాష్ట్రాన్ని విభజించమని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీర్మానం చేసి పంపినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. అటువంటిది తీర్మానమే లేకుండా ఆంధప్రదేశ్‌ విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా కేంద్రం రాష్ట్ర విభజనకు పాల్పడుతుందన్నారు రెండు సార్లు వాయిదా, వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ తర్వాత శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ చేపట్టారు. ఉదయం 9గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో సభను స్పీకర్‌ గంట పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన వెంటనే వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో సభ రెండో సారి అరగంటపాటు వాయిదా పడింది. రెండో సారి సభ ప్రారంభమైన వెంటనే వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ 15 మంది వైకాపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇందుకు నిరసనగా వైకాపా శాసనసభాపక్ష నేత వై.ఎస్‌ విజయలక్ష్మి సభనుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం స్పీకర్‌ సూచన మేరకు మంత్రి వట్టి వంసతకుమార్‌ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఆయన తన చర్చలో అనేక అంశాలను ప్రస్తావించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు తదితర అంశాలపై స్పష్టత లేదన్నారు. కొత్త రాజధాని సంగతేంటని ప్రశ్నించారు. కొత్త రాజధానికి నిధులు ఎలా ఇస్తారన్నారు. ఇప్పటికే దివాళా తీసిన కేంద్రం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందన్నారు. రాష్ట్ర విజభన జరిగితే కోస్తాంధ్ర 50 ఏళ్లు వెనక్కి పోతుందని మంత్రి వట్టి వసంతకుమార్‌ అన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టినట్లు కనబడుతుందన్నారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రానికి గౌరవం ఉన్నట్టు లేదన్నారు. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజనపై కేంద్రం అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏళ్ల తరబడి విదర్భ డిమాండ్‌ ఉన్నా పట్టించుకోలేదని తెలిపారు. అలేగే చిదంబరం కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తమాని చెప్పి ఇప్పుడు అందుకు విరుద్దంగా నిర్ణయం తసీఉకోవడం దారుణమన్నారు. తాము, తమ పూర్వీకులు తప్పు చేసినట్టు నిరూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. హైదరాబాద్‌తో సమానమైన రాజధానికి నిర్మాణానికి నిధులెవరిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతాన్ని బలవంతంగా తెలంగాణలో కలిపారనడం సబబు కాదన్నారు. హైదరాబాద్‌ అభివృద్దిలో సీమాంధ్ర ప్రజల వాటా కూడా ఉందన్నారు. ఈ బిల్లును చూస్తే కొత్త రాష్ట్రం ఎలా బతికి బట్టకడుతుందో అర్థం కావడం లేదన్నారు. తమపై దోపిడీ ఆరోపణలు తప్పని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. తీర్మానం తప్పనిసరి అని సర్కారియా కమిషన్‌ కూడా చెప్పిందన్నారు. శాసనసభ తీర్మానాన్ని కేంద్రం పొందలేదు కాబట్టి బిల్లును వ్యతిరేకిస్తున్నామని వట్టి వసంతకుమార్‌ చెప్పారు. కొత్త రాష్టాల్ర ఏర్పాటుకు సరైన ప్రాతిపదిక, విధానం అవలంభించాలని సూచించారు.
సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. ఏళ్ల తరబడి ప్రత్యేక విదర్భకు డిమాండ్‌ చేస్తున్నా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి ఐదు దశాబ్దాలు పడుతుందని తెలిపారు. విభజన వల్ల సీమాంధ్రకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతదన్నారు.సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా విభజన బిల్లు ఉందని మంత్రి వట్టి అన్నారు. విభజన బిల్లును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. విభజన వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, అయితే విభజనతో సీమాంధ్ర 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు. అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నా కేంద్రం ఎందుకు ముందుకెళ్తుందో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని శ్రీకృష్ణ కమిటి చె ప్పింది, అయితే శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించకుండా విభజన నిర్ణయం తీసుకున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ ని ఎందుకు నియమించింది..నివేదికపై ఎందుకు చర్చించలేదని వట్టి ప్రశ్నించారు. ఒక విధానమంటూ లేకుండా రాష్ట్రాలను విభజించొద్దని మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ అన్నారు. అలా చేస్తే కోర్టులో అవి నిలబడవని తెలిపారు. శాసనసభలో వట్టి మాట్లాడుతూ రాష్టాల్ర విభజనకు సరైన విధానాలను పరిశీలించాలని పేర్కొన్నారు. క్లర్క్‌ నుంచి ప్రధాని వరకు ఎవరూ ఏం నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించొచ్చు అన్నారు. సమాచార హక్కు చట్టం ఆ అవకాశం కల్పించిందని తెలిపారు. తెలంగాణ అంశాన్ని టేబుల్‌ ఐటంగా పెడతారా అని ప్రశ్నించారు. విభజనను కేబినెట్‌ సాధారణ విషయంగా ఎలా తీసుకుంటుందని అడిగారు. అసెంబ్లీ తీర్మానంతోనే రాష్టాల్రను ఏర్పాటు చేయాలని… మాజీ ¬ంమంత్రి అద్వానీ అదే విషయం చెప్పారని తెలిపారు. విభజన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదన్నారు. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం సరదాగా రాష్టాల్రను విభజిస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌లు చాలా ఉన్నా తెలంగాణను మాత్రమే ఎందుకు విభజిస్తారని అడిగారు. అందుకే తాను విభజనను వ్యతిరేకిస్తున్నానని మంత్రి అన్నారు. మధ్యలో తాము అనడంపై మరోమంత్రి పొన్నాల లక్ష్మయ్య అభ్యంతరం తెలిపారు.
రాహుల్‌ గాంధీని ప్రధాని చేసేందుకే సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యతో సభలో తీవ్రగందరగోళానికి దారితీసింది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. దీంతో సభ ఆర్డర్‌లో లేకపోవడంతో స్పీకర్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ సభను పది నిముషాలు వాయిదా వేశారు. సభలో బిల్లుపై చర్చ సందర్భంగా టిడిపి తరఫున ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. ఆయన తన ప్రసంగంలో సోనియాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. దీనిపై చీఫ్‌విప్‌ గండ్ర లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా పేరు ఎత్తడం తగదన్నారు. చంద్రబాబుతో సహా అన్ని పార్టీల వారు విభజనకు లేఖ ఇచ్చిన తరవాతనే సోనియా తుదిగా నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రి కొడ్రు మరుళి లేచి పల్లె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ను ప్రధాని చేయదల్చుకుంటే 2004, 2009లోనే చేసేవారని అన్నారు. అప్పటి నుంచి ఆయన ఎంపీగానే ఉన్నారని అన్నారు. రాహుల్‌, సోనియాలనూ విమర్శించడం తగదన్నారు. ఆయన పదవి కోసం కాకుండా ప్రజల కోసం ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని కొండ్రు అన్నారు. జన్‌లోక్‌పాల్‌, సమాచారహక్కు చట్టం లాంటివి తీసుకొని వచ్చిన ఘనత రాహుల్‌దని అన్నారు. విభజన కోసం కాకినాడలో బిజెపి తీర్మానం చేసిందని ద్రోణంరాజు శ్రీనివాస్‌ అన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం నిర్ణయం తీసుకోవాలని వైకాపా చెప్పిందన్నారు. సోనియాగాంధీని నిందించడం సరికాదన్నారు. సభలో లేని సభ్యుల గురించి మాట్లాడడం సరికాదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. సోనియాకు ముందే చంద్రబాబు ప్రత్యేక తెలంగాణకు లేఖ ఇచ్చారన్నారు. ఇంతలో సభావ్యవహారాల మంత్రి శైలజానాథ్‌ జోక్యం చేసుకుని చంద్రబాబు సమైక్యం అనలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. ఆయన సమైక్యానికి మద్దతు ఇస్తే మార్పు తీసుకుని రావచ్చన్నారు. ఆవేశాలకు పోకుండా చర్చ జరగాలన్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు సమన్వయంతో మాట్లాడాలని మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో పరుష పదజాలం సరికాదన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు అనుగూణంగా సభలో చర్చ జరగాలన్నారు. విభజనకు కారకులపై మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళం సరికాదన్నారు. సోనియాపై వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. సోనియాపై వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్‌కు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండ్రు మురళితో పాటు ఇతర కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం తెలపడంతో టీడీపీ సభ్యులు సోనియాగాంధీ డౌన్‌డౌన్‌ అంటూ స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించారు. స్పీకర్‌ ఎంత రిక్వెస్ట్‌ చేసిన సభ్యులు వెనక్కు తగ్గక పోవడంతో డిప్యూటీ స్పీకర్‌ మల్లు బట్టి విక్రమార్క సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యుడు పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ విభజనకు సంబంధించి అన్ని అంశాలను చర్చించాలని కోరారు. విభజనకు కారణమైన అంశాలను, వ్యక్తులను ప్రస్తావించకుండా ఎలా చర్చిస్తామని అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని పయ్యావుల కేశవ్‌ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్లలె రఘునాథరెడ్డి చెప్పింది ఆయన ఒక్కరి అభిప్రాయం కాదని, సీమాంధ్రలో అందరి అభిప్రాయమని అన్నారు. నష్టం కలిగిందని చెప్పుకోవచ్చని శాసనసభ తమకు హక్కు కల్పించిందన్నారు. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమయ్యాక సభ్యులందరూ చర్చ కొనసాగడానికి మద్దతివ్వాలని ఉపసభావతి మల్లు భట్టివిక్రమార్క సభ్యులను కోరారు. శాసనసభ చర్చల్లో వ్యక్తిగత ఆరోపణలకు దిగడం తగదని టీడీపీ ఎమ్మెల్యే అశోకగజపతి రాజు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల అభిప్రాయాలపై నిర్ణయం స్పీకర్‌దేనని తెలిపారు.
శాసనసభలో మరోమారు గందరగోళ పరిస్తితుల మధ్య సభ శుక్రవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్‌ సభ్యుడు, చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి చర్చ చేపట్టిన సందర్భంగా ఎర్రబల్లి దయాకర్‌ రావు, గండ్రల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టిడిపి, టిఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్దం నడిచింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క సభను రేపటికి వాయిదావేశారు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లను ఉద్దేశించి తెదేపా సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలపై సభలో మరోసారి గందరగోళం నెలకొంది. ఇద్దరూ తోడుదొంగలని అన్నారు. దాంతో అంతకుముందు చీఫ్‌ విప్‌ గండ్ర, టిడిపి నేత ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం జరిగింది. పొత్తులు పెట్టుకునే సంప్రదాయం తమ పార్టీకి లేదని గండ్ర పేర్కొన్నారు. తమ నేత ఇచ్చిన మాటపై వెనక్కి పోలేదని ఎర్రబెల్లి అన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధి చెందలేదని గండ్ర చెప్పగలరా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఆఖరుకు గండ్ర ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి కూడా చంద్రబాబు వల్లనే అభివృద్ది జరిగిందన్నారు. మొత్తంగా తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబునాయుడు కృషి చేశారన్నారు. చంద్రబాబు తెలంగాణకు ఎన్నడూ వ్యతిరేకం కాదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయంజరగాలన్నదే ఆయన అభిమతమన్నారు. 9 నెలల్లో తెలంగాణ ఇసస్తామన్న కాంగ్రెస్‌ ఇంతకాలం కాలయాపన చేసింది నిజం కాదా అని ఎర్రబెల్లి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తోడు దొంగలుగా మారి తెలంగాణను మోసం చేశారని అన్నారు. దీంతో టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు మండిపడ్డారు. యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని సభలో నిషేధించింది వాస్తవం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రెండు కళ్ల సిద్దాంతం,రెండు కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఎవరిదన్నారు. తెలంగౄణపై నేరుగా చంద్రబాబు ఎందుకు సపోర్ట్‌ చేయడం లేదన్నారు. దమ్ముంటే బిల్లు పెట్టమని అడగాలన్నారు. తమ పార్టీని, తమ అధినేత కేసీఆర్‌ను అంటే ఊరుకునేది లేదన్నారు. ఎన్డీఏ హయాంలో తెలంగాణను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పలేదా అని అడిగారు. దీంతో టీఆర్‌ఎస్‌, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు కంటే గజదొంగ ఇంకా ఎవరూ లేరని హరీష్‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌పై ఎర్రబెల్లి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇద్దరు కొడుకులు, రెండు కళ్లు, కొబ్బరికాయ సిద్దాతం చంద్రబాబు చెప్పలేదా అని అడిగారు. దీనికి స్పందనగా టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. ఈ దశలో సభలో తీవ్రగందరగోళం చెలరేగింది. విమర్శలు కాకుండా నిర్మాణాత్మక సూచనలు చేయాలని, చర్చకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు చీఫ్‌విప్‌ గండ్ర తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతూ మహాభారతాన్ని ప్రస్తావించారు. మహాభారత యుద్దంలో ధర్మం గెలిచినట్లే ఇవాళ తెలంగాణ ప్రాంత ఆకాంక్ష నెరవేరిందని ఇందుకు గర్వపడుతున్నామని అన్నారు. నాడు పాండవులు తమ న్యాయమైన హక్కుల కోసం అడిగితే, తాము ఎక్కువ మందిమి ఉన్నామని కౌరవులు ఎలా పెడచెవిన పెట్టారో, చివరకు ధర్మం ఎలా గెలిచిందో ఇప్పుడు అలాగే జరుగుతోందన్నారు. తమకు న్యాయంగా రావాల్సిన దానిని అడిగితే మహాభారత యుద్ధం వచ్చిందని, ఇప్పుడు కూడా శాంతియుత పోరాటంతో ఆకాంక్షను నెరవేర్చుకున్నామని అన్నారు. ఇది చరిత్రలో లిఖఙంచదగ్గ రోజన్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చారిత్రకమైన రోజు అన్నారు. ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలతో సంప్రదించాకనే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేశారన్నారు. ప్రజల ఆకాంక్ష తెలియజేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు జరుగుతోందని చెప్పడం సరికాదన్నారు. 2004లో కాంగ్రెసు, 2009లో టిడిపి తెలంగాణ పేరు చెప్పి ఎన్నికలకు వెళ్లాయని తెలిపారు. టిడిపికి అధికార యావ తప్ప మరొకటి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ ఆవేశంతో నిర్ణయం తీసుకోలేదన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా టిడిపి తీరు ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పేరు ఎత్తడమే నిషేధంగా ఉండేదని ఆరోపించారు. అయితే దీనికి ఎర్రబల్లి అడ్డుతగిలి తెలంగాణ అంశాన్ని లేవనెత్తింది వైయస్‌ రాజశేఖర రెడ్డి అని అన్నారు. తెలంగాణ విషయంలో తమ నేత చంద్రబాబు ఇచ్చిన మాట నుండి వెనక్కి తగ్గలేదన్నారు. గండ్ర సభలో అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తమ పైన, తమ నేత పైన ఆరోపణలు చేసినందువల్ల తాను వివరణ ఇస్తున్నానన్నారు. కాంగ్రెసు, తెరాస కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై వెనక్కి పోలేదని, విద్యార్థులు చనిపోతుంటే సమన్యాయం చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌.. ఇలా అన్ని ప్రాంతాలు చంద్రబాబు హయాంలో అభివృద్ధి అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విూకు సిగ్గుందా అన్నారు. దీనిపై గండ్ర మండిపడ్డారు. ఎర్రబెల్లి సిగ్గుందా అనడం సరికాదన్నారు. ఆయన మాటలను రికార్డుల నుండి తొలగించాలన్నారు. తెలంగాణ అనే పదాన్ని నిషేధించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాదా అని తెరాస శాసన సభ్యులు హరీష్‌ రావు అన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు అలవాటన్నారు. అసెంబ్లీలో గందరగోళం చెలరేగడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు.