తెలంగాణకు మద్దతు కూడగడుతున్న కేసీఆర్‌

లాలు, పాశ్వాన్‌, శరద్‌యాదవ్‌తో భేటీ
బేఫికర్‌గా ఉండుండ్రి.. మద్దతు పక్కా అన్న నేతలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ముందుకు రానున్న వేల మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితమే ఢిల్లీకి చేరిన కేసీఆర్‌ ఆదివారం జాతీయ నేతలను కలవడంలో నిమగ్నమయ్యారు. మంగళవారం ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వగా, ఆలోగా తెలంగాణకు మద్దతిస్తున్న పార్టీల నేతలను మరోసారి కలవడంలో కేసీఆర్‌ నిమగ్నమయ్యారు. తెలంగాణకు పూర్తి మద్దతు.. ఉభయ సభల్లో టి.బిల్లుకు మద్దతు తెలియజేస్తామని లోక్‌ జనశక్తి నేత రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. సోషలిస్టు నాయకుల మంతా 1969లోనే తెలంగాణకు మద్దతు తెలిపామని పాశ్వాన్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము ఎప్పటికీ మద్దతిస్తామని పాశ్వాన్‌ చెప్పారు. కేసీఆర్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముంది ఆర్జేడీ అధినేత, ఎంపీ లాలూప్రసాద్‌యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కలుసుకున్నారు. భేటీ అనంతరం లాలూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. తక్షణమే రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్ల మెంటులో ప్రవేశపెట్టాలని సోనియాను, రాహుల్‌ను కోరుతున్నట్టు చెప్పారు. అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు సహకరిస్తామని లాలూ ప్రసాద్‌ హామీ ఇచ్చారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ అనుకూలమని నాటి ప్రణబ్‌ కమిటీకి లేఖ కూడా రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సాయంత్రం జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌తోనూ కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. శాంతియుతంగా విభజన ప్రక్రియ పూర్తి కావాలని తాము కోరుతున్నామని తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలమని శరద్‌యాదవ్‌ అన్నారు. పార్లమెంట్‌లో యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టే తేదీలతో సహా అంతా తనకు తెలుసని, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్తున్న తాను తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడతామంటూ శపథం చేసి మరీ వెళ్లారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ స్వరం మారుతుండడంతో కేసీఆర్‌ను ఆందోళన ఎక్కువైనట్లు సమాచారం. ఢిల్లీలో కేసీఆర్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా, బీజేపీ అగ్రనేతలను కలవనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. ఈ మేరకు అపాయింట్‌ దొరికింది. సోనియా అపాయింట్‌ కోసం కూడా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన అద్వానీ, సుష్మస్వరాజ్‌ తదితరులను కలవాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి అపాయింట్‌కు ఇప్పటికే సమయం తీసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. సమావేశాలు ప్రారంభం కాక ముందే వీరిని కలసి బిల్లు విషయంపై చర్చించాలని నిర్ణయించారు. ఆదివారం కొందరు జాతీయ నేతలను కేసీఆర్‌ కలిశారు. ఇప్పటికే జీవోఎం సభ్యుడు సుశీల్‌కుమార్‌ షిండే, జైరాం రమేష్‌, కమలానాథ్‌ వంటి వారితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ వ్యూహంపై వారితో చర్చించినట్లు సమాచారం బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే వ్యూహంపై కేసీఆర్‌ వారితో చర్చించినట్లు తెలిసింది. బీజేపీ ఒకవేళ మద్దతు ఇవ్వకున్నా పార్లమెంట్‌లో ఎలా బిల్లును ఆమోదింపజేసుకోవాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో అవసరమైతే బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఇందుకనుగుణంగా పార్టీ నేతలు పలువురిని యూపీఏ భాగస్వామ్య పక్షాల దగ్గరికి పంపినట్లు తెలిసింది. ఏదేమైనా కేసీఆర్‌ మాత్రం బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీలో నానా పాట్లు పడుతున్నారు.