అక్కినేనికి అశ్రునివాళి

పోటెత్తిన అభిమానులు
పోలీసు లాంఛనాలతో పొదరిల్లులో అంత్యక్రియలు
హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) :
తెలుగు సినీ దిగ్గజం, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వర్‌రావుకు అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అశ్రునివాళులతో వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు నగరానికి తరలివచ్చారు. ఎక్కడైతే తిరగాడో అక్కడే మట్టిలో కలసిపోయాడు అక్కినేని. తను ప్రేమించి కట్టుకున్న ప్రేమనగర్‌ అదే అన్నపూర్ణ స్టూడియోలో శాశ్వతంగా సేదతీరారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టిన ఆ పల్లెటూరి పిల్లవాడి జీవితం హైదరాబాద్‌ నడిబొడ్డున తాను కట్టుకున్న స్టూడియోలో ఓ మూల చితిలో గతించి పోయింది. తన జ్ఞాపకాలను విడిచి… తిరిగి రాని లోకాలకు వెళ్ళి పోయాడు. ఆ తొంబయి ఏండ్ల సుధీర్ఘ జీవన ప్రయాణం అన్నపూర్ణా స్టూడియోలో ఆగి పోయింది. అక్కడి అణువులో కలసిపోయింది. అనేకానేక పాత్రలు వేసి భారత దేశంలో ఎందరో అభిమానులను సంపాదించిఉకున్న ఆ మహా దిగ్గజం ఇక సెలవంటూ వెళ్ళిపోయింది. అవార్డులను రివార్డులను సొంతం చేసుకుని ప్రేక్షక లోకానికి తన జ్ఞాపకాలను పంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు. అభిమాననటుడిగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు అన్నపూర్ణా స్టూడియోలో పూర్తయ్యాయి. అన్ని రంగాల ప్రముఖులు, రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అభిమానుల మధ్య శోకతప్తులైన కుటుంబసభ్యులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అక్కినేని కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్లు అందరూ విషణ్ణ వదనాలతో తమ కుటుంబ పెద్దకు శ్రద్ధాంజలి ఘటించారు. దుఃఖం ఆపుకోలేక పలుసార్లు విలపిస్తూనే జరగాల్సిన పనులకు సహకరించారు. పలువురు ప్రముఖులు ఆయన చితిపై గంధపు చెక్కలు అమర్చి ఘననివాళులర్పించారు. కుమారులు, మనవలు కలిసి అక్కినేని చితికి నిప్పంటించారు. అక్కినేని గౌరవార్థం పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీస్‌ బ్యాండు గౌరవ వందనం సమర్పించింది. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మహానటుడికి అన్నపూర్ణ స్టూడియాలో మధ్యాహ్నం 3.30 గంటలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు నిర్వహించిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. నాగార్జున, వెంకట్‌, సుమంత్‌, అఖిల్‌, సుశాంత్‌, నాగ చైతన్య తదితరులు పాడె ఎత్తుకుని భౌతిక కాయాన్ని చితి వద్దకు చేర్చారు. ఈ సమయంలో నాగార్జున దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి చెందిన మహిళలు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు సందర్భంగా అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖాన్ని ఆపులేకపోక భోరున ఏడ్చేశారు. అక్కినేని అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న తర్వాత నాగార్జున, వెంకట్‌, నాగ చైతన్య, అఖిల్‌, సుమంత్‌, సుశాంత్‌ తదితరులు పాడె ఎత్తుకుని భౌతికకాయాన్ని చితి వద్దకు చేర్చారు. అశ్రునయనాలతోనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.అంత్యక్రియలు జరుగుతున్నంతసేపు ఆయన దుఃఖిస్తూనేఉన్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి చితికి నిప్పటించారు. తరవాత అశ్రునయనాలతో అక్కడి నుంచి వెనుదిరిగారు. తండ్రికి చివరిసారి వీడ్కోలు పలికి పుట్టెడు శోకంలో మునిగిన నాగార్జునను దాసరి నారాయణరావు, బ్రహ్మానందం గుండెలకు హత్తుకుని ఓదార్చారు. చిరంజీవి తదితరులు కూడా ఆయనను ఓదార్చారు. దాసరి నారాయణ, సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, రాజశేఖర్‌, జీవిత, శ్రీదేవి, మహేశ్వరి, టబు, రమాప్రభ తదితర ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దీంతో ఓ పల్లెటూరిలో పుట్టిన పల్లెటూరి పిల్లగాడి తొంభయి ఏళ్ళ సుదీర్ఘ జీవిత పయనం ముగిసింది. చిన్నప్పడు పశువులు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ పశువులపై కూర్చుని తిరిగిన ఆ పిల్లవాడు. తన పాట ద్వరా తన అభినయం ద్వరా అఖిలాంధ్ర మూడు తరాల ప్రేక్షకలోకాన్ని అలరించాడు. అవే జ్ఞాపకాలను మిగిల్చారు. అంతకుముందు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫిలిం చాంబర్‌ చేరుకున్న భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. ఫిలిం ఛాంబర్‌నుంచి ప్రారంభమైన అక్కినేని అంతిమయాత్ర అన్నపూర్ణా స్టూడియోకు చేరుకుంది. సహనటిగా ఎన్నో చిత్రాల్లో అక్కినేనితో కలిసి నటించిన శ్రీదేవి ముంబయి నుంచి వచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు. ఫిలింఛాంబర్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అక్కినేని భౌతికకాయాన్ని కడసారి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన శకటంలోకి అక్కినేని భౌతికకాయాన్ని చేర్చారు. వెన్నంటి సాగుతున్న అభిమానుల అశ్రునివాళుల మధ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. అక్కినేని కుటుంబసభ్యులంతా వాహనంలో భౌతికకాయం వెంటే ఉన్నారు. ప్రేమాభిషేకం…లో కథానాయికను ఇంప్రెస్‌ చేయడం కోసం ఆమెకు తన ప్రేమను వెల్లడించడం కోసం కథానాయకుడు రాజేష్‌ ఓ లొఅకేషన్‌ లో తారలు దిగివచ్చిన వేళ… మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఓ కబురు చెప్పాలి ఓ పాట పాడాలి అనే పాట పాడతాడు. కరెక్ట్‌ గా ఆ పాటను చిత్రీకరించిన లొకేషన్‌ పక్కనే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కోసం చితిని పేర్చారు. ఆ స్థలంలో ఎంతో మంది తారలు ఎన్నో సినిమాల కోసం ఆడారు పాడారు. ఇప్పుడు ఆ స్థలం అక్కినేని ఘాట్‌గా మారబోతోంది. అక్కడే ఆ రాజేష్‌ పాటను ఆస్వాదించిన కథానాయిక దేవి అదే శ్రీదేవి ఇప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావును చివరి సారిగా చూడటానికి సినిమా పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది. నటీనటులు,దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయనతో అనుబంధః ఉన్న రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఫిలిం ఛాంబర్‌ కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడిని కడసారిగా దర్శంచి కన్నీరు పెట్టుకున్నారు. జాతీయ విూడియా కూడా అక్కినేని అంతిమ యాత్రను ప్రసారం చేయడానికి వచ్చింది. అలనాడు ఆయన సినిమాలు చూసి ఆయనను అభిమానించిన ఆ తరం వారు తరువాత తరాల వారు తమ అభిమాన నటుడిని చివరి సారిగా చూడాలనే ఆశతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు. కొందరు తమ అభిమాన నటుడు ఇక తమకు కనిపించడు అనే నిజాన్ని మేము తట్టుకోలేక ఉన్నామని ఆవేదన వెలిబుచ్చారు.