ఏం ఫరక్‌ పడదు

బిల్లును కిరణ్‌ ఎప్పుడు సమర్థించాడు?
87 మంది సభ్యులు అభిప్రాయాలు చెప్పారు
మెజార్టీ సభ్యులు లిఖితపూర్వకంగా ఇచ్చారు : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, జనవరి 26 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడు సమర్థించాడని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఆయన బిల్లును తిప్పి వెనక్కు పంపాలని కోరినంత మాత్రాన ఏం ఫరస్‌ పడదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి సభ్యుల అభిప్రాయాల కోసమే ముసాయిదా బిల్లును పంపామని దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఇరువురి మధ్య అరగంటకు పైగా చర్చలు సాగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీలో చర్చ, తదితర విషయాలను డిగ్గీకి జానారెడ్డి తెలియజేశారు. భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ఇప్పటివరకు 87మంది తమ అభిప్రాయాలను వెల్లడించడం శుభపరిణామం. బిల్లులో తప్పులున్నాయన్న సీఎం కిరణ్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు కొత్తవేమీ కాదన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. పాత వారినే కొనసాగించాలన్న నిబంధన ఏదీ లేదని చెప్పారు. సభకు మెజార్టీ సభ్యులు హాజరవడంతో పాటు మెజార్టీ సభ్యులు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలిపారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న విశ్వాసం తమకు ఉందని మంత్రి జానారెడ్డి తెలిపారు. కేంద్రం, పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియ పూర్తయి వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుంది. అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నా. ముసాయిదా బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి. ఓటింగ్‌కు అవకాశం లేదు. పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులను దిగ్విజయ్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎవరితోనూ చర్చించాల్సిన అవసరం లేదు. సొంత బలంతోనే రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకుంటాం. సమైక్యాంధ్రకు మెజారిటీ ఉందన్న నమ్మకంతోనే ఓటింగ్‌ కోరుతున్నారని ఆరోపించారు. ఆర్టికల్‌ 3 ప్రకారమే బిల్లు అసెంబ్లీకి వచ్చిందని చెప్పారు. సీఎం కిరణ్‌పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను అందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌ పొత్తుపై ఏమీ చర్చించలేదు. ఇంకా సమయం ఉంది అని చెప్పారు.