సభ కోరితే.. మరో పది రోజుల గడువు

రాష్ట్రపతి ఇచ్చే అవకాశం : పీటీఐ
శీతాకాల సమావేశల్లోనే బిల్లు తేవాలని కేంద్రం దృఢ నిశ్చయం
న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) :
రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై శాసనసభ, మండలి కోరితే రాష్ట్రపతి మరో పది రోజులు గడువు పొడిగించే అవకాశముందని పీటీఐ వార్తాకథనంలో వెల్లడించింది. అసెంబ్లీ కోరితే గడువు ఇవ్వడానికి అవకాశం ఉందని పేక్కొంది. రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన బిల్లుపై గడువు ఈ నెల 23తో ముగియనుంది. అయితే బిల్లుపై సమగ్రంగా చర్చ జరగాలని ముఖ్యమంత్రితో సహా పలువురు కోరతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో పదిరోజులు గడువు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. 23కు ముందే మళ్లీ గడువు కోరుతూ తీర్మానం చేసే అవకాశాన్ని సీఎం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే తెలంగాణ బిల్లు ఈనెల 23వ తేదీతో అసెంబ్లీకి వీడ్కోలు పలుకనుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు పిటిఐ కథనం తెలంగాణ వాదుల్లో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రపతి ఇచ్చిన ఈ గడువు ఇక ఎంత మాత్రమూ పెంచే అవకాశం లేదని భావించారు. 23వ తేదీతర్వాత రెండు, మూడు రోజులు ప్రభుత్వాధికారుల స్థాయిలో పేపర్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటే కేంద్రానికి వెళ్లిపోవడమే తరువాయని భావించారు. నిజానికి ఇప్పుడు పది రోజుల గడువు కనుక ఇస్తే ఇక ఈ ఎన్నికల లోపు విభజన జరగదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. సిఎం వైకరి కూడా ఇదగా ఉందని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండే అవకాశం లేదనే భావిస్తూ వచ్చారు. ఎన్నికల నాటికి రెండు రాష్టాల్రు ఏర్పాటు కావాల్సిందేననేది కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిశ్చితాభిప్రాయంగా ఉన్నట్లు ప్రచారంజరిగింది. అలాగే రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యేదాకా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే కొనసాగించనున్నారని కూడా సమాచారం. ఆంధప్రదేశ్‌ పునర్య్వవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013పై శాసనసభ అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. సభలో చర్చను అదే రోజు ముగించి ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో సభ్యుల అభిప్రాయాల అనువాద పక్రియ పూర్తి చేస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముసాయిదా బిల్లును కేంద్రానికి పంపించనున్నారు. బిల్లు కేంద్రానికి చేరిన వెంటనే ఫిబ్రవరి తొలి లేదా రెండోవారంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఆమోదముద్ర వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందని అందరూ నమ్ముతూ వచ్చారు. అయితే ఇది పొగించే అవకాశం ఉందన్న సమాచారంతో ఇప్పుడు తెలంగాణ వాదులు ఆలోచనల్లో పడ్డారు. ఫిబ్రవరి చివరినాటికి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నందున అంతకుముందే పార్లమెంటు ఆమోద పక్రియ పూర్తి చేయనున్నారని కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఏర్పాటుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న నాటినుంచీ దాన్ని వేగిరం చేసేందుకు పట్టుదలతో ఉన్నట్లు కనిపించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని దృఢాభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. అయితే ఏదో రకంగా ముసాయిదా బిల్లుపై చర్చ గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇచ్చేలా ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌, కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తదితరులు పొడగింపు ఉండదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. ఫిబ్రవరిలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభించి, సార్వత్రిక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయనే వాదనలకు వారివ్యాఖ్యలు మరింత బలాన్నిస్తున్నాయని పార్టీ వర్గాలతో పాటు- రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు ఆలోచనలో పడేశాయి. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ గత ఏడాది జూలై 30న నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ పక్రియ వేగంగా ముందుకు వెళుతున్నది. కేంద్ర కేబినెట్‌ సీడబ్ల్యూసీ నిర్ణయానికి ఆమోదం తెలియజేసి ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రపతికి పంపించడం వరకు ప్రభుత్వ పక్రియ వేగంగా సాగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బిల్లుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుని డిసెంబర్‌ రెండవ వారంలో బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపించారు. బిల్లుపై సభ్యుల అభిప్రాయం తెలియజేసేందుకు రాష్ట్రపతి ఆరు వారాలు, అంటే 42 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనున్నది. బిల్లు శాసనసభకు వచ్చిన తర్వాత కూడా దాదాపు 12 రోజుల వరకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ సీమాంధ్ర సభ్యులు అడ్డుకోవడంతో శాసనమండలి, శాసనసభలో చర్చించే అవకాశం లేకుండా పోయింది. కేవలం రెండు రోజుల నుంచే ఈ బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నది. మొదట్లో 12 రోజుల సమయం వృథా కావడంతో దాన్ని సాకుగా చూపిస్తూ గడువు పెంచాలని రాష్ట్రపతిని కోరుతామంటూ సీమాంధ్ర నాయకులు ప్రచారాలు చేస్తున్నారు. అయితే గతంలో అనేక రాష్ట్రాల విభజన సందర్భంగా ఆయా అసెంబ్లీలకు రాష్ట్రపతి చాలా తక్కువ గడువు ఇచ్చారు. మన రాష్ట్రం విషయంలో ఉదారంగా 42 రోజుల గడువు ఇచ్చారు. దానికితోడు ఇచ్చిన సమయాన్ని వృధా చేసి ఇప్పుడు గడువు పెంచాలని కోరడంలో సహజంగానే సహేతుకత ఉండదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయమితే పిటిఐ కథనం మరోలా ఉంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ మరోమారు భేటీ కోబోతోంది. తరవాత ఏం జరుగుతందన్నది చూడాలి. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌తో ఉన్న వ్యక్తిగత అనుబంధం కారణంగా సిఎం కిరణ్‌ చేసే విజ్ఞప్తిని ఆమోదించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. ఒకవేళ ముసాయిదాపై చర్చించే గడువు పొడిగించిన బిల్లు రాష్ట్రపతి నుంచి కేంద్రానికి త్వరగా చేర్చే ప్రయత్నం జరుగుతోందని, ఫిబ్రవరి రెండో వారంలోగా పార్లమెంట్‌ బిల్లును ఆమోదించడానికి యూపీఏ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం.