కిరణ్‌కు నైతిక విలువల్లేవ్‌

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

వరంగల్‌, జనవరి 19 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నైతిక విలువల్లేవని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం స్థాని నిట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పునర్మిర్మాణం కోసం మరో ఉద్యమం తప్పదని  కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ సాధన కోసం చేపట్టిన ఉద్యమం స్ఫూర్తిగా అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ బిల్లుకు ఇచ్చిన గడువును పొడిగించొద్దని, కేంద్రం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అంగీకరించలేని వారు ప్రజాస్వామ్యాన్ని కూడా అంగీకరించనట్లేనని, సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ ఆస్తులు కాపాడుకునేందుకే తెలంగాణను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి విద్య, వైద్య రంగాల్లో పాతుకుపోయారని మండిపడ్డారు. టీజేఏసీ కో చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం నవనిర్మాణ సేనను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు పది జిల్లాల్లో పది వేల గ్రామాల్లో లక్ష మందిని సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్ర పాలకులు ఎక్కడ మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారో అక్కడి నుంచే పునర్నిర్మాణం ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌ మాట్లాడుతూ తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని వెనక్కి పంపకుంటే పునర్నిర్మాణం ముందుకు సాగదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీమాంధ్ర ఉద్యోగులకు ఇక్కడ పనిచేసే అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాగ్ధానం నెరవేర్చకుంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు హామీలు ఇచ్చిన నాయకులపై తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సదస్సులో పౌర హక్కుల నేత ప్రొ. హరగోపాల్‌, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సీిహెచ్‌ విద్యాసాగర్‌రావు, జల సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, జయశంకర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు వి. ప్రకాశ్‌, తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, టీఎన్‌జీఓస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి, ప్రొఫెసర్లు సీతారామారావు, సూరెపల్లి సుజాత, టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కోల రాజేశ్‌ కుమార్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి. జనార్దన్‌, టీిఆర్‌ఎస్‌ నాయకులు శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొనగా, తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం చీఫ్‌ అడ్వయిజర్‌ జగదీశ్వర్‌ అధ్యక్షత వహించారు.