ఖేల్ ఖతం.. దుకాణం బంద్
కిరణ్ డ్రామాలు ఇంకెన్నాళ్లు?
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఏదేదో చేస్తానంటూ బీరాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆటలు ఎప్పుడో బందయ్యాయని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అయినా తెలంగాణను అడ్డుకోబోతానంటూ కిరణ్ డ్రామాలాడుతున్నాడని, అవి ఇంకా సాగబోవని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజన ఆగదని తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారని, కిరణ్ నాటకాలు ఇంకెన్ని రోజులని ఆయన ప్రశ్నించారు. సీఎం కిరణ్ ఒక ప్రాంతానికే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కిరణ్ నాటకాలను తెలంగాణ మంత్రులు ఎదుర్కోవాలన్నారు. లేకపోతే టీ మంత్రులు చరిత్ర హీనులుగా మిగులుతారని ఆయన హెచ్చరించారు. టీ ఎమ్మెల్యేలు రాజ్యసభకు తెలంగాణ అభ్యర్థులనే గెలిపించాలని కోదండరామ్ కోరారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటనను రెండు భాగాలు చూడాలన్నారు. టీ బిల్లుపై అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపిస్తున్నట్లు- స్పీకర్ చెప్పారని, ఆ తర్వాతే సీఎం తీర్మానాన్ని ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. నిబంధలను విరుద్ధంగా సీఎం నోటీస్ ఇచ్చారని కోదండరామ్ మండిపడ్డారు.