తెలంగాణ జెట్‌ స్పీడ్‌


ప్రణాళిక తయారు చేస్తున్న హోం శాఖ
కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ గ్రీన్‌సిగ్నల్‌
15 నుంచి 20 మధ్యలో పార్లమెంట్‌లో టీ బిల్లు
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లుపై కేంద్రం దూకుడు పెంచింది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో శుక్రవారం భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ తెలంగాణ బిల్లుపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆదివారం నాటికి రాష్ట్రపతికి బిల్లు చేరుతుందని తెలియడంతో బిల్లు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు కేబినెట్‌ సోమవారం సమావేశం కానుంది. కేబినేట్‌లో చర్చించి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ అసెంబ్లీలో చర్చ సాగుతుండగానే కేంద్రంలో జరగాల్సిన తంతు జరుగుతూనే ఉంది. అక్కడ వరవేగంగా పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు వస్తున్నట్లు ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెసు కోర్‌ కమిటీ భేటీ అయింది. భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లు, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బిల్లు పై న్యాయ సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సోమవారం బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశముంది. వచ్చే పార్లమెంటులోనే బిల్లు పెట్టాలని కోర్‌ కమిటీ సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో కేంద్ర ¬ంశాఖకు అసెంబ్లీ నివేదిక చేరనుంది. కోర్‌కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తదితరులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆమోదించిన తీర్మానం రాష్ట్ర విభజనకు అవరోధం కాదని అన్నారు. ఫిబ్రవరి 15-20 తేదీల మధ్య జరిగే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పున్వ్యస్థీకరణ బిల్లు ఆమోదం పొందుతుందని షిండే చెప్పారు. బిల్లు తిరస్కృతి తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమస్య కాబోదన్నారు. శాసనసభ తీర్మానంపై అటార్నీ జనరల్‌ నుంచి తాను ఎటువంటి న్యాయ సలహా కోరలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఆర్టికల్‌ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో శాసనసభ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణ బిల్లును ఏ తేదీన ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారో తెలుసుకునేందుకు పార్లమెంటు వర్గాలను సంప్రదించనున్నది. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పున్వ్యస్థీకరణను ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) ఫిబ్రవరి నాల్గోతేదీన సమావేశమై తదుపరి ప్రణాళిక ఖరారు చేయనున్నది. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదని సమాచారం. మరోవైపు పూర్తిస్థాయి బిల్లును పంపనందుకు నిరసనగా తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు, ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశాయి.