మా రాజే మస్త్ అభివృద్ధి చేసిండు
సౌకర్యవంతమైన నగరం కాబట్టే మీరొచ్చిండ్రు
మీరు కూర్చున్న అసెంబ్లీ, మీరమ్మిన పవర్ పవర్‌ప్లాంట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అప్పటివే
హిందూ బనారస్ యూనివర్సిటీకి పది లక్షలు, ముస్లిం అలీఘడ్ వర్సిటీకి ఐదు లక్షలు చందా ఇచ్చిండు
సెక్యులర్ అనడానికి ఇంకేం కావాలి
మాకు కరెంటొచ్చాక 17 ఏళ్లకు చెన్నైలో బుగ్గ వెలిగింది
1956 తర్వాత అభివృద్ధి ఆగిపోయింది
సీమాంధ్రుల విష ప్రచారాన్ని తిప్పికొట్టిన అక్బరుద్దీన్, ఈటెల
హైదరాబాద్, జనవరి 20 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను నిజాం నవాబే చాలా అభివృద్ధి చేశాడని ఎంఐఎం, టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేతలు అక్బరుద్దీన్ ఓవైసీ, ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ ఏర్పాటు అంశంపై శాసనసభలో వాడీవేడీ చర్చ సాగింది. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. నిజాం కాలం నాటి అభివృద్ధిని, నాటి పాలనను వివరిస్తూ ఆయన ఉదాహరణలతో చేసిన ప్రసంగం హైదారాబాద్‌ను అభివృద్ధి చేశామన్న వారికి గట్టి చెంపదెబ్బ కొట్టేలా చేసింది. హైదరాబాద్ ఆనాడే చెందింది కాబట్టే అందరూ ఇక్కడికొచ్చారరని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. తెలంగాణకు ఇప్పుడూ వస్తారని, ఇకముందు కూడా వస్తారని, దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. టీ బిల్లుపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందీ ఆయన సోదాహరణంగా వివరించారు. ఎప్పుడో అభివృద్ధి చెంది, ఆదాయంలో మిగులుగా ఉన్న తెలంగాణను తామే అభివృద్ధి చేశామని అనడం సరికాదన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తులు 27 ఏళ్లకు పైగా అధికారంలో అంటే సీఎంలుగా ఉన్నా రాయలసీమను అభివృధ్ధి చేయలేదన్నారు. ఎందుకు చేయలేదన్నారు. తనకు ఐదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెపుతూ చరిత్రను వక్రీకరిస్తున్నాడన్నారు. మాట మార్చడం చంద్రబాబుకి అలవాటు కాబట్టి రాష్ట్రప్రజలు ప్రతిపక్ష నేతను నమ్మడం లేదని అక్బరుద్దీన్ అన్నారు. రాష్ట్ర విభజనపై ఇప్పటికి వరకు స్పష్టమైన వైఖరి తెలపని నేత ఎవరన్న ఉంటే అతను చంద్రబాబే నన్నారు. ప్రస్తుతం దేశానికి లౌకికవాద నాయకత్వం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీని వ్యతిరేకించిన బాబు ఇప్పుడు మళ్లీ బిజెపితో జతకట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని మండిపడ్డారు. నిజాం కంటే హైదరాబాద్‌కు చంద్రబాబు ఏం ఎక్కువ చేశాడాని, హుస్సేన్ సాగర్ పవర్ ప్లాంట్‌ను రూ.6కోట్లకు అమ్మింది ఎన్టీఆర్ కాదా? అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌కు కరెంటొచ్చిన 17 ఏళ్ల తర్వాత చెన్నైకి కరెంటొచ్చి బుగ్గ వెలిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని చంద్రబాబు అక్బరుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ఆదాయం ఎప్పటినుంచో సర్‌ప్లస్‌లో ఉందని, స్వాత్రంత్య్రానికి ముందే ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. ఆంధ్ర నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను కట్టించింది నిజామేనని అన్నారు. దాంట్లో ఎంతోమంది చదువుకున్నారని ఆయన అన్నారు. సిమెంట్ రోడ్లను మొదట నిర్మించింది హైదరాబాద్‌లోనేనన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌నూ అప్పట్లోనే నిర్మించారు.. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. 1850లోనే పోస్టాఫీసు, 1919లో హైకోర్టు, 1930లోనే హైదరాబాద్‌లో విద్యుదుత్పత్తి జరిగిందని అక్బరుద్దీన్ చెప్పారు. 1940కు ముందే హైదరాబాద్‌లో ఎన్నో పత్రికలున్నాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరిగాకే అందరూ ఇక్కడకు వచ్చారని, సీమాంధ్ర నుంచి వచ్చిన ఎంతో మంది నేతలు హైదరాబాద్‌లో చదువుకున్నారని ఆయన గుర్తు చేశారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇక్కడికి రావచ్చు, ఉండచ్చునన్నారు. అసలు రాష్ట్ర విభజనతో నిజాంకు ఏం సంబంధం ఉందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్ రాష్ట్రంలో అనేక పరిశ్రమలను నిజాం స్థాపించారని, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పారని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ అన్నారు. 1854 నుంచే నిజాం ప్రభువు విద్యాసంస్థలను నెలకొల్పారన్నారు. సీమాంధ్ర నుంచి వచ్చిన ఎందరో నేతలు హైదరాబాద్‌లో చదువుకున్నారన్నారు. రాయలసీమ, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో నీటివనరుల సంరక్షణ కోసం నిజాం ఎంతో పాటుపడ్డారు. 1940కి ముందే హైదరాబాదులో ఎన్నో పత్రికలు ఉన్నాయి. 1930లో నిజాం హయాంలోనే హైదరాబాదులో విద్యుదుత్పత్తి జరిగింది. హైదరాబాదులో రైల్వే స్టేషన్లు నిజాం కాలంలోనే నిర్మించారన్నారు. మీరు కూర్చున్న అసెంబ్లీ, మీరమ్మిన పవర్ పవర్‌ప్లాంట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం కాలంలో నిర్మించినవేనని గుర్తు చేశారు. హిందూ బనారస్ యూనివర్సిటీకి పది లక్షలు, ముస్లిం అలీఘడ్ వర్సిటీకి ఐదు లక్షల రూపాయల చందా నిజాం ఇచ్చిండని, ఇలా ఎందుకు రెండు వర్సిటీలకు సమానంగా ఇవ్వలేకపోయారా అంటే దేశంలో హిందూ జనాభే ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ చందా ఇవ్వడమే న్యాయమన్నారని, నిజాం సెక్యులర్ అనడానికి ఇంకేం కావాలని అక్బరుద్దీన్ నిలదీశారు. నిజాం గురించి మాట్లాడితే రాజ్యాంగ విరుద్దం అన్న మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుత రాష్ట్ర విభజనకు నిజామ్‌కు సంబంధం ఏమిటని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శాసనసభలో విభజన బిల్లుపై మాట్లాడుతూ కేశవ్ తదితర సభ్యులు నిజాం పేరును ప్రస్తావించారు. దీనిపై అక్బరుద్దీన్ జోక్యం చేసుకుంటూ రాష్ట్ర విభజనకు కారణమైనవారిని వదిలేసి నిజాం పేరును ప్రస్తావించడం ఎందుకు? అని నిలదీశారు. చైనాతో పోరాడేందుకు భారత్‌కు 120 కిలోల బంగారం ఇచ్చింది నిజాం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ మినీ ఇండియా అని నెహ్రూ చెప్పిన మాటలను మరిచిపోయారా? అని అన్నారు. చంద్రబాబు ఇద్దరు కొడుకుల సిద్ధాంతం ఏంటని ఆయన ప్రశ్నించారు. విభజనపై చంద్రబాబు డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. సమన్యాయం అంటే ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు ఎలాంటి న్యాయం కోరుతున్నారో ఎందుకు వెల్లడించరని ప్రశ్నించారు. విభజనపై మీ విధానం ఏమిటని చంద్రబాబును అడిగితే విూకు ఎంతమంది పిల్లలు అని ఎదురు ప్రశ్న వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చేతులు కలపబోమని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నరేంద్ర మోడీతో ఎందుకు చేతులు కలిపారని నిలదీశారు. నిజాం పాలనపై అసెంబ్లీలో మంత్రి శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజనకు కారకులైన వారిని వదిలేసి నిజాం నవాబులను నిందించడం తగదన్నారు. రాష్ట్ర విభజనకు నిజాం కారకుడా అని ప్రశ్నించారు. నిజాంలు సమర్థుడైన పాలకులని కితాబిచ్చారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో నిజాం నవాబులు 120 కేజీల బంగారాన్ని భారత సైన్యానికి ఇచ్చారని గుర్తు చేశారు. పాత గాయాలజోలికి పోవద్దని, వాటిని రేపితే అన్ని ప్రాంతాల ప్రజలు గాయపడతారని అక్బరుద్దీన్ అన్నారు.
సమైక్యరాష్ట్రం ఏర్పడిననుంచి అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడాన్ని తుంగలో తొక్కి వేల కోట్లు సంపాదించుకుని స్వంతంగా అభివృద్ధి చెందింది రాజకీయ నాయకులేనని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. సీమాంధ్రకు చెందిన శైలజానాథ్, జయప్రకాశ్‌నారాయణ, తోక తొటారం నేతలంతా సభను తప్పుదారి పట్టించే పద్ధతిని మానుకుని వాస్తవాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. హత్యారాజకీయాలు, నేర సంస్కృతి సీమాంద్రులదేనని వారు గుర్తుంచుకోవాలన్నారు. కారంచేడులోను, లక్ష్మిదేవిపేటలోను, పదిరికుప్పం తదితర ప్రాంతాల్లో దళిత, బడుగు బలహీనవర్గాల వారిని తరుముకుంటూ ఊచకోత కోసింది ఎవ్వరో ప్రపంచానికి తెలుసన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే మాటలు మాట్లాడుతూ హీరోను కావాలనుకుంటే అతి అవేవకమే అవుతుందని మంత్రి శైలజానాథ్‌కు హితవు పలికారు. బాంచెన్ బ్రతుకులు, బానిస బ్రతుకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం నిలిచిందన్నారు. చరిత్ర తెలియని సీమాంధ్రులు దున్నపోతుల్లా నిద్రపోయినేడు తప్పు దారి పట్టించడం శోచనీయమన్నారు. ఫ్యాక్షనిస్టుల ఇళ్లముందు కాపలా కుక్కల్లా వ్యవహరిస్తూ బ్రతికిన చరిత్ర సీమాంధ్రులదని గుర్తుంచుకోవాలన్నారు. నిజంగా బడుగు, బలహీనవర్గాలపై ప్రేమాభిమానాలున్నట్లు నటిస్తున్న రాజకీయ నేతలు రాయలసీమలోని 54 మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీల్లో ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగతా వాటిల్లో గడిచిన 55ఏళ్ల చరిత్రలో ఎంతమందిని ఎస్సీ, ఎస్టీ, బిసిలను గెలిపించారో లెక్కలు చెప్పగలరా అని ఈటెల నిలదీశారు. మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోక పోతే రాబోయే రోజుల్లో మాత్రం తన ప్రజలనుంచే తగిన గుణపాఠం నేర్చుకుంటారని ఈటెల హెచ్చరించారు. తాను దళితుడినని గర్వంగా చెప్పుకుంటున్న ఆయన ఆప్రాంతానికి, తన నియోజకవర్గంలోని దళితులకు ఏపాటి సేవచేశాడో కూడా అవసరమైతే బయట పెట్టేందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను, కించపరిస్తే తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. బహుముఖ మేధావిగా ఉన్న లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా అసెంబ్లీలో ఖాకి లెక్కలు చెపుతూ వచ్చారే తప్ప సమైక్య రాష్టాన్న్రి ఏలిన పాలించిన నాయకుల బాగోతాలను ఎందుకు బట్టబయలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. సీమకు పరిశ్రమలు రాలేదని, అబివృద్ధి లేనేలేదని, కరువుందని, సాగునీరు లేవని గొప్పగా చెప్పిన మేధావి జయప్రకాశ్ నారాయణ అసలు విషయాన్ని ఎందుకు మరిచిపోయాడో అర్థం కాలేదన్నారు. ఇంత కాలం సీమకు అస్సాంకంటే, మిజోరం, తదితర రాష్ట్రాలకంటే అన్యాయం జరిగిందని, ప్రత్యేక ప్రతిపత్తిని అడిగే ముందు ఇప్పటివరకు ఆపని ఎందుకు చేయలేదని ఈటెల జేపిని ప్రశ్నించారు. సీమకు చెందిన ముఖ్యమంత్రులేకదా రాష్ట్రాన్ని పాలించిందన్నారు. ఆనేతలంతా ఇప్పటివరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేవలం తమకు తాము అభివృద్ధి చెందేందుకే ప్రాధాన్యతనిచ్చారనే వాస్తవ విషయం జేపికి తెలియదా అన్నారు. దేశంలోనే అత్యధిక మంది 42 మంది ఎంపీలున్న ఈ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు సీమకు ఎందుకు ప్రత్యేక ప్రతిపత్తిని తీసుకు రాలేదని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మాత్రమే వారి వ్యవహారం ఉందని అభ్యంతరం చెప్పారు. ఇప్పటికైనా సీమాంధ్రుల పీడ విరుగడైతే తప్ప తెలంగాణకు న్యాయం జరుగదని గుర్తించాం కాబట్టే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి స్వయం పరిపాలన చేసుకుంటామన్నారు. విజయవాడలో తెలుగు వారిపై దాడి దుర్మార్గమని ఈటెల ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాద్యులపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.