ప్రత్యేక రాష్ట్రంలో జనతన సర్కార్ సాకారం
ఆ దిశగా ప్రజాపోరాటాలు సాగాలి : వీవీ
18 ఏళ్ల తర్వాత ఓరుగళ్లు వీధుల్లో నక్సల్బరీ నినాదం
వరంగల్, జనవరి 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జనతన సర్కార్ సాకారమవుతుందని విప్లవ రచయిత వరవరరావు అన్నారు. విప్లవ రచయితల సంఘం రాష్ట్ర 24వ మహాసభలు శనివారం ఉదయం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయంత్రం నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో క్రాంతికారి జనతన సర్కార్ సాకారమయ్యే దిశగా ప్రజాపోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద అవశేషాలను అధిగమించే దిశగా నిర్మాణమవుతున్న ప్రజా ఉద్యమాలకు పర్యాయపదంగా నిలిచిన దండకారణ్య ప్రజా ఉద్యమాలను ఆయన సోదోహరణంగా వివరించారు. దండకారణ్యంలో ప్రజాయుద్ధం భూమి, భుక్తి, విముక్తి దిశగా పురోగమిస్తోందని ఆ సుగుణాలను ఆచరించడమే పరమావధిగా ఉద్యమాలు నడవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఏర్పడబోయే తెలంగాణలో కూడా అలాంటి పునర్నిర్మాణ ప్రక్రియ జరగడానికి సైద్ధాంతిక నిర్మాణముందని దాన్ని ఆచరణాత్మకం చేసే రీతిలో ఉద్యమ పునర్నిర్మాణం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్బంధాలు, అణచివేతలను ఎదుర్కొని తెలంగాణ ప్రాంతం చరిత్రలో దిక్కార సంస్కృతికి సంకేతంగా నిలిచిన ప్రాంతమని ఆ దిక్కార సంస్కృతిని ఆచరణ రూపంలో పెట్టేందుకు ఎదురుకానున్న నిర్బంధాలను ఇక్కడి నాయకత్వం ముందుకు తీసుకుపోతున్నది అంటూ అణచివేత నేపథ్యంలో రిట్రీట్‌లో కూడా విస్తరణను ఆసరాగా తీసుకొని విప్లవోద్యమాలు విస్తరణలో ముందుకు సాగుతున్నాయని వరవరరావు వివరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జనతన సర్కారు ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ఏ రకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయో ఆయన వివరించారు. విరసం సభల్లో భాగంగా వరంగల్ వచ్చిన ఆయన తనకు కలిగిన అనుభూతులను ఉద్వేగంతో వివరించారు. సమాజ పునర్నిర్మాణంలో విరసం అనుసరిస్తున్న పంథాను విస్పష్టంగా వివరించారు. ప్రజలకు ఒక స్పష్టమైన దృక్కోణంలో ముందుకు తీసుకుపోవడం తన తక్షణ కర్తవ్యంగా రచయితలు భావిస్తున్నారని తెలిపారు. విరసం ఆ అంశాలను ప్రధానంగా ఎంచుకున్నాయని తెలిపారు. ఈ సభలో కల్యాణరావు, కాళోజీ, వీఆర్ విద్యార్థి, కల్లూరి రుక్మిణి, విరసం కార్యదర్శి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.