దమ్ముంటే నా రాజీనామా ఆమోదించు
కిరణ్ కొత్త కుట్రకు తెరలేపిండు : శ్రీధర్‌బాబు
కరీంనగర్, జనవరి 12 (జనంసాక్షి) :
దమ్ముంటే తన రాజీనామా ఆమోదించాలని మంత్రి పదవికి రాజీనామా చేసిన డి. శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కొత్త కుట్రలకు తెరలేపిండని ఆయన ఆరోపించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్రలు తస్మాత్ జాగ్రత్త.. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలని ఓపికగా ఉన్నాం ఏదైనా ద్రోహం తలపడితే మిమ్మల్ని వెంటాడుతామని ఆయన హెచ్చరించారు. శాసనసభ వ్యవహారాల శాఖను తననుంచి తప్పించడం వెనుక సీమాంధ్రుల కుట్ర ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాబిల్లుపై సూచనలు మాత్రమే చేయాలని రాష్ట్రపతి పంపితే ప్రతిపక్షనేత చంద్రబాబు, సభానాయకుడు ముఖ్యమంత్రి ఓటింగ్ ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ శాసనసభలో అక్కడి రూల్స్ ప్రకారం జరిగిందని ఇక్కడ అదే సంప్రదాయం అనుసరించాలని కోరడం తగదని అన్నారు. మన శాసనభ రూల్స్ వారి రూల్స్ ఒకటి కాదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లును 23 తర్వాత చర్చ జరిపి పంపకుండా అదనపు గడువు కోరేందుక ప్రయత్నం చేస్తున్నారని దీనిని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్కతాటిపై వచ్చి వారి ఆటలు సాగకుండా చేసేందుకు ప్రతివ్యూహంతో ఉండాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ విషయంలో అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటానని చెప్పి యూటర్న్ తీసుకున్నారని ముందు మీరు అధిష్టానానికి ఇచ్చిన మాటపై నిబడాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి భిన్నంగా చర్చ ప్రారంభించినందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి తన నుంచి శాసనభవ్యవహారాల శాఖను తొలగించడని, తాను నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మాభిమానం కాపాడేందుకు రాజీనా చేశానని చెప్పారు. శ్రీధర్‌బాబు రాజీనామా చేయడంతో కొంత మందికి భయం పట్టుకొని భుజాలు తడుముకుంటూ తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా నేరుగా గవర్నర్‌కు పంపకుండా ముఖ్యమంత్రికి ఎందుకు ఇచ్చారని ఇది కేవలం మ్యాచ్‌ఫిక్సింగ్ అంటూ విమర్శలు చేస్తున్నారని ఇది కేవలం రాజకీయంగా బురద చల్లడమే అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి దుశ్చర్యలకు పాల్పడే మనస్థత్వం తనదికాదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అంతనీచమైన వ్యక్తిత్వం కలిగివుండరని తెలిపారు. రాజకీయాల కోసం తాను రాజీనామా చేయలేదని కేవలం తెలంగాణ కోసం తన శక్తియుక్తిని ఉపయోగించేందుకు మాత్రమే ఈ అస్త్రం ఉపయోగించానని చెప్పారు. తెలంగాణ చర్చ ప్రారంభమైనదని ప్రకటించినందుకు తన నుంచి శాసనసభ వ్యవహారాల పోర్టుపోలియో తొలగించిన ముఖ్యమంత్రి కుమిలి పోయేందుకు కొత్త పదవి తీసుకోకుండా మొత్తం మంత్రిమండలి నుంచి తప్పుకుంటూ రాజీనామా ఆయనకే పంపానని చెప్పారు. ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖ ప్రేమలేఖనో ఇంకేమనుకుంటున్నాడో కానీ దానిని వెంటనే గవర్నర్ ఆమోదం కోసం పంపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, టి.సంతోష్‌కుమార్, నాయకులు అడ్లూరి లక్ష్మన్‌కుమార్, సత్యనారాయణగౌడ్, నేరెళ్ల శారద తదితరలు పాల్గొన్నారు.