షేమ్‌ ఆంధ్రప్రదేశ్‌


ఆడబిడ్డలకు అవమానం
మహిళా మంత్రుల్ని ఈడ్చిపడేశారు
బస్సులోంచి జై సమైక్యాంధ్ర అన్న సీఎం
ఇంత అవమానం ఎన్నడూ జరగలేదు
ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఎవరూ చేయి చేసుకోలేదు
కంటతడి పెట్టిన గీతారెడ్డి
తీవ్రంగా ఖండించిన డీకే అరుణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
తెలుగుజాతి.. తెలుగుతల్లి.. తెలుగువారి ఐక్యత పేరుతో బలవంతంగా రాష్ట్రం కలిసుండాలని కోరే సీమాంధ్రులు ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించారు. ఆడబిడ్డలైన మంత్రులను అత్యంత అవమానకంగా ఈడ్చిపడేశారు. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నుంచి జంతర్‌మంతర్‌ వద్దకు సీఎం కిరణ్‌ ఏసీ బస్సులో బయల్దేరి వెళ్తుండగా తెలంగాణ మంత్రులు, నేతలు అడ్డుకోవడంతో వారిని భద్రతా సిబ్బంది ఈడ్చి పడేశారు. దీనిపై మంత్రులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అంతటితో ఆగకుండా బస్సు ఫుట్‌బోర్డు వద్దకు వచ్చి జై సమైక్యాంధ్ర నినాదాలు చేసి తెలంగాణవాదులను రెచ్చగొట్టాడు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు సిగ్గుచేటని తెలంగాణ ప్రాంత మహిళ మంత్రులు గీతారెడ్డి, డీకే ఆరుణ, సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. మహిళలని కూడా చూడకుండా తమని నెట్టేస్తారా అని వారు ప్రశ్నించారు. గీతారెడ్డి ఈ ఘటనపై కన్నీటి పర్యంతమయ్యారు. ముప్పై ఏళ్ల తన రాజకీయ జీవితంలో తనపై ఎవరూ చేయి చేసుకోలేదని ఆమె తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రేనని స్పష్టమయ్యిందని వారు విమర్శించారు. తెలంగాణ ప్రజలను అణగదొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేయనున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. మహిళా మంత్రులని కూడా అని కూడా చూడకుండా తమను పోలీసులు ఈడ్చి వేస్తుంటే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని వారు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దీక్ష ప్రాంగణానికి వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఏపీ భవన్‌ వద్ద ఈరోజు ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ భవన్‌కు చేరుకున్న సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు యత్నించడంతో ఇరుప్రాంత నేతల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు నేతలు కిందపడ్డారు. సీఎంకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు నినాదాలు చేయగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర నేతలు నినాదాలు చేశారు. పోటా పోటీ నినాదాలతో ఏపీ భవన్‌ మారుమ్రోగింది. పోలీసులు ఇరువర్గాలను అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీ భవన్‌ నుంచి రాజ్‌ఘాట్‌కు బస్సులో బయల్దేరారు. సీఎం వెళ్తున్న బస్సును ఏపీ భవన్‌ వద్ద తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ ఆలీ, పలువురు నేతలు సీఎం వెళ్తున్న బస్సు ఎదుట బైఠాయించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు, తెలంగాణ వాదులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి సీఎం వెళ్తున్న బస్సు బయలుదేరింది. దీనిపై డికె అరుణ, గీతారెడ్డి, సునీత స్పందించారు. ముఖ్యమంత్రిది అహంకారపూరిత వైఖరి అని, నియంతలా వ్యవహరి స్తున్నారన్నారు. సిఎం తీర్మానంలో తాము భాగస్వామ్యులం కాదల్చుకోలేదన్నారు. కిరణ్‌ వెళ్తుంటే మహిళా మంత్రుల్నీ ఈడ్చి పడేశారు, మహిళా మంత్రులను కూడా ఈడ్చి వేస్తుంటే ఆనందం పొందుతున్నారా అని ప్రశ్నించారు. ఈ మౌన దీక్ష ఎందుకు చేస్తున్నారో కిరణ్‌ చెప్పడం లేదన్నారు. కిరణ్‌ దీక్ష చేస్తే తెలంగాణ ఆగిపోతుందని తాము భావించడం లేదని కానీ అది సరికాదని చెబుతున్నామన్నారు. కిరణ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా మంత్రులైన తాము అడ్డుకుంటుంటే కిరణ్‌ బస్సు దిగి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. సీమాంధ్ర ప్రజల పైన ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకు వచ్చిందా అన్నారు. ఆయన సీమాంధ్ర సిఎంగా వ్యహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్‌ ఇక డ్రామాలు బందు చేయాలన్నారు. సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. అసలు సీఎం దీక్ష చేయడం ఎందుకని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి ప్రశ్నించారు. సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రాంత సిఎంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని గండ్ర వెంకటరమణ రెడ్డి, షబ్బీర్‌అలీ అన్నారు. రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము అవిశ్వాసం నుండి గట్టెక్కించామన్నారు. మహిళా మంత్రులు అని కూడా చూడకుండా లాగి పడేయడమేమిటన్నారు.
తెలంగాణ మహిళా మంత్రులకు ఏపీి భవన్‌లో జరిగిన అవమానానికి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి జానారెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ఆయన మండిపడ్డారు. ఇంతకాలం సంయమనంతో ఓపికతో ఉంటూ వస్తుంటే దీనిని అలుసుగా తీసుకుంటారా అని ఆగ్రహం వ్‌క్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి పాస్‌ చేయించాలని కోరారు. బిల్లును పాస్‌ చేయించే బాధ్యతను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీసుకున్నారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఇవాళ వాళ్లు ప్రధానిని ఆయన నివాసంలో కలిసిన అనంతరం విలేకరులతో జానారెడ్డి మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి బిల్లును పాస్‌ చేయించే బాధ్యతను యూపీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. ఈమేరకు ఇవాళ సీఎం దీక్షకు వెళ్తున్నపుడు ఏపీ భవన్‌ వద్ద జరిగిన ఘటనను ప్రధానికి మహిళా మంత్రులు వివరించారు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదన్నారు. కనీసం మహిళా మంత్రులని కూడా చూడకుండా వారిని అవమానించిన తీరు దారుణంగా ఉందని అన్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకించొద్దని చెప్పేందుకు వెళ్తే మహిళలమని కూడా చూడకుండా సీఎం భద్రతా సిబ్బంది తమను చితకబాదారని తెలిపారు. మంత్రులపై దాడులను ప్రధాని తీవ్రంగా ఖండించారని నేతలు చెప్పారు. డెప్యూటీ సీఎం రాజనర్సింహతో పాటు టి.మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. తక్షణమే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని ప్రధానికి వీరు విన్నవించినట్లు తెలుస్తోంది. ఆలస్యం చేస్తే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం చెల్లదని మంత్రి గీతారెడ్డి అన్నారు. ఇవాళ ఆమె ప్రధానిని కలిసిన అనంతరం ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. బిల్లుకు వ్యతిరేకంగా తయారు చేసిన తీర్మానంపై తెలంగాణ ప్రాంత మంత్రుల అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రభుత్వం బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పడం చెల్లదని అన్నారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా ఎలా ఆమోదం పొందినట్టు అన్నారు. సీఎంకు స్పీకర్‌ నాదెండ్ల కూడా వంతపాడారని గీతారెడ్డి విమర్శించారు. సీఎం ప్రవేశ పెట్టిన బిల్లును ఆయన ఆమోదం తెలపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. స్పీకర్‌ కూడా పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇక్కడ ఢిల్లీలో సీఎం దీక్ష చేస్తానంటే తాము కూడా దీక్షకు సిద్దమయ్యామని, కానీ అధిష్ఠానం ఆదేశం మేరకు తాము దీక్ష చేసే ఆలోచనను విరమించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో దీక్ష సరికాదని అధిష్ఠానం పెద్దలు కోరారని తెలిపారు. తాజా పరిస్థితుల్లో ప్రధానితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కిరణ్‌ చేపడుతున్న దీక్షను అడ్డుకునేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎపి భవన్‌ వద్దకు చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనను డెప్యూటీ సీఎం దామోదర ఖండించారు. సీఎం కిరణ్‌ ఆదేశాలతో ఇది జరిగిందని ఆరోపణలు చేశారు. కుట్రలకు, కుతంత్రాలకు మారుపేరు సీఎం కిరణ్‌ అని, ఒక నియంత అంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా కృషిచేస్తామని ప్రధాని చెప్పారన్నారు.