ఏఐసీసీ కీలక నిర్ణయం
నంబర్-2 రాహులే : ద్వివేది
రాహుల్ నాయకత్వంలో పనిచేస్తా : సింధియా
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఈమేరకు ఏకగ్రీవంగా రాహుల్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే సమావేశానికి హాజరైన వారిలో అత్యధికులు రాహుల్‌గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసినా సోనియాగాంధీ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీ కాదని, ఎన్నికల అనంతరమే ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తామని సభ్యులకు సోనియా గట్టిగా చెప్పినట్లుగా తెలిసింది. ఏఐసీసీ సమావేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ఎలా సమాయత్తం చేయాలని, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని సోనియాగాంధీ కీలక నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 22 అంశాలపై పార్టీ తీర్మానాలు చేసింది. అత్యంత కీలకమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత ఇచ్చిన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్‌గాంధీ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం సాగింది. అయితే ఎన్నికలకు ముందు పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదని సోనియాగాంధీ కరాఖండీగా చెప్పడంతో ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీయే నంబర్ 2 అని ఈ విషయంలో తిరుగే లేదని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది వెల్లడించారు. రాహుల్‌గాంధీకి కీలక బాధ్యతలు ఇవ్వడానికి పార్టీలోని ముఖ్య నేతలంతా సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకువచ్చారని, ఈ మేరకే ఆయనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు కట్టబెట్టారని ఆయన వెల్లడించారు. 2014 సాధారణ ఎన్నికలను ఆయన నేతృత్వంలోనే వెళ్తామని ద్వివేది స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, యూపీఏ-1, 2 పాలనలో ప్రజల కోసం చేపట్టిన ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మరోవైపు రాహుల్‌గాంధీకి ఇంకా కీలక బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు సోనియాకు సూచించినట్లుగా తెలిసింది. ఈ మేరకు ఆయనకు అతి త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టవచ్చనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి పార్టీలో మద్దతు పెరుగుతోంది. ఆయన నాయకత్వంలో పనిచేస్తామని పలువురు నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. గురువారం పలువురు నేతలు రాహుల్‌కి బహిరంగంగా తమ మద్దతు ప్రకటించారు. దేశానికి రాహుల్ లాంటి యువ, ప్రగతి శీల నేత ప్రధానిగా అవసరమని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. రాహుల్ అవసరం పార్టీకన్నా దేశానికే ఎక్కువన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ రాహుల్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని తాను ఆశిస్తున్నట్లు సింధియా పేర్కొన్నారు. తాను పార్టీలో ఎలాంటి పదవిని అప్పగించినా స్వీకరిస్తానని అన్నారు. అలాగే ఆయన నేతృత్వంలో పనిచేయడానికి ఇంకా ఉత్సాహం చూపుతానని అన్నారు. రాహుల్ అవసరం పార్టీకి దేశానికి ఉందన్నారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ కూడా రాహుల్ పట్ల తమ విశ్వసనీయతను చాటుకున్నారు. రాహుల్‌తో ఎవరికైనా సమస్యలుంటే వారు పార్టీని వదిలి పోవచ్చని సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రధానిగా మంచిపేరు తెచ్చుకోగలరని అన్నారు. రాహుల్ నాయకత్వం అవసరమని అన్నారు.
తాజావార్తలు
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..
- తల్లి మృతి – పరీక్షకు హాజరైన కుమారుడు
- ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…
- మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్
- ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం
- విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
- మరిన్ని వార్తలు