మాటల ఈటెలు

అడగడుగునా దగాపడ్డం
మా భూములమ్మారు.. మా నీళ్లు, నిధులు దోచారు
మా ఉద్యోగాలు లాక్కున్నారు
అందుకే జై తెలంగాణ
విశాలాంధ్రలో ప్రజారాజ్యం విఫల ప్రయోగం : గుండా మల్లేశ్‌
అందినకాడికి దోచుకున్నారు : గండ్ర
చర్చకు ముందే ఓటింగ్‌ కుదరదు : స్పీకర్‌
హైదరాబాద్‌, జనవరి 10 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదాపై శాసనసభలో నిర్వహిస్తున్న చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ 57 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టారు. తెలంగాణ భూములమ్ముకున్నారని, నీళ్లు, నిధులు దోచుకున్నారని, తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఉద్యోగాలను లాక్కున్నారని ఆయన ధ్వజమెత్తారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు జరిగిన పోరాటం, అణచివేతలు, అన్యాయాలు, అవమానాలు, దోపిడీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ రాజేందర్‌ శాసనసభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో తెలంగాణ ఆవశ్యకతలను వివరించగా అడుగడుగునా సీమాంధ్ర సభ్యులు అడ్డుకున్నారు. అయినా ఆయన తన ప్రసంగంలో తెలంగాణకు ఎవరెవరు ఎలా హామీలు ఇచ్చి మోసం చేశారో ఎండగట్టారు. తెలంగాణ బిల్లుకు అమరుల రక్తం అంటుకొని ఉందని దాన్ని అవమానపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఒళ్లంతా కాలుతుంటే జై తెలంగాణ అంటూ అమరులు కళ్లు మూసుకుని తనువు చాలించారని పేర్కొన్నారు. కేసీఆర్‌ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పది క్లాజులపై సవరణలు సమర్పించిందని పేర్కొన్నారు. చిన్నరాష్టాల్ర ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికే ఉంటుందని అంబేద్కర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌ అంటూ నాటినుంచే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ఉద్యమాన్ని కేవలం రాహుల్‌కు ప్రధాని పదవి కోసం తెలంగాణ ఏర్పాటు చేశారన్న రీతిలో మాట్లాడడం తగదన్నారు. ఉద్యమాన్ని ఇంతగా తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. నలుగురు ప్రధానమంత్రులు, 29 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినాయని చెప్పారు. సీమాంధ్రులు ఎంత ఇంగ్లీషులో మాట్లాడినా వచ్చే రాష్ట్ర ఆగదని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సీఎం కట్టుబడి ఉంటానని చెప్పిండని గుర్తు చేశారు. ఇచ్చే శక్తీ లేదు.. ఆపే శక్తీ తమకు లేదని తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని జగన్‌ ప్లీనరీలో చెప్పలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శమని రాజేందర్‌ తెలిపారు. పొట్టి శ్రీరాములు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. 60 ఏళ్ల నిరీక్షణ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ పార్టీ తమ మ్యానిఫెస్టోలో తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆంధ్ర శాసన సభ్యులు మేం తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టో ఉంటే పోటీ చేయమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అప్పుడు రాజకీయాలకోసం తెలంగాణ అన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు తెలంగాణ బిల్లును అడ్డుకునే హక్కు లేదన్నారు. ఇప్పుడు బిల్లును అడ్డుకుంటున్న ఎమ్మెల్యేల సంగతులు ప్రజాక్షేత్రంలో ప్రజలే చూసుకుంటారని తెలిపారు. తెలంగాణ భూములు అమ్ముకున్న డబ్బులో కనీసం 10 శాతం కూడా ఖర్చు చేయలేదని ఈటెల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ దేశానికి తలమానికంగా ఉండేదని.. కాని ఇప్పుడు దాన్ని అమ్ముకుని మా చెరుకు రైతులు పండిన పంటను తగలబెట్టుకుంటున్నరాని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు సంఘటితంగా ఉండబట్టే దాన్ని పాలకులు అమ్మే సహాసం చేయలేదన్నారు. మాకు మేలు తలపెట్టి ఉంటే ఉద్యమాలు ఎందుకు వచ్చేవని ప్రశ్నించారు. హైటెక్‌సిటీ పక్కన ఉన్న భూములను లక్షల కోట్లకు అమ్ముకోలేదా అని ప్రశ్నించారు. పార్కులను, చారిత్రక స్థలాలను కూడా వదిలిపెట్టకుండా అమ్ముకున్నరు… మా వారాసిగూడ, అడ్డగుట్టలో బతికే మా కార్మికులకు వంద గజాల జాగకూడా లేదని ఆరోపించారు. విలీనం సమయంలో హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టులో తెలంగాణ సీనియర్‌ జడ్జిలను ప్రమాణస్వీకారం చేయించలేదా అని ప్రశ్నించారు. 56 ఏళ్ల చరిత్రలో ఒక్క అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలంగాణ వారు లేరన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంలో, జిల్లా జడ్జీల నియామకంలో తెలంగాణవారు కనీసం 20 శాతం వరకు కూడా లేరని అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడామని తెలిపారు. రెండు జీవనదులు పారుతున్న ఇంత గొప్ప ప్రాంతం ఎక్కడా లేదని, చుట్టూ జీవనదులున్న నా తెలంగాణను సీమాంధ్రులు ఎడారిగా చేశారని ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. కృష్ణానదిలో మేం వాడుకున్న నీళ్లు 15.4 శాతం మాత్రమేనన్నారు. గోదావరి నదిలో 79 శాతం హక్కుంటే.. వాడుకుంటున్నది 17 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఆంధ్రా ఇంజినీర్‌ కేఎల్‌ రావ్‌ తెలంగాణ నీళ్లు రాకుండా కాలువలు మళ్లించాడని ఆరోపించారు. నల్లగొండ జిల్లా తాగునీరు లేక ఫ్లోరైడ్‌తో విలవిల్లాడుతున్నదని బాధపడ్డారు. భార్య బిడ్డలను, కన్న తల్లిదండ్రులను వదిలేసి… పొట్ట చేత పట్టుకొని పాలమూరు జిల్లా వలస పోతున్నదని తెలిపారు. నా తెలంగాణ బోర్లు వేసీ వేసీ బొక్కబోర్లపడిందని పేర్కొన్నారు. జలయజ్ఞంలో ఏం తవ్వుతున్నరు అని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్‌ తెలంగాణకు ఏకైక జీవనం…ఇప్పటికి ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు రాక పల్లేరుగాయలు మొలిచినాయని తెలిపారు. సమైక్యరాష్ట్రంలో కలిసున్న పాపానికి తెలంగాణకు నీళ్లు రాకుండా పోయాయని చెప్పారు. మద్రాసుకు నీళ్లు ఇవ్వడానికి మనసు వచ్చింది కాని … తెలంగాణకు నీళ్లు ఇవ్వడానికి సీమాంధ్ర ప్రభుత్వానికి మనసురాలేదన్నారు. కల్వకూర్తి, నెట్టెంపాడు ఉన్నా రైతుల వలస పోయే దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌లో ఒక కర్నూల్‌ జిల్లాకు మాత్రమే హక్కుందని తెలిపారు. మా ప్రాజెక్టులను పక్కకు నెట్టి దౌర్జన్యంగా నీళ్లును దోచుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి దాకా శ్రీరాంసాగర్‌ నీళ్లు కరీంనగర్‌ జిల్లా దాటలేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు కనీసం 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన పాపానపోలేదన్నారు. హిందువులకు భగవద్గీత, ముస్ల్లింలకు ఖురాన్‌, కైస్త్రవులకు బైబిల్‌ ఎలాగో మాకు తెలంగాణ బిల్లు అంత పవిత్రమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. అటువంటి బిల్లును సీమాంధ్ర నేతలు విూడియా సాక్షిగా చించివేసి, తగలబెట్టడం మమ్మల్ని ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన టీఆర్‌ఎస్‌ తరఫున బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల మనస్సును దోచుకునే పని ఒక్కటి కూడా ఆంధ్ర పాలకులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇంతకాలం అన్నదమ్ముల్లా కలసి ఉన్నామని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అలాగే ఉందామని ఈటెల చెప్పారు. తెలంగాణ ఉద్యమం సంకుచితమైంది కాదని ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మద్దతిచ్చేవారు సీమాంధ్రలో కూడా ఉన్నారని ఈటెల గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో నూటికి నూరుశాతం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఉందన్నారు. 4కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన పార్టీగా బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణవారి మనసు దోచుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తెలంగాణారాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటికే అన్నిపార్టీలు బహిరంగంగా మద్దతిచ్చినందున కచ్చితంగా అదేమాట పై నిలబడి తెలంగాణా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ ఎల్పీనేత ఈటెల రాజేందర్‌ హితవు పలికారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణాకు నిన్నటివరకు అంగీకరిస్తూనే అనుకూలంగా ఉన్నామని చెప్పుతూ వచ్చిన పార్టీలు నేడు దుర్మార్గంగా వెనక్కి పోవడం శోచనీయమన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం ఒక్క రాత్రితో రాలేదన్నారు. కేవలం అవకాశ వాదంతోనే కొన్ని పార్టీలు నేడు ప్రయత్నిస్తూ వెనక్కి వెల్తున్నాయని ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా ఉన్న రాజకీయ పార్టీలు ఆడిన మాటకు కట్టుబడి రాష్ట్రం ఏర్పడే వరకు సహకరించాలన్నారు. ఇక్కడ ఆమోదించి పంపిస్తే పార్లమెంట్‌లో చరిత్రలో కనివిని రీతిలో గెలిపించుకునేందుకు అవకాశాలు సుగమం చేశామన్నారు. పార్టీలు ప్రజలకిచ్చిన హావిూలను అమలు చేయాల్సిన బాద్యతను విస్మరించరాదన్నారు. తెలుగుదేశం పార్టీ, సిపిఐ, కాంగ్రెస్‌, బిజెపి, వైసిపి, ఎంఐఎం, ప్రజారాజ్యం పార్టీ సైతం తమతో చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేశాయన్నారు. సిపిఎం కూడా తమబుజాలపై తుపాకి పెట్టి ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని, మీకిష్టం ఉంటే రాష్ట్రం ఇచ్చినా కూడా అభ్యంతరం వ్యక్తం చేయమని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణా బిల్లును ఆహ్వానిస్తున్నాం. చర్చ జరిపి త్వరగా కేంద్రానికి పంపించి సహకరించాలని ఈటెల కోరారు. ఇదే అసెంబ్లీలో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకోసం చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, నేటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు తెలంగాణా ఏర్పాటుకోసం చర్యలు తీసుకోవాలని కోరిన రికార్డులున్నాయన్నారు. కిరణ్‌ స్వయంగా కేంద్రం చెపితే ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా తీర్మానం చేస్తామని మాట్లాడిన మాటలు రికార్డుల్లో భద్రంగా నే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఊరికేకావడంలేదన్నారు. 1100మంది అమరులైన తెలంగాణ యువకుల ఆవేదన బిల్లు వెనుకాలే ఉందన్నారు. తెలంగాణాకు చెందిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల్సి ఉందని, తెలంగాణాకు సత్వరమే హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏ ప్రాంతంలో పుట్టిన వారు అదే ప్రాంతంలో పెన్షన్లు తీసుకోవాలన్నారు. తెలంగాణాలో రెండు పంటలను పండించుకునే అవకాశం కల్పించకుండా దుర్మార్గంగా తరలించుకుపోతున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, విద్య, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఏఒక్కరంగాన్ని తీసుకున్నా కూడా అన్నింటిలోనూ ఇబ్బందులకు గురి చేయడం వల్లే తెలంగాణా రాష్ట్ర ఉద్యమం వచ్చిందన్నారు. 1956నుంచే తెలంగాణా ఉద్యమం కొనసాగుతూవచ్చిందన్నారు. ఇంతకాలం ఆకలి కేకలు లేని, దుబాయి ముంబాయి బ్రతుకులు లేని తెలంగాణా రాష్ట్రంకోసం 60 ఏళ్లుగా పోరాటాలు చేయడం వల్లే నేడు రాష్ట్రం వస్తుందన్నారు. 57 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా తమ వనరులను దోచుకెళ్లి సీమాంద్రలో కర్మాగారాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. తట్టెడు బొగ్గులేక పోయినా కూడా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పెట్టకుండా కడపలో, విజయవాడలో పెట్టుకున్నారని ఆరోపించారు. రామగుండంలో జెన్‌కో పవర్‌ ప్లాంట్‌ను పెట్టాలంటే నేటికి కూడా నోచుకోలేదన్నారు. నీళ్లు, వనరులైన బొగ్గు అందుబాటులో ఉన్న రామగుండంలో ఎందుకు పవర్‌ ప్రాజెక్టు నిర్మించలేదో సీమాంద్ర పాలకుల పక్షాన నేటి పాలకులు చెప్పగలరా అని నిలదీశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు బిల్లు తమకు బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత లాంటిదని దీనిని తొక్కి, చింపి వారి విష సంస్కృతిని మరోసారి నిరూపించుకున్నారని ఈటెల ఆరోపించారు. అయితే తాము మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగలడం మాత్రం దుర్మార్గమన్నారు. తాము గంట మాట్లాడితే సీమాంద్రులు అయిదు గంటలు మాట్లాడుకోవచ్చన్నారు. ఇప్పటికే విభజన కోసం అనేక ఉద్యమాలు వచ్చాయన్నారు. ఇడ్లీ సాంబార్‌ ఉద్యమం 1952లో ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు కాక ముందే వచ్చిందని ఆనాడు కూడా సీమాంద్ర పాలకులు దుర్మార్గంగా 7గురిని తెలంగాణా వారిని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. 1969లో 369మందిని కాల్చిచంపారన్నారు. 1956 రాష్ట్రం ఏర్పాటు కాక ముందే తమ హక్కులు కాపాడాలంటూ ఉద్యమాలు తీసుకువచ్చారన్నారు. 1969లో తమ నాన్న, నేడు తాను, తన కుమారుడు మూడు తరాల ప్రజానీకం తెలంగాణా కోసం జరుగుతున్న పోరాటాల్లో పాల్గొంటూనే ఉన్నారన్నారు. అనేక సార్లు అబద్దాలు చెపితే నిజాలు అవుతాయనే ఉద్దేశంతో సీమాంద్ర నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణకు రెండు జీవనదులున్నాయన్నారు. ఇలాంటి చరిత్ర ఇంకెక్కడా లేదన్నారు. క్రిష్ణా నది 68.5శాతం నీరు వినియోగించుకోవాల్సి ఉన్నా నేటికి కూడా 15.4శాతంకు మించి వాడుకోలేక పోతున్నామన్నారు. అలాగే గోదావరిలో తెలంగాణాకు 79శాతం వాడుకోవచ్చని అయితే నేటికి కూడా కేవలం 15.07శాతం మాత్రమే వాడుకుంటున్నామన్నారు. తెలంగాణా జిల్లాలు నేడు బోర్లు వేసుకుని నీల్లు తోడుకోవాల్సిన దౌర్బాగ్యం ఉందన్నారు. సీమాంద్ర పాలకుల పుణ్యమాని నేటికికూడా ఎస్సారెస్పీ నీరు చివరి వరకు కూడా నేటికి చేరనేలేదన్నారు. తెలంగాణాకు ఎత్తిపోతలు, సీమాంద్రకు కాలువల ద్వారా నీల్లు తీసుకు పోతున్నారని ఆరోపించారు. 50ఏళ్ల చరిత్రలో నేటికి కాలువల ద్వారా చివరి వరకు నీళ్లు రావడంలేదని, ఇందుకోసమేనా కలిసి ఉండాలని కోరుకునేదని ఈటెల ప్రశ్నించారు. గోదావరి ప్రాజెక్టులు కట్టకుండా నేడు పోలవరం నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. నీళ్లవాటాను కోల్పోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులకు చుక్క నీరు కూడా అందడం లేదన్నారు. తెలంగాణా రాష్ట్రం కాకముందే 12లక్షల ఎకరాలకు నీళ్లు వినియోగించుకున్న చరిత్ర తమదన్నారు. నేడు దానిని కూడా కాపాడుకునే అవకాశాలు లేకుండా సీమాంద్ర పాలకులు చేస్తున్నారని ఆరోపించారు.
విశాలాంధ్ర ప్రయోగం విఫలం : మల్లేశ్‌
విశాలాంధ్ర ప్రయోగం విఫలమయ్యిందని, తెలంగాణ ప్రజలను అన్ని విధాలా దగా చేసినందున ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమయ్యిందని సిపిఐ పక్షనేత గుండా మల్లేశ్‌ అన్నారు. అడుగడుగునా ఒప్పందాలను తుంగలో తొక్కారని అసెంబ్లీలో చర్చ సందర్భంగా అన్నారు. అమాయకులైన తెలంగాణ ప్రజలను దోపిడీ చేశారని అన్నారు. అందుకే పోరాటాలు చేసి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్టాన్న్రి కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ పౌరులను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నందుకే సీపీఐ పార్టీ విశాలాంధ్ర భావన నుంచి ప్రత్యేక తెలంగాణ వైపు వచ్చిందని పేర్కొన్నారు. విశాలాంధ్రకు మద్దతుగా తాము పత్రిక పేరు కూడా విశాలంధ్ర పెట్టుకున్నామని అన్నారు. డ్రాఫ్ట్‌ బిల్లుపై ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్‌ అన్నారని గుర్తు చేశారు. సీఎం రాష్టాన్రికి చెందిన ముఖ్యమంత్రి ఒక ప్రాంత వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి అనని ఒప్పందాలను తుంగలో తొక్కారని అన్నారు. ఇక గతంలోకి పోకుండా అదొక పీడకలగా భావించి అందరూ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. తెలంగాణ పోరాటం ఇప్పుడే వచ్చింది కాదన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటం ద్వారా ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుందని అన్నారు. ఈ ఉద్యమం ప్రజల్లో ఉందని, దీనిని కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుని వెళ్లారని అన్నారు. 2002లో తాము ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. అందుకే కేసీఆర్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లి విజయం సాధించారన్నారు. ఇప్పుడు ఆయన ఆపినా ఆగదని అన్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో కలవడానికి ముందు ఈ ప్రాంతం ప్రత్యేక దేశంగా ఉందన్నారు. తెలంగాణకు 1948 సెప్టెంబర్‌ 17 స్వాతంత్రం వస్తే ఆ వేడుకలను ఘనంగా జరపలేని దుస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో సిపిఐ సభ్యుడు గుండా మల్లేష్‌ చేసిన వ్యాఖ్యకు ముఖ్యమంత్రి కిరణ్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎందుకు విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నానో చెప్తాని ముఖ్యమంత్రి అన్నారు. తమ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నానని వేరే వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై తనకు గౌరవం ఉందని, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారని, ఏదో చేయాలనే తపన ఉందని, ఒక్క తెలంగాణ విషయంలోనే తనకు సీఎంపై కోపం ఉందని మల్లేష్‌ అన్నారు. తెలంగాణ వల్లనే సమస్య వచ్చిందని ఆయన అన్నారు. కిరణ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, కేవలం సీమాంధ్రకు మాత్రమే కారని ఆయన అన్నారు. హైదరాబాద్‌ సంస్థానం చరిత్రను వక్రీకరించవద్దని ఆయన అననారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యమని ఆనాడు కమ్యూనిస్టులు అన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు రాష్టాన్న్రి కోరుకుంటున్నారని గుండా మల్లేష్‌ అన్నారు. శైలజానాధ్‌ కరుడు గట్టిన సమైక్యవాది అని ఆయన అన్నారు. చారిత్రక విషయాలు అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఇంతకాలం కల్లు మూసుకుని ఇప్పుడు శాసనసభలో సమైక్య తీర్మానం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. జాతీయ పార్టీగా, కమ్యూనిస్టులుగా చెబుతున్నాం, సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తాము ముందుకు వస్తామని ఆయన అన్నారు. మనమంతా రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశామని, రాజ్యాంగబద్దంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం బిల్లును తయారు చేసిందని, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిందని ఆయన అన్నారు. అన్ని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలమని చెప్పాయని, ఓట్లూ సీట్ల కోసం మాట మారుస్తున్నాయని ఆయన అన్నారు.
అడుగడునా దోపిడీ జరిగింది: గండ్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ బద్ధంగానే జరుగుతోందని ఎక్కడా ఉల్లంఘలను లేదా ఏకపక్ష నిర్ణయాలు జరగలేదని కాంగ్రెస్‌ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. విభజన బిల్లుపై చర్చలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు.. రాజ్యాంగ బద్ధ పక్రియను వ్యతిరేకించకూడదన్నారు. తెలంగాణపై 60 ఏళ్లుగా అన్యాయం జరిగిందని, ఆధిపత్యంతో ఇక్కడి వారిని అణచి వేశారని, అందుకే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు. తెలంగాణపై అనేక సంప్రదింపుల అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. విశాలాంధ్ర ఏర్పడినప్పటి హావిూలు అమలుచేయనందునే తెలంగాణ డిమాండ్‌ వచ్చిందని వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి ఇప్పడు మాట మార్చడం దారుణమన్నారు. రాజ్యంగ బద్ధంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని గుర్తుంచుకోవాలని గండ్ర తెలిపారు. తెలంగాణకు మద్దతిస్తామని చంద్రబాబు, కేంద్రం నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. టీ బిల్లుపై చర్చ సందర్భంగా గండ్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రతి అంశంలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు. తెలంగాణ ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక ఇచ్చిన హావిూలంటినీ తుంగలో తొక్కారు. నీలం సంజీవరెడ్డి తొలిసారిగా ఒప్పందాన్ని ఉల్లంఘించారని తెలిపారు. ఒప్పందాలన్ని ఉల్లంఘించినందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. హిందీ భాషను మాట్లాడే రాష్టాల్రు దేశంలో ఎన్నో ఉండగా తెలుగు మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేందని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం ఎన్నో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అణచివేత నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమమని అన్నారు. ఇక్కడి భూముల విషయంలో నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. కనీసం డిప్యూటీ సిఎం పదవి కూడా దక్కకుండా ఆరోవేలని ఎద్దేవా చేశారని మండిపడ్డారు. ఇక్కడ సీమాంధ్ర వాసులు ఎందరో స్థిరపడ్డారని అన్నారు. వారు ఇక్కడి వారితో కలసి ఉంటే లేనిపోని ఆందోళనలతో చిచ్చు పెట్టవద్దన్నారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టారని అన్నారు. ఇలాంటి ఎన్నో కారణాల కారణంగానే ఉద్యమం వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుని విభజనకు అంగీకరించిందన్నారు. ఇందుకు సహకిరంచిన ప్రధాని మన్మోహన్‌, సోనియాలకు కృతజ్ఞతలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తమను తాము పాలించుకునే శక్తి ఉందని, సీమాంధ్రుల సానుభూతి అక్కర్లేదన్నారు. ఉదయం 9గంటలకు శాసనసభ ప్రారంభమైంది. సభ ప్రారంభంలోనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి సమైక్యతీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యుల సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన వెంటనే వైకాపా సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. సమైక్య తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించనందుకు నిరసనగా సభనుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు వైకాపా శాసనసభాపక్ష నేత విజయమ్మ ప్రకటించారు. బిల్లుపై చర్చ తర్వాతే ఓటింగ్‌ ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్‌ స్పష్టం చేశారు. చర్చను కొనసాగించాలని చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణను స్పీకర్‌ ఆదేశించారు. ఆయన తన ప్రసంగంలో ఆంధ్ర పెత్తనంలో సాగిన అరాచకాలను ఏకరువు పెట్టారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు.. రాజ్యాంగ బద్ధ పక్రియను వ్యతిరేకించకూడదన్నారు. తెలంగాణపై అనేక సంప్రదింపుల అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. విశాలాంధ్ర ఏర్పడినప్పటి హావిూలు అమలుచేయనందునే తెలంగాణ డిమాండు అని వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి ఇప్పడు మాట మార్చడం దారుణమన్నారు.
సభలో గందరగోళం…పరస్పర విమర్శలు
ఈటెల రాజేందర్‌ బిల్లుపై ప్రసంగిస్తుండగా శుక్రవారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈటెల వ్యాఖ్యపై అభ్యంతరం తెలుపుతున్న కాంగ్రెస్‌ సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌ వైపునకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ దూసుకెళ్లారు. విద్యాసాగర్‌ తన చొక్కా పట్టుకున్నాడని కాంగ్రెసు సీమాంధ్ర సభ్యుడు గాదె వెంకటరెడ్డి చెప్పారు. అందుకు సభ్యుడితో క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ద్రోణంరాజు అభ్యంతరాలపై తెరాస సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. సమైక్య నినాదాలతో సీమాంధ్ర సభ్యులు, తెలంగాణ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దౌర్జన్యం చేస్తే అడ్డుకునే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని ఆయన అన్నారు. విద్యాసాగర్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని తెలుగుదేశం సభ్యుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కోరారు. సీమాంధ్ర సభ్యులను మంత్రి శైలజానాథ్‌, తమ పార్టీ సభ్యులను హరీశ్‌రావు సముదాయించి స్పీకర్‌ పోడియం నుంచి వెనక్కి రప్పించారు. సంఘటనకు తాము చింతిస్తున్నామని ఈటెల రాజేందర్‌ చెప్పినా సీమాంధ్ర సభ్యులు వినిపించుకోలేదు.
చర్చకు ముందు ఓటింగ్‌ అడుగడం పద్దతి కాదు :స్పీకర్‌
ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌ ఉంటుందని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సమైక్యతీర్మానంపై ఓటింగ్‌ పెట్టనందుకు నిరసనగా వైకాపా సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు. ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు కూడా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. చర్చకు మందే ఓటింగ్‌ నిర్వహించడం సభాసంప్రదాయం కాదని, చర్చ తర్వాతే ఓటింగ్‌ ఉంటుందని సభాపతి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశంపైచర్చే చేయకుండా ఓటింగ్‌కు పట్టుబట్టడం ఆయా పార్టీలకు సరైంది కాదని, ముందు చర్చనేది జరుగాలని స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రకటించారు. వైసిపి ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్‌ చేసిన తర్వాత టిడిపి ఉపనేత అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ అసలు సవరణలుంటాయా, చర్చ తర్వాత బిల్లుపై ఓటింగ్‌ ఉంటుందాలేదా అనేది స్పీకర్‌ ప్రకటించాలని కోరారు. ఈసందర్బంగా స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఓటింగ్‌ విషయంపైన ఇప్పటికే బిఎసిలో స్పష్టం చేశామన్నారు. ఇప్పటికే జరిగిన బిఎసిలో తీసుకున్న నిర్ణయాలు వైసిపికి చెందిన విజయమ్మతోపాటు మరో ముగ్గురుసబ్యులు కూడా ఆనాడున్నారని తెలిపారు. తొలుత చర్చ జరుగాల్సిందని, ఆరత్వాతే బిల్లుపై ఓటింగ్‌ ఉంటుందన్నారు. దీనిపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పీకర్‌ పేర్కొన్నారు. చర్చలో పాల్గొనకుండా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు.
శాసనసభ ఈ నెల 17కు, మండలి18 వరకు వాయిదా
శాసనసభ సమావేశాలు ఈ నెల 17కు వాయిదా పడ్డాయి. సభలో సీపీఐ సభ్యులు గుండా మల్లేష్‌ ప్రసంగించిన అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శాసనమండలి 18 వరకు వాయిదా పడింది. ఇదిలావుంటే ఈ నెల 3న ప్రారంభమైన సమావేశాలు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు బుధవారం నుంచి అంటే ఐదోరోజు చర్చ ప్రారంభించారు. వట్టి మాట్లాడుతుండగానే సభ వాయిదా పడింది. తిరిగి గురువారం చర్చ పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యింది. శుక్రవారం గండ్ర, ఈటెల, సిపిఐ నేత గుండా మల్లేశ్‌లు ప్రసంగించారు. మధ్యలో అనేక విధాలుగా అవాంతరాలు ఏర్పడ్డా చర్చ కొనసాగించారు. విభజన బిల్లుపై సభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ శాసనసభను వాయిదా వేశారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విభజన బిల్లుపై సవరణల ప్రతిపాదన ఇవ్వలేదని సమాచారం. కాగా ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్‌ తిరస్కరించటంతో పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. అనంతరం విభజన బిల్లుపై చర్చను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ సీపీ సభనుంచి వాకౌట్‌ చేసింది.