సభలో చర్చ ముగిసింది
అభిప్రాయాలను ఢిల్లీకి పంపుతా
23 రోజులు.. 56 గంటల చర్చ
లిఖితపూర్వకంగా 240 అభిప్రాయాలు
మూజువాణితో సీఎం తిరస్కరణ తీర్మానం
మండలిలోనూ గంతే…
హైదరాబాద్, జనవరి 30 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదాపై రాష్ట్ర శాసనసభ, మండలిలో చర్చ ముగిసింది. సభలో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఢిల్లీకి పంపుతామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉభయ సభల్లో నాయటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోపభూయిష్టంగా ఉన్న ముసాయిదాను తిప్పి పంపాలన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీర్మానం ఆమోదం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మహాత్మునికి నివాళులు అర్పించి, పదినిమిషాలు వాయిదా తర్వాత శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే సీఎం నోటీసును సభాపతి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. ఆందోళన నడుమే సభాపతి సీఎం తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. తెలంగాణకు చెందిన సభ్యులు ఎవరు అడ్డుకోకుండా మార్షల్స్ వలయంగా నిలిచిన సమయంలో బిల్లును తిరస్కరించాలన్న సీఎం తీర్మానానికి మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మార్షల్స్‌కు సీమాంధ్ర సభ్యులు కూడా అడ్డుగా నిలిచారు. దీంతో పోడియం వద్దకు ఎవరకు కూడా రాలేదు. దీంతో ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ సభలో ప్రకటించారు. దాంతో బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించినట్లయింది. బిల్లును తిరస్కరించాలన్న 10 అనధికార తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. వెంటనే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే గందరగోళం మధ్య సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ గంటపాటు వాయిదా వేశారు. రాష్ట్ర విభజనబిల్లుపై చర్చిస్తున్న సమయంలో చిట్టచివరి రోజున రాష్ట్రశాసనసభ వాయిదా పడ్డ తర్వాత సుమారు రెండు గంటల వ్యవధిలో తిరగి ప్రారంభమయ్యింది. అయితే సభ్యులు తీవ్రంగా నిర సనలు వ్యక్తం చేశారు. సీమాంధ్రకు చెందిన 150 మంది ఎమ్మెల్యేలు, 40 మంది మార్షల్స్ ముందు వరుసలో నిలబడి తెలంగాణాకు చెందిన వారెవ్వరూ కూడా ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరిగిందని ఇందులో 87 మంది ప్రత్యక్షంగా ప్రసంగించారన్నారు. మిగతా వారంతా రాత పూర్వకంగా చెప్పారన్నారు. దీంతో చర్చ ముగిసిందన్నారు. 16 డిసెంబర్‌న చర్చ ప్రారంభమైందన్నారు. మొత్తం 9072 మంది సవరణలు ప్రతిపాదించారని వీటన్నింటిని రాష్ట్రపతికి పంపించాలని బీఏసీ తీర్మాన ప్రకారం పంపిస్తున్నామన్నారు. సభలో 23 రోజుల్లో 56 గంటల పాటు చర్చ సాగిందని వివరించారు. లిఖితపూర్వకంగా 240 అభిప్రాయాలు చెప్పారన్నారు. ఈ బిల్లు రాష్ట్రపతికి పంపిస్తామని తెలిపారు. బిల్లుపై చర్చ ముగిసిందన్నారు. అయితే ఈక్రమంలోనే సీఎం ప్రతిపాదిం చిన బిల్లును తిరస్కరించే తీర్మానంపై సభ్యులు అభిప్రాయాలు చెప్పాలని సభ్యుల తీవ్ర నిరసనల మద్యే నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మూజువాణి ఓటుతో సిఎం ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందిందని ప్రకటించారు. మూజువాణి ఓటుతో ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కనిమిషంలోనే చర్చ ముగిసిందని చెప్పడంతోపాటు సభ నిరవదిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ వెళ్లిపోయారు. ఈక్రమంలో ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. అయినా కూడా వినిపించుకోని స్పీకర్ సభనుంచి వెళ్లిపోయారు. అయితే ఈక్రమంలో స్పీకర్ పోడియం చుట్టూ సీమాంధ్రకు చెందిన సభ్యులు అంతా మార్షల్స్‌తో కలిసి అడ్డుగా నిలుచున్నారు. తెలంగాణా వారు వచ్చి నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తెలంగాణా వారిని వెనక్కి నెట్టివేశారు. ఎట్టకేలకు చర్చ ముగిసిందని ప్రకటించడంతో ఇంతకాలం ఉన్న ఉత్కంఠకు తెర ముగిసింది. అయితే తాము విజయం సాధించామని వారు ఆనందిస్తుంటే, తెలంగాణా వారు మాత్రం దీనివల్ల ఒరిగేదేమి లేదంటున్నారు. కేవలం అభిప్రాయాలు చెప్పాలని మాత్రమే రాష్ట్రపతి అడిగారని తెలంగాణ సభ్యులు అన్నారు. ఏమనుకున్నా తెలంగాణా వారికి కావాల్సింది బిల్లును త్వరగా డిల్లీకి పంపించడం ఒక్కటేనంటున్నారు. తమ లక్ష్యం నెరవేరిందని పార్టీలకతీతంగా తెలంగాణా వాదులు పేర్కొంటున్నారు. సీమాంద్ర నేతలు పైశాచికానందం పొందుతున్నారని అన్నారు. బిల్లుపై చర్చ ముగిసిందని చెప్పిన తర్వాతే స్పీకర్ సిఎం తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారంటున్నారు. దీనితో ఏం నష్టం జరుగలేదంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మహాత్మునికి నివాళులు అర్పించిన తర్వాత పదినిమిషాలు వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే సీఎం నోటీసును సభాపతి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. ఆందోళన నడుమే సభాపతి సీఎం తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ సభలో ప్రకటించారు. బిల్లుపై చర్చ సందర్భంగా 9,072 సవరణ ప్రతిపాదనలు వచ్చాయని, 86 మంది సభ్యులు మాట్లాడారని స్పీకర్ తెలిపారు. బిల్లును తిరస్కరించాలన్న 10 అనధికార తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. వెంటనే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. అయితే ఎవరికి వారు బిల్లుపై భాష్యాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి పంపిన తీర్మానాన్ని అసెంబ్లీ మూజువాణీ ఓటుతో తిరస్కరించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు కూడా ఆయన ప్రకటించారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు చీలిపోయారు. ఒక్క ఎమ్మెల్యే కూడా కుర్చీలలో కూర్చోలేదు. అంతా లేచి స్పీకర్ పోడియం వద్ద చేరుకున్నారు. మొత్తానికి బిల్లు ఏదో రకంగా రాష్ట్రపతికి చేరడం ఖాయమని తెలంగాణవాదులు నమ్ముతున్నారు.
మండలిలోనూ మూజువాణి ఓటుతో ఆమోదం
శాసన మండలిలో కూడా తెలంగాణ బిల్లు వీగిపోయింది. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ, శాసన మండలి నాయకుడిగా మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసుపై శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఓటింగ్ నిర్వహించారు. నోటీసును మండలి ఆమోదించింది. దీంతో విభజన ముసాయిదా బిల్లును మండలి తిరస్కరించినట్లయింది. విభజన ముసాయిదా బిల్లును వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు. వాయిదా అనంతరం మండలి సమావేశాలు తిరిగి ప్రారంభమైన వెంటనే విభజన బిల్లును వ్యతిరేకిస్తూ మండలి సభానాయకుడు రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానాన్ని చైర్మన్ చదివి వినిపించి మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
తీర్మానానికి ఆర్టికల్ 3 ప్రకారం చట్టబద్ధత లేదు
హైదరాబాద్ : శాసనసభ, మండలిలో సీఎం కిరణ్, దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించినా ఆ తీర్మానానికి చట్టబద్ధత లేదనే విషయాన్ని సీమాంధ్రులు విస్మరిస్తున్నారు. రాష్ట్రం చేసిన ఈ తీర్మానానికి కేంద్రం విలువ ఇస్తుందా? రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయాన్ని గౌరవిస్తారా? అన్న అంశాలపై రసవత్తర చర్చ కొనసాగుతోంది. అయితే, రాష్ట్ర విభజన అంశంలో ఆర్టికల్-3 ప్రకారం కేంద్రానికే సర్వాధికారాలు ఉంటాయని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. గతంలో రాష్ట్ర శాసనసభలో విభజన అంశంపై చేసిన ఏకగ్రీవ తీర్మానాలను సైతం కేంద్రం లెక్కచేయలేదు. గతంలో ముంబై రాష్ట్రం నుంచి గుజరాత్ విడిపోయిన సందర్భంలో బిల్లులో సైతం ముంబైని కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ పొందుపరిచారు. ముంబై రాష్ట్ర శాసనసభ దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంలో ముంబైని మహారాష్ట్రకు రాజధానిగా నిర్ణయిస్తూ తీర్మానించారు. దీనిపై బాబులాల్ పరేట్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఆర్టికల్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆ కేసు ఇప్పటికీ పరిష్కరించబడలేదు. అయినా కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు మహారాష్ట్ర రాజధానిగా ముంబై కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర శాసనసభలో గురువారం తెలంగాణ బిల్లును తిరస్కరిస్తున్నట్లు చేసిన తీర్మానానికి కూడా రాజ్యాంగబద్దత లేదనేది సుస్పష్టం.
సీఎం తీర్మానం ఢిల్లీకి వెళ్లదు
అభిప్రాయాలు మాత్రమే వెళ్తాయి
క్లారిటీ ఇచ్చిన డెప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క
హైదరాబాద్ : రాజ్యాంగం ప్రకారం గురువారం శాసనసభలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి విలువే లేదని డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై సభలో సభ్యులు చెప్పిన అభిప్రాయాలు, లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయాలు మాత్రమే రాష్ట్రపతికి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. రూల్-77 ప్రకారం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రానికి వచ్చిన బిల్లుపై ఓటింగ్‌కు ఆస్కారమే లేదని భట్టి తెలిపారు. తెలంగాణ బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పమని రాష్ట్రపతి పంపారని అన్నారు. ఆర్టికల్-3 ప్రకారమే బిల్లుపై చర్చ ముగిసిందని ఆయన తేల్చిచెప్పారు. చర్చల వివరాలను త్వరలో రాష్ట్రపతికి పంపిస్తామని వెల్లడించారు. రూల్-77 శాసనసభ వ్యవహారాలకు సంబంధించినది మాత్రమేనని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై ఇక్కడ జరిగినంత చర్చ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలలో కూడా జరగలేదన్నారు.