ముసాయిదా బిల్లు – బిల్లు వేరుకాదు
రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ : కేంద్రమంత్రి జైరాం రమేష్
న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి): ముసాయిదాబిల్లు, బిల్లు వేరుకాదని రెండూ ఒకటేనని కేంద్రమంత్రి జైరాంరమేష్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగానే జరుగుందన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఓ అధికార ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో కలిసి జైరాంరమేష్ పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లుపై రభస జరుగుతుండగా కేంద్రమంత్రి జైరాంరమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఆయన సిఎం కిరణ్‌ను తప్పుపట్టే విధంగా వ్యాఖ్యానించారు. ఆయనకు తెలిసినంతగా తనకు రాజ్యాంగం తెలియదంటూనే , రాష్టాల్రను విభజించే అధికారం కేంద్రానికి ఉందని కేంద్ర మంత్రి మరోమారు స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీకి పూర్తి స్థాయి తెలంగాణ బిల్లును పంపినట్లు తెలిపారు. టీ బిల్లు కేంద్రానికి తిరిగి వచ్చాక జీవోఎం భేటీ నిర్వహించి సవరణలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆర్టికల్ 3, 4 ప్రకారం ఏ రాష్టాన్న్రైనా విభజించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. కేంద్రం అధికారాలను సుప్రీం కూడా సమర్థించిందన్న విషయాన్ని ఆయన సోమవారం ఢిల్లీలో అన్నారు. బిల్లును అసెంబ్లీ తిప్పిపంపితే కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుందన్నారు. తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈనెల 30న మరోసారి సమావేశం అవుతుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణపై బిల్లుపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడినట్లు తెలిపారు. రాజ్యాంగంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పట్టు తనకు లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లును న్యాయశాఖ ఆమోదించాకే రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆ తర్వాతే ఆంధప్రదేశ్ శాసనసభకు పంపటం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు పెడతామని, సభలో ఆమోదం పొందుతుందో లేదో చూద్దామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలతో బిల్లులో సవరణలపై అప్పటికే చర్చించామని జైరాం తెలిపారు. అసెంబ్లీ నుంచి వచ్చే సవరణలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని… బిల్లులో ఎన్ని సవరణలు ఆమోదం పొందుతాయో చెప్పలేమని అన్నారు.