కలిసి కదిలితే జయం మనదే..
పార్టీ శ్రేణులతో రాహుల్ మంతనాలు
ప్రచార సారథిగా రంగంలోకి..
ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక : రాహుల్
న్యూఢిల్లీ, జనవరి 18 (జనంసాక్షి) :
కలిసి కదిలితే విజయం మనదేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. పార్టీ ప్రచార సారథిగా ఆయన రంగంలోకి దిగారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు నిత్యం నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున టికెట్ల కేటాయింపులు, మిత్రపక్షాలతో పొత్తులు, వారికి కేటాయించాల్సిన సీట్లు, ఎన్నికల్లో అనుసర్సించాల్సిన వ్యూహం రచించేందుకు రాహుల్ శనివారం పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజోపయోగ పథకాలను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ విజయాలను సమర్థంగా వివరిస్తే విజయం తథ్యమని శ్రేణులకు రాహుల్ ఉద్భోదిస్తున్నారు. ఈమేరకు పీసీసీ, డీసీసీ అధ్యక్షులతో రాష్ట్రాల వారీగా భేటీ అయిన రాహుల్‌గాంధీ స్థానిక పరిస్థితులు, ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే అంశాలపై చర్చించారు. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఎన్నికలు మరో మూడు నాలుగు నెలలున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ప్రతినిధులతోనూ ఆయన సమావేశమయ్యారు. మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహ రచన తదితర అంశాలపై అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయిన రాహుల్ ఒక్కో రాష్ట్రానికి చెందిన వారితో 15 నిమిషాల నుంచి 30 వరకు మాట్లాడారు.