అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన అటకెక్కినట్లేనా..?

ముందుకు కదలని కార్యాచరణ
హైదరాబాద్‌,జనవరి20: కొత్తగా ఏర్పడబోయే తెలంగాణలో అసెంబ్లీ  సీట్ల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఇంకా ఓ రూపం దాల్చినట్లు కనిపించడం లేదు. ఇందుకోసం వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. తాజాగా మండలిలో ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ ఆదివారం చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరోమారు ప్రస్తావించారు. సీట్ల పెంపు వల్ల అనిశ్చితిని తొలగించాలని కోరారు. విడిపోయాక ఇరు ప్రాంతాల్లో సీట్ల పెంపును పరిశీలించాలన్నారు. ఇదిలావుంటే ఈ వ్వయహారాన్ని తెరపైకి తెచ్చిన మర్రశశిధర్‌ రెడ్డి ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. దీంతో అసలు సీట్లు పెరుగుతాయా లేదా అన్నది స్పస్టత లేకుండా  పోయింది. సీట్లు పెరిగితే రాజకీయంగా టిక్కెట్లు ఆశిస్తున్న వారికి టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది. దీంతో కొత్త రాష్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రజాప్రతినిధులు చర్చ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఇప్పటికే మర్రి శశిధర్‌రెడ్డి నాయకత్వంతో కొందరు కాంగ్రెస్‌ నేతలు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీమాంధ్రలోనూ సీట్ల సంఖ్యపెంచాలని వారు కోరుతున్నారు. దీనిపై త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏ మాత్రం దృష్టిసారించనున్నది, ఆ దిశగా కేంద్రం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా అన్నది ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, పాలన వికేంద్రీకరణకు అవకాశాలు తక్కువగా ఉన్నందున్న నియోజకవర్గాల సంఖ్య పెంచాలని మర్రి శశిధర్‌రెడ్డి వాదిస్తున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా సీట్లు పెనిగితే ఎక్కువమంది సభ్యులకు అవకాశం కూడా వస్తుంది. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని, సీమాంధ్రలో 175గా ఉన్న అసెంబ్లీ స్థానాలను రెండు వందలకు పెంచాలని కోరుతున్నారు. దీనివల్ల రాజకీయంగా బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి లాభం చేకూరే అవకాశమున్నందున అక్కడ పార్టీ టిక్కెట్ల కోసం పోటీపడే అశావాహుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఇదే ఆలోచన కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా చేస్తోంది. టిక్కెట్లు దక్కని వారు గ్రూపులు కడితే అసలుకే మోసం వస్తుందన్న భయం కూడా ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచితే అదనంగా 34 సీట్లు పెరుగుతాయి. సీమాంధ్రలో 175 నుంచి అసెంబ్లీ స్థానాలు రెండు వందలకు పెంచడం ద్వారా 25 పెరుగుతాయి. తెలంగాణలో అదనంగా 34 సీట్లు పెరగడం వల్ల ఎన్నికల్లో పోటీపడే సంఖ్యను పెంచి అసంతృప్తుల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. మున్ముందు ఈ ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరగడం వల్ల ఎమ్మెల్సీ అభ్యర్థుల సంఖ్యను కూడా పెంచుకోవచ్చని, రాజ్యసభ స్థానాలు కూడా పెరుగుతాయన్న ఆలోచన కాంగ్రెస్‌ నాయకత్వం చేస్తున్నుట్ల సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఓటర్లు మాత్రం తొమ్మిది, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సరిపడ ఉన్నారన్నది ఓ వాదన. ఈ నేపథ్యంలో సీట్ల పెంపు వ్యవహారం సాగాలని చర్చ సాగుతోంది. అయితే ఇంతవరకు ఈ ప్రతిపాదనలు వెళ్లినా ఎలాంటి సమాధానం దొరకలేదు. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి ఓటు బ్యాంకు బలంగా ఉందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా వారి బలాన్ని సైతం పరిమిత సంఖ్యకు పరిమితం చేయవచ్చన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా భవిష్యత్తులోనూ తెలంగాణలో బిజెపి బలం పెరగకుండా చూడవచ్చని, కాంగ్రెస్‌ పార్టీ పుంజుకొనేలా చేయవచ్చని ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఇదిలావుంటే ఈ నియోజకవర్గాల సంఖ్య పెంపు అంశం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు సూచిస్తే జరిగే అవకాశమున్నందున అది ఎంతవరకు సాధ్యం అన్నది ప్రస్తుతం చర్చాంశనీయమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం కనుక అసెంబ్లీ నియోజకవర్గాల అంశం పెద్ద కష్టమేవిూ కాదని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. ఈ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని, పార్టీలో ఎన్నికల్లో పోటీచేయాల్సిన వారికి అవకాశాలు కల్పించడం అవుతుందని ఆయన పేర్కొంటున్నారు. ఈ దిశగా కూడా కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోందని, విభజన బిల్లు ఆమోదం తొలి ప్రాధాన్యత ఇస్తున్న మున్ముందు దీనిపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఈ అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యసాధ్యాలపై కూడా కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచనలు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు కొన్ని పేర్కొంటున్నాయి. ఇది ఓ రకంగా కాంగ్రెస్‌కు లాభించేదని అంటున్నారు. తెలంగాణతో పాటు సీమాంధ్రలో మళ్లీ పాగా వేయడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్న వాదన ఉంది. అయితే ఇది ఎంతవరకు సానుకూలమవుతుందో చూడాలి.