ఏఐసీసీలో రాహుల్‌ నామస్మరణ

యూపీఏ విజయాలు ప్రజలకు వివరిస్తే మళ్లీ అధికారం : ప్రధాని
అన్ని బిల్లులు ఆమోదం పొందుతాయి
మతతత్వమే దేశానికి ప్రమాదం : సోనియా
ప్రజాస్వామ్యమంటే వ్యక్తి కాదు
ఎంపీలే ప్రధానిని ఎన్నుకుంటారు
కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో 50 శాతం మహిళా ముఖ్యమంత్రులు : రాహుల్‌
న్యూఢిల్లీ, జనవరి 17 (జనంసాక్షి) :
ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశం రాహుల్‌ నామస్మరణతో మార్మోగింది. రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంటూ సమావేశానికి హాజరైన నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ విజయం అంటే.. రాహుల్‌గాంధీ విజయమే అని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే 2014 ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ దశాబ్దకాలంగా కృషి చేసిందన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిని చూసి నిరాశకు లోనుకావాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షం ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తోందని ప్రధాని ఎద్దేవా చేశారు. దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించగల ఏకైక పార్టీ కాంగ్రెస్సేనన్నారు. ఆర్థిక వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. పార్టీని 2014 ఎన్నికలకు సిద్ధంచేసే దిశగా ఇది కీలక సమావేశమని గుర్తుంచుకోవాలని అన్నారు. మనం చేపట్టిన పథకాలను ప్రజలకు సమర్థంగా వివరించగలిగితే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తామని గుర్తుంచుకోవాలని సూచించారు. అభివృద్ధి, లౌకిక పాలనను అందించేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని చెప్పాలన్నారు. ప్రతిపక్షం చేస్తున్న వాగ్దానాలన్నీ ఆచరణసాధ్యంకానివే అన్నది ప్రజలకు చేరవేయాలన్నారు. ఆర్థికవృద్ధిని సాధించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నామని అన్నారు. గత ఏడాదిలో 5 లక్షల కోట్ల ప్రాజెక్టులను కేబినెట్‌ ఆమోదించింది. పేదరిక నిర్మూలన, మహిళల సంక్షేమానికి కాంగ్రెస్‌ పెద్దపీట వేసింది. మహిళల రక్షణకు ఎన్నో చర్యలు చేపట్టింది. చట్టాలు తెచ్చింది అని ప్రధాని వివరించారు. అధికారులు కాగ్‌ ప్రశ్నిస్తుందని భయపడి నిర్ణయాలు తీసుకోవడానికి జంకుతున్నారు. అయితే తమ హయాంలోనే ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఎన్నో కొత్త సంస్థలు తెరిచాం. ధరలు పెరగడం వల్ల ఒక వర్గం ఇబ్బంది పడ్డా ఉత్పత్తిదారులైన మరో వర్గం లాభపడింది. ఇవన్నీ కూడా యూపిఎ సాధించిన విషయాలన్నారు.
దేశానికి మతతత్వమే ప్రధాన సవాలు : సోనియా
భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. దేశానికి మతతత్వం, మతతత్వవాదులు సవాల్‌గా మారాయని పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి అన్నారు. దేశ పురోభివృద్ధిలో ఇవే ప్రధాన ఆటంకాలన్నారు. ఏఐసీసీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సమావేశం మనలో నింపిన ఆత్మవిశ్వాసంతో వచ్చే ఎన్నికల్లో పోరాడదామన్నారు. ఆరు ప్రధాన బిల్లులు ఆమోదం కోసం కలిసి కృషి చేద్దామని సోనియా తెలిపారు. మనమందరం కలిసి పనిచేస్తే ఏ శక్తీ మనల్ని ఆపలేదని సోనియా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవినీతి ప్రధాన సమస్యగా మారిందని, దానిపై నిరంతర పోరాటం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు సెక్యులరిజం విధానమని, రాజకీయ సర్దుబాటుకాదన్నారు. మోడీని దృష్టిలో పెట్టుకుని ఆమె విమర్శలు గుప్పించారు. బిజెపి చెబుతున్న విధానాలు ప్రమాదకరమన్నారు. అవినీతిపై పోరాటంలో పార్టీలో ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు. దేశానికి మతవాదుల నుంచే ముప్పు ఉందన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీరు విఘాతంగా మారారని అన్నారు. విభజించి పాలించే విధానాన్ని బిజెపి అవలంబిస్తోందని సోనియా ఘాటుగా అన్నారు. బిజెపి పేరెత్తకుండానే ఆమె వారి చర్యలను గట్టిగా వ్యతిరేకించారు. తమ అసలు రూపం బయటపడకుండా వారు ముసుగు వేసుకుని ప్రచారం చేయగలరని, దానికి ప్రాచుర్యం కల్పించగలరని అన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ప్రకటించే ప్రసక్తే లేదని సోనియాగాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో సీడబ్లూసీ నిర్ణయమే ఫైనల్‌ అని ఆమె మరోసారి తేల్చిచెప్పారు. 2014 ఎన్నికలు సిద్దాంతాల మధ్య పోరుగా సాగుతుందని సోనియా అభిప్రాయపడ్డారు. సంక్షోభాలు ఎదుర్కోవటం కాంగ్రెస్‌కు కొత్త కాదని సోనియా అన్నారు. ప్రధాని అభ్యర్థిత్వంపై రాహుల్‌దే తుది నిర్ణయమన్నారు. సెక్యులరిజంతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సోనియా సూచించారు. వచ్చే ఎన్నికల పోరుకు కాంగ్రెస్‌ సిద్ధమన్నారు. కుల, మతలతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని సోనియా ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, సంక్షోభాలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు కొత్త కాదని సోనియా తెలిపారు.కాగా నిన్న జరిగిన సీడబ్లూసీ భేటీలో రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై డిమాండ్లు వెల్లువెత్తినా.. పార్టీలో ఆ సంప్రదాయం లేదని పేర్కొన్న సోనియా.. ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. కాగా సమావేశంలో రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు నినాదాలు చేశారు. అయితే ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించడం ముఖ్యం కాదని, లోక్‌సభ ఎన్నికలకు తమందరం సిద్ధంగా ఉండాలని సోనియాగాంధీ చెప్పారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికే ఇక్కడ తామంతా సమావేశమయ్యామని ఆమె తెలిపారు. సెక్యూలర్‌ సంప్రదాయాన్ని కాపాడేందుకు వచ్చే ఎన్నికలనే యుద్ధంలో పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, పీవీ రంగారావుకు ఏఐసీసీ ఘనంగా నివాళులర్పించింది. అంతకు ముందు సోనియాగాంధీ జెండా ఆవిష్కరించారు. సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర నేతలు హాజరయ్యారు.
అవినీతికి వ్యతికంగా పోరాడుతోంది కాంగ్రెస్సే : రాహుల్‌
దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోంది కాంగ్రెసేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళల్లో దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసి యువతకు ఉపాధి బాట చూపిన ప్రధాని మన్మోహన్‌ ధన్యుడని అన్నారు. ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రధాని పాత్ర మాటల్లో చెప్పలేనిదన్నారు. ఏఐసీసీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంతో పాటు ఎన్నో చట్టాలు తేవడం ద్వారా ప్రజలకు అధికారం ఇచ్చినట్లయిందన్నారు. మన్మోహన్‌ పాలనలో దశాబ్దం పాటు ఆర్థికశక్తిగా భారత్‌ ఎదిగిందన్నారు. అయితే విపక్షాలకు మార్కెట్‌ ట్రిక్కులు బాగా తెలుసని, వారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోగలరని అన్నారు. ఎన్నికైన ఎంపీలు మాత్రమే ప్రధానిని ఎన్నుకుంటారని చెప్పారు. నవతరం రాజకీయాల్లోకి యువతరం రావాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. పదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన యూపీఏ వల్లనే యువతకు అనేక అవకాశాలు వచ్చాయని, ఈ విషయంలో అద్భుత పనితీరు కనబర్చిన ప్రధానమంత్రికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ బలం సోనియగాంధీ, ఇతర సీనియర్‌ నాయకులేనని ఆయన చెప్పారు. చట్టాల రూపకల్పనలో ఎంపీలు, ఎమ్మెల్యేల వాణిని కూడా వినిపించాలని రాహుల్‌ తెలిపారు.సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని, కానీ ఇప్పుడు అదంత సులభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే ఆయన ఆ పార్టీపై దాడి చేశారు. ప్రతియేటా పార్లమెంటు నడవకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని మండిపడ్డారు. మతవిద్వేషాగ్నులు రగులుస్తోందన్నారు. తాము దేశానికి అవినీతి వ్యతిరేక బిల్లులు ఇవ్వబోతున్నామని, వాటివల్ల దేశం సమూలంగా మారిపోవడమే కాక.. అవినీతిపరులకు శిక్ష, నిజాయితీపరులకు రక్ష ఉంటాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ఎంపీలే కాంగ్రెస్‌ ప్రధానిని ఎన్నుకుంటారని రాహుల్‌ అన్నారు. ఇక నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎవ్వరూ అంతం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. సిలెండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సగానికిపైగా మహిళలే ముఖ్యమంత్రులు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి టిక్కెట్లు ఇవ్వబోమని, అలాగని ఎవరైనా పార్టీలోకి వస్తామంటే ద్వారాలు మూసేయమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్‌ సైనికుడుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సమాచార హక్కు చట్టం ఒక్క కాంగ్రెస్‌వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కన్న కలలు సాకారం చేస్తూ నగదుబదిలీ పథకం అమలు చేస్తున్నామని రాహుల్‌ పేర్కొన్నారు.ఆర్బీఐ చట్టం ద్వారా దేశ ప్రజలకు అధికారం ఇచ్చామని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు. ప్రజల కోరిక మేరకు ఆర్టీఐ చట్టం తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. దేశంలో ఆధార్‌ కార్డులు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన అన్నారు. దేశంలో పేదలకు సాధికారత సాధికారత కట్టబెట్టింది కూడా కాంగ్రెస్సేనని తెలిపారు. నగదు బదిలీ ద్వారా సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. దేశంలో టెక్నాలజీకి పెద్ద పీఠ వేశామని, బ్యాంకుల జాతీయం నుంచి ఈనాటి వరకు పేదలకు ఎంతో చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసింది కూడా కాంగ్రెసేనని ఆయన తెలిపారు. ఎన్ని చేసినా చట్టాలు చేయాల్సింది ప్రజాప్రతినిధులేనని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యమంటే ఏ ఒక్క వ్యక్తి పాలనా కాదని, ప్రజా ప్రతినిధుల పాలన అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు రాజకీయాల్లోకి సామాన్యులు వచ్చే పరిస్థితి లేదని, దీనిని మనం మార్చాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజల క్క ఆకాంక్షలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులుగా అనర్హులవుతారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుతున్నా.. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుంటున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లుపై అందరూ తమాషా చేశారని, చివరికి లోక్‌పాల్‌ చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అవినితిని అరికట్టడానికి ఇంకా ఆరు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి కూడా ఆమోదం పొందితే అవినీతిపై పోరాటం వేగం పుంజుకుంటుందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని 21వ శతాబ్దంలోకి నడిపించాలని, అందుకు కార్యకర్తలే ఆ పని చేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం తగ్గించాలని, ఏళ్లతరబడి కష్టపడి పనిచేసి, పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన కార్యకర్తల్ని గౌరవించాలని ఆయన అన్నారు. నిజాయతీకి రక్ష.. అవినీతికి శిక్ష… విధానం ఆధారంగా మరిన్ని చట్టాలు తీపసుకుని రావాల్సి ఉందన్నారు. అవినీతిని అరికట్టేందుకు ఆర్టీఐ, లోక్‌పాలే కాదు, త్వరలో మరిన్ని బిల్లులు తెస్తాం.పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో సగం రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. మహిళా సాధికారత రానంతవరకూ ఈ దేశం నిలదొక్కుకోలేదన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీఎంలను కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే ఎన్నో వ్లిపవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతం దిశగా రాజీవ్‌ నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతిరహిత దేశంగా చేసేందుకు లోక్‌పాల్‌ తెచ్చాం. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అధికారం ఇచ్చినట్లయింది. ఎవరి ఒత్తిళ్లకు లొంగి చట్టం తేలేదు. ప్రజల కోరిక మేరకే తెచ్చాం.అని వివరించారు. శాస్త్ర, సాంకేతిక రాంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలిపింది కాంగ్రెసే. ప్రజలకు అధికారాన్ని ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌. చట్టాల రూపకల్పనలో ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు కాంగ్రెస్‌ విలువ ఇస్తుంది. కాంగ్రెస్‌ ఎప్పుడూ విద్వేష రాజకీయాలను ప్రోత్సహించదంటూ పరోక్షంగా బిజెపిని దుయ్యబట్టారు.