దేశానికి పునాదులు లౌకికవాదమే

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడ్డాం
‘రంగనాథ్‌మిశ్రా’ సిఫార్సుల అమలు పరిశీలిస్తున్నాం
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, జనవరి 13 (జనంసాక్షి) :
దేశానికి లౌకికవాదమే పునాదులని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించినన వివిధ రాష్ట్రాల మైనార్టీ కమిషన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. లౌకిక పునాదులపైనే దేశం నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో భారతదేశ లౌకికవాదానికి కొత్త భాష్యం చెబుతూ ఆ విధానానికి గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని మన్మోహన్‌ మండిపడ్డారు. దేశానికి ముప్పుగా పరిణమిస్తున్న విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి సూచించారు. ఇప్పటికీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో మాటల యుద్ధం తారస్థాయికి చేరిన తరుణంలో మన్మోహన్‌సింగ్‌ మరోసారి ఆయనపై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మైనార్టీల సంక్షేమానికి యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లౌకిక దేశంలో లౌకికవాద ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. మత హింసను ప్రోత్సహించే శక్తులెవరో తేటతెల్లమైన పరిస్థితుల్లో ప్రజలు ఆయా శక్తుల కుట్రలకు దీటైన సమాధానమివ్వాలని సూచించారు. లౌకికవాద దేశంగా భారత్‌ను ప్రపంచ చిత్రపటంలో ఎప్పటికీ నిలపాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో మైనార్టీ రిజర్వేషన్లపై రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సూచించిన సిఫార్సులను కేంద్ర పరిశీలిస్తుందని మైనార్టీ వ్యవహారాల శాఖా మాత్యుల రెహ్మాన్‌ తెలిపారు.