మైనార్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలి

హైదరాబాద్‌లో 42, గ్రేటర్‌లో 33 శాతం ముస్లింలున్నారు
పది జిల్లాల తెలంగాణే
గవర్నర్‌కు అధికారులొప్పుకోం : అక్బరుద్దీన్‌
మట్టి విగ్రహాలు కులితే గుండెలు బాదుకున్నారు
మనుషులు చనిపోతే కనికరించరా : కేటీఆర్‌
హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) :
కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోనూ మైనార్టీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాజధానికి ఒపపుకోబోమని అన్నారు. రెండోరోజు కూడా ఆయాన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అనేక అంశాలను స్పృశించారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం దేశ భద్రతకే ప్రమాదకరంగా మారిందన్నారు. ఉమ్మడి హైకోర్టుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, శాంతి భద్రతలు రాష్ట్రానికే అప్పగించాలని కోరారు. ‘హైదరాబాద్‌ అందరిదీ, ఏ ఒక్కరి జాగీరూ కాదు’ అని ఒవైసీ స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వాలనేది రాజకీయ నిర్ణయమన్నారు. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమేనని.. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు. హైదరాబాద్‌ నగరంలోలో 42 శాతం, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 33 శాతం ముస్లింలున్నారని ఆయన పేర్కొన్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఒప్పుకునేది లేదని అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుందన్నారు. ఆంధప్రదేశ్‌ ఏర్పడినప్పుడు ముస్లిం మనోభావాలు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. 1956లో ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అధికార భాషగా ఉన్న ఉర్దూను తొలగించారని అక్బరుద్దీన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన వల్ల ముస్లిం మైనార్జీలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రాంతీయ బోర్డులు ఉన్నా అవి నామమాత్రమేనని అన్నారు. అనంతపురం, కర్నూలు కలుపుతూ రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని జీవోఎంలో కోరినట్లు అక్బరుద్దీన్‌ తెలిపారు.
ఎవరెంతగా ప్రయత్నించినా రాష్ట్ర విభజనను అడ్డుకోలేరని తెలిసినా కూడా దుర్మార్గంగా వ్యవహరించే విధానాన్ని విరమించుకోవాలని సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు హితవు పలికారు. సుదీర్ఘ వాదోపవాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత కేటిఆర్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. సాగునీటి రంగంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ట్యాంక్‌బండ్‌పై మట్టి విగ్రహాలు కూలితేనే గగ్గోలు పెడుతున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడ మనుషులు చనిపోయినా కనికరించరా అంటూ ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు గొలుసు గట్టు చెరువుల నిర్మాణం పూర్తయి ఉంటే కోటి ఎకరాల భూములు సాగులోకి వచ్చేవన్నారు. 1365 టీిఎంసీల నీరు వినియోగంలోకి వచ్చేవన్నారు. నేడు తెలంగాణ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చేది కానే కాదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జలయజ్ఞం పేరుతో చేపట్టిన ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సీఎం చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణాలో విద్యుత్‌ ఉండదని, నీటి యుద్ధాలు వస్తాయని ఇరుప్రాంతాల ప్రజలను రైతులను సిఎం భయపెడుతున్నారనని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి బెదిరింపులు చేయడం సరైంది కాదన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టని సమైక్య పాలకులు నేడు పోలవరం ఎలా నిర్మిస్తున్నారని, అయిదు వేలకోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా వెచ్చించారో చెప్పగలరా అని డిమాండ్‌ చేశారు. ఇచ్చంపల్లి, రాజోలిబండ తదితర తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించే విషయంలో ఎందుకు చిత్తశుద్ది చూపించ లేదని ప్రశ్నించారు. 45ఏళ్లక్రితం చేపట్టిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేటికి కూడా రెండో దశ చేపట్టనేలేదన్నారు. అదే పులిచింతల, తెలుగుగంగ చేపట్టి పూర్తి చేసుకోలేదా అని ఇది వివక్షకు తార్కాణం కాదా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద లెఫ్ట్‌ రైట్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణాలోని నల్గొండ జిల్లాకు న్యాయం జరిగేది కాదా అని ప్రశ్నించారు. సీమాంధ్రకు పోయే రైట్‌ మాత్రం పూర్తి చేసుకుని లెఫ్ట్‌ కాలువలను ఇప్పటికి పూర్తిచేయక పోవడంను ఏమంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజంగానే ప్రతిపాదిత స్థలం నందికొండవద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే నల్గొండ జిల్లాకు న్యాయం జరిగి ఉండేది కాదా అన్నారు. 20 కిలోవిూటర్ల క్రిందికి తీసుకుపోయి సీమాంద్రకు లాభం జరిగేలా నిర్మించుకున్నది వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంటే నీటి యుద్దాలు వస్తాయని చెప్పే సీఎంకు ఒక విషయం గుర్తుంచుకోవాలన్నారు. భారత్‌తో యుద్ధం చేసిన పాకిస్థాన్‌తో అయిదు నదులు నీళ్లు పంచుకుంటున్నది అవాస్తవమా అని ప్రశ్నించారు. నైలునది నీటిని 11 దేశాలు పంచుకోవడం లేదా అన్నారు. అలాంటప్పుడు తెలంగాణా ఏర్పడితే యుద్దాలు వస్తాయనడం దుర్మార్గమే అవుతుందన్నారు. కేవలం అక్రమ ప్రాజెక్టుల డొల్లతనం బయటపడుతుందని బాధ ఉందన్నారు. కృష్ణా నదినీటిపైన అక్రమంగా నిర్మించుకుని తరలించుకుపోతున్న నీరు ఇక ముందు రాదనే వాస్తవం విషయాన్ని చెప్పితే బాగుంటుందన్నారు. తెలంగాణకు ఏం న్యాయం చేశారని కలిసి ఉండాలో చెప్పాలని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధి గురించి గల్లలు చించుకుంటున్నారని, గొంతలు చించుకుని తామే అబివృద్ధి చేశామని చెప్పడం అన్యాయమన్నారు. కొందరేమో శాశ్వత ఉమ్మడి రాజధాని అంటున్నారని, మరికొందరేమో యూటి అంటున్నారని ఆరోపించారు. 1908లోనే హైదరాబాద్‌ పట్టణం దేశంలో నాలుగో స్థానంలో ఉందని, 1948లోనే అయిదో స్థానంలో ఉందన్నారు. నేటికి కూడా అదే అయిదో స్థానంలోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిజంగానే తాము అభివృద్ది చెశామని చెప్పుకుంటే హైదరాబాద్‌ నేడు రెండు మూడో స్థానాలకు ఎందుకు పాకలేదో చెప్పగలరా అని నిలదీశారు. మద్రాస్‌నుంచి విడిపోయినప్పటి అరాచకాలను గుణపాఠంగా నేర్చుకోవాలన్నారు. ముంబాయిని గుజరాత్‌ డిమాండ్‌ చేసినప్పటికి కూడా అక్కడ సాధించుకోలేదనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలన్నారు. యూటికి ఊటీకి తేడా తెలియని నేతలు కూడా హైదరాబాద్‌ను శాశ్వత యూటి చేయాలనే వారు సీమాంధ్రులని ఎద్దేవా చేశారు. ఈదేశానికి చెందక పోయినా కూడా మథర్‌ థెరిస్సాకు భారత రత్న గౌరవం ఇచ్చిన సంస్కృతి మనకుందన్నారు. ఆంధ్రా – తెలంగాణగా విడగొట్టాలని ఆనాడే ఎన్టీఆర్‌, నేడు బ్రతికి ఉన్న అక్కినేని నాగేశ్వర్‌రావు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. నిన్నటికి నిన్న 2008లో తెలంగాణకు అనుకూలమని టీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికలకు పోయింది వాస్తవం కాదా అన్నారు. నేడు అన్నిపార్టీల ముసుగులు తొలగి పోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. సీమాంధ్రులకు కూడా ద్రోహం చేసేందుకే తెలంగాణను అడ్డుకుంటు న్నారని విమర్శించారు. ఇప్పటికే చేయి దాటిపోయే పరిస్థితులున్నాయని, అలాంటి దానిని చక్కదిద్దాదలం టే విభజనకు సహకరించాలని కేటిఆర్‌ సీమాంధ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. శాశ్వతంగా శత్రువులుగా తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు నిలిచిపోయేలా చేయొద్దన్నారు. తెలంగాణ బిల్లుపై కూడా తాము సవరణలు కోరుతున్నామని, దీనిని అంగీకరించేందుకు కూడా సిద్దంగా లేమన్నారు. శాశ్వతంగా గవర్నర్‌కు అధికారాలివ్వొద్దని, ఉద్యోగులను పుట్టిన ప్రదేశం ఆధారంగానే విభజించాలని, హైదరాబాద్‌ను కేవలం మూడేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆయన సవరణలు ప్రతిపాదించారు.