గో హెడ్… ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
మాకు టాప్ ప్రయారిటీ
మీ ద్వంద్వ విధానంపై స్పష్టత ఇవ్వండి
సుష్మాను నిలదీసిన కమల్‌నాథ్
తెలంగాణపై వెనక్కు వెళ్లం : చిదంబరం
కాంగ్రెస్ స్వయం కృతాపరాథం
మీ సభ్యులను నియంత్రించండి : సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమలనాథ్ తెలిపారు. తమకు తెలంగాణ బిల్లే టాప్ ప్రయారిటీ అని తెలిపారు. బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులు, ఇతర వ్యవహారాల గురించి చర్చ జరిగింది. తెలంగాణపై బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ విధానంపై స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్‌ను కమల్‌నాథ్ నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవద్దని పార్లమెంట్ వ్యవహార మంత్రి కమల్‌నాథ్ విపక్షాలను విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 15వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలని, పెండింగ్ బిల్లులను పాస్‌చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విషయంలో కొన్ని పార్టీలు డబుల్‌గేమ్ ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామంటూనే మెలిక పెడుతున్నాయని కమల్‌నాథ్ వివరించారు. లోక్‌సభ, రాజ్యసభలో చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మొత్తం 39 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఇందులో తెలంగాణ బిల్లుకు రెండో ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి నిరోధక బిల్లుకు విపక్షాలు సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఆయన చెప్పారు. పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు అవలంబించడం వల్ల సభాసమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి చిదంబరం కూడా పాల్గొన్నారు. రాజ్యసభ ఆమోదం పొంది లోక్‌సభలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఆమోదింపజేయాలని కమల్‌నాథ్ చెప్పారు. లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదింపచేయాలన్నారు. అవినీతికి సంబంధించి ఆరు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. విపక్షాలు అవినీతికి వ్యతిరేకమని విూడియాలో చెబుతుంటారని, అయితే పార్లమెంటులో బిల్లుకు మద్దతివ్వరని కమలనాథ్ మండిపడ్డారు. అలాగే తెలంగాణకు కట్టుబడి ఉన్నామని విూడియాతో చెబుతారని అయితే పార్లమెంటులో మాత్రం స్పష్టత ఉండదన్నారు. కొన్ని పార్టీలు ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నాయని, పార్టీల ద్వంద్వ విధానాల వల్ల సభా సమయం వృథా అవుతోందని మంత్రి అన్నారు. తెలంగాణకు సరేనంటూ కొన్ని పార్టీలు ఏవేవో సాకులు చెబుతున్నాయి. సభను అడ్డుకోకుండా చూడాలంటారు.. సస్పెండ్ చేస్తే తప్పంటారు. ఇదెక్కడి న్యామని ప్రశ్నించారు. అయితే… తెలంగాణ బిల్లును ఇంత పీక్ టైమ్‌లో ప్రవేశ పెట్టడం అవసరమా? అని తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు మరి కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ను నిలదీసినట్లు సమాచారం. మరోవైపు సభను సజావుగా నిర్వహించినట్లయితేనే తెలంగాణ బిల్లును పార్లమెంటుకు తీసుకు రండనీ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సూచించినట్లు తెలుస్తోంది. స్వంత పార్టీ సభ్యులే సభను స్థంభింపజేసే అవకాశమున్నందున ముందు కాంగ్రెస్ తమ పార్టీ సభ్యులను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ బిల్లు గురించి ఆలోచించాలని బీజేపీ అభిప్రాయపడింది.
తెలంగాణ బిల్లుపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ తన వాగ్దానానికి కట్టుబడి ఉందన్నారు.. పార్లమెంట్ సమావేవాలపై ఆయన విూడియాతో మాట్లాడారు. టీ బిల్లు విషయంలో సుధీర్ఘంగా చర్చించామని, శ్రీకష్ణ కమిటీని కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై ఈ లోక్‌సభలో కాకున్నా వచ్చే లోక్‌సభలోనైనా చర్చించక తప్పదని అన్నారు. తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు, సీమాంధ్రకు చెందిన 25 మంది ఎంపీలు బిల్లు విషయంలో పోటీ పడితే కొంత ఇబ్బంకరమేనని తెలిపారు. పార్లమెంటులో ఓటాన్ అకౌంట్‌పై చర్చ జరగాలని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఓటాన్ అకౌంట్‌పై ప్రసంగం సుదీర్ఘంగా ఉండదని, కొన్ని ప్రతిపాదనలు మాత్రమే ఉంటాయని చెప్పారు. అందరూ అనుకున్నట్లుగా తెలంగాణపై రాత్రికిరాత్రే నిర్ణయించలేదని, తెలంగాణపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపామన్నారు. శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటుచేసి పలు అంశాలపై అధ్యయనం చేశామన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా పార్లమెంటు ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ బిల్లును గెలిపించడమా.. ఓడించడమా అన్నది పార్లమెంటు ముందుందన్నారు. బిల్లుపై అనుకూలత, వ్యతిరేకత అనేది ఈ లోక్‌సభ కాకపోతే వచ్చే లోక్‌సభలోనూ ఉంటుందన్నారు. తెలంగాణ నుంచి 17 మంది, సీమాంధ్ర నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలంతా వారి ప్రాంతాలకు అనుకూలంగా వ్యవహరిస్తే వచ్చే లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు. ప్రస్తుత లోక్‌సభలో కానీ వచ్చే లోక్‌సభలో కానీ నిర్ణయం తీసుకోవాల్సిందేనిని స్పస్టం చేశారు. ఈ నెల ఐదు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమైన అన్ని బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టనున్నట్లు కమల్‌నాథ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలతో ఈ విషయాలను చర్చించినట్లు ఆయన వివరించారు. సభ్యులు ఎవరు అడ్డుకున్న స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరినట్లు కమల్‌నాథ్ చెప్పారు. పార్లమెంట్‌లో అనుసరించిల్సిన వ్యూహంతో పాటు వివిధ బిల్లులపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కమల్ నాథ్ నేతృత్వంలో సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చ జరిపారు. అఖిపక్షానికి హాజరైన వారిలో కేంద్రమంత్రి చిదంబరం, బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఐ నుంచి డి. రాజా ఉన్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన సభ్యులందరూ సహకరించాలని ఈ సమావేశంలో కమల్ నాథ్ కోరారు. ఇప్పటికే పెండింగులో ఉన్న బిల్లులను ఆమోదించడానికి, ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను కూడా ఆమోదించేందుకు ప్రతిపక్షాల సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.
సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పెడితే అనుకూల, వ్యతిరేక సభ్యుల వల్ల సభ సజావుగా సాగే అవకాశం లేదన్నారు. తెలంగాణకు అనుకూలంగా, వ్యతిరేకంగా కొందరు వెల్‌లోకి వచ్చిన ఘటనలు చూశామన్నారు. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని సుష్మ ఆరోపించారు. కాంగ్రెస్ మాటను ఆ పార్టీ నేతలే పట్టించుకునే పరిస్థితి లేదని, తమ పార్టీకి చెందిన సీఎం, మంత్రులపై కాంగ్రెస్ పట్టుకోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి బిల్లును తిరస్కరిస్తే, అదే బిల్లును పార్లమెంటు ఆమోదం కోసం తీసుకొచ్చారని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. సభను క్రమపద్ధతిలో నిర్వహిస్తే బిల్లుల ఆమోద పక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని, సభను కాంగ్రెస్ సక్రమంగా కొనసాగిస్తుందా, లేదా అనేదానిపై తమకు అనుమానం ఉందని సుష్మ పేర్కొన్నారు. గతంలో సభలో రెండుసార్లు కాంగ్రెస్ హంగామా చేయడం చూశామన్నారు. ఒక సభలో ఆమోదం పొంది మరో సభలో ఆమోదం కోసం ఉన్న బిల్లును భాజపా స్వాగతిస్తోందని సుష్మ పేర్కొన్నారు. మరోవైపు వచ్చే పార్లమెంటు సమావేశాల సమయాన్ని కుదించాలని తృణమూల్ కాంగ్రెస్ కేంద్రాన్ని కోరింది. పార్లమెంటులో మొదట ఓటాన్ అకౌంట్ బ్జడెట్ ప్రవేశపెట్టాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు.