తెలంగాణ చకచకా
పార్లమెంట్ వెలుపలే ఏకాభిప్రాయం
భాజపాతో సంప్రదింపులు
విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో చర్చలు
గడువు పొడిగించైనా బిల్లును ఆమోదింపజేస్తాం : కమల్‌నాథ్
న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చకచకా పావులు కదుపుతున్నాయి. ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించేందుకు సభ వెలుపలే ఏకాభిప్రాయానికి కసరత్తు చేస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే భేషరతుగా మద్దతిస్తామని ఆమె ఇది వరకే ప్రకటించారు. ఇటీవల మోడీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు తెలంగాణ ఏర్పాటుతో పాటు సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తుండటంతో బిల్లు సందర్భంగా ఆ పార్టీ ఏమైనా వెనక్కు తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటిని నివృత్తి చేసుకోవడంతో పాటు లోగడ ప్రకటించిన విధంగా బిల్లుకు మద్దతు తెలిపాలని కాంగ్రెస్ నేతలు సుష్మాను కోరారు. అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో సునాయాసంగా విజయం సాధించేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సోనియాగాంధీ తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టి ఎన్నికల్లోగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంలో ఉండటంతో పాటు ప్రధాన ప్రతిపక్షాన్ని ఇందులో భాగస్వామ్యం చేసేలా వ్యూహం రచించారు. ఎన్‌డీఏ పక్షాలన్నీ బిల్లుకు మద్దతిస్తున్న నేపథ్యంలో బిల్లు త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందేందుకు తమదైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు నెల రోజుల గడువుకావాలంటూ ముఖ్యమంత్రి కిరణ్, సీఎస్ పీకే మహంతి వేర్వేరుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాయగా, ఆయన ఈనెల 30 వరకు గడువిచ్చిన విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పాసయ్యేందుకే ప్రణబ్ వారం రోజులు మాత్రమే గడువిచ్చారని స్పష్టమవుతోంది. గడువు పెంపుపై సీఎం మళ్లీ లేఖ రాసేందుకు ఉద్యుక్తమవుతున్నా అది వృథా ప్రయాసేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వంలోనే తెలంగాణ ఏర్పడుతుందని, యూపీఏ అందుకు కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. తెలంగాణ బిల్లును ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగించేందుకు కూడా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. బిల్లుపై శాసనసభ ఆమోదంతో పనిలేకుండానే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. అసెంబ్లీలో కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు.
మహాత్ముని ఆశ్రమంలో మంతనాలు
మేనిఫెస్టో రూపకల్పనలో రాహుల్ తలమునకలు
సేవాగ్రమ్, జనవరి 24 (జనంసాక్షి) :
మహారాష్ట్రలోని వార్ధా సేవ్‌గ్రమ్ ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారథి రాహుల్‌గాంధీ మంతనాలతో తన వ్యూహాలకు పదను పెట్టారు. పార్టీ ముఖ్యులతో కలిసి ఆయన ఎన్నికల మేనిఫెస్టో తయారీలో తలమునకలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు, స్థానిక సంస్థలు, యువత తాలూకు సాధికారత ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధినేత రాహుల్ గాంధీ గట్టిగా చెప్పారు. వారికి సాధికారత లేకుండా భారత్ ఒక అగ్రరాజ్యం కాలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ముసాయిదా మ్యానిఫేస్టో రూపకల్పన కోసం వేర్వేరు వర్గాల ప్రజల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మహాత్మాగాంధీ ఆశ్రమం వద్ద పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎన్జీవోలు, ప్రభుత్వ అధికారులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారు. ఈ 50 శాతానికి మనం సాధికారతను కల్పించలేని పక్షంలో భారత్ 50 శాతం బలాన్ని, గర్వకారణాన్ని, శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే 50 శాతం అగ్రరాజ్యంగా మాత్రమే మిగిలిపోతుంది. కోట్లాదిగా ఉన్న మన యువతకు మనం ఒక పద్దతి ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో, మన సర్పంచ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించని పక్షంలో మన దేశం ఒక అగ్రరాజ్యం కాజాలదు అని టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ వివరించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థులను ఎన్నుకొనే ప్రక్రియలో వికేంద్రీకరణ జరగాలని ఆయన గట్టిగా వినిపించారు. నేడు మా పార్టీలో అలాగే బిజెపిలో కేవలం ఐదు నుంచి ఏడుగురు మాత్రమే అభ్యర్థులందరిని నిర్ణయిస్తున్నారు. ఇది అవినీతి మూలాల్లో ఉంది. ఈ ప్రక్రియలో కింది స్థాయి ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించిన పక్షంలో 50 శాతం అవినీతి తుడిచిపెట్టుకుపోతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారి హోదాలకు తగ్గ అధికారాలు లేవు. అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో స్ధానిక సంస్థల్లోని మన ప్రతినిధులు వాణి వినిపించడంలేదు. నేను హామీ ఇస్తున్నా వారి వాణి వినిపించేలా చేస్తా. నూటికి నూరు శాతం ఈ పని చేస్తానని మీకు మాట ఇస్తున్నా అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు.