బిల్లు రెడీ
స్వల్ప సవరణలు
వెంకయ్యనాయుడుతో జైరాం భేటీ
నేడు కేబినెట్ ముందుకు..
సోమవారం పార్లమెంట్‌లో టీ బిల్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సిద్ధం చేసింది. స్వల్ప సవరణలతో తుది ముసాయిదాను రూపొందించింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేందుకు బీజేపీ మద్దతును తప్పనిసరిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈమేరకు పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ గురువారం సాయంత్రం బీజేపీ సీనియన్ నాయకుడు వెంకయ్యనాయుడుతో భేటీ అయి సవరణలపై చర్చించారు. అనంతరం తుది నివేదిక సిద్ధం చేసి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆమోదముద్ర వేశారు. కొత్త రాజధానికి నిధుల కేటాయింపుతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపుపై నివేదికలో స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్ నగరంలోని విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల కాలపరిమితి పొడిగింపు, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జనాభా ప్రాతిపదికగా ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. వీటితో పాటు వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను శుక్రవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో పెట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసమే శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తుది ముసాయిదాను కేబినెట్ ఆమోదించాక సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశ పెడతామని షిండే ప్రకటించారు. బిల్లుకు సహకరించాలని ప్రధాని స్వయంగా కోరారు. జీవోఎం గురువారం సమావేశమై టీ బిల్లుకు తుది మెరుగులు దిద్దింది. కొన్ని సవరణలు కూడా జీవోఎం సూచించినట్లు తెలుస్తోంది. జీవోఎం సభ్యులు జైరాం రమేష్, షిండేలు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ప్రత్యేకంగా శుక్రవారం కేంద్ర కేబినెట్ భేటీ అయి తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేయనుంది. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని కూడా జీవోఎం బిల్లులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. వార్‌రూమ్‌లో సీమాంధ్రకు చెందిన కేంధ్ర మంత్రులు చేసిన డిమాండ్లను బిల్లులో చేర్చడం సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండును సీమాంధ్ర నేతలు తాజాగా మరోసారి తెరవిూదికి తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ¬ంమంత్రి షిండే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీతో భేటీ అయి బిల్లుకు సంబంధించిన వివరాలను చర్చించారు.పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన 400 మంది సభ్యుల మద్దతు తెలంగాణ బిల్లుకు ఉందని తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలిసి బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు అహర్నిషలూ కషి చేస్తున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి బిల్లు పాస్ కావడానికి సహకరించాలని కోరారు. తెలంగాణపై గతంలో బీజేపీ ఇచ్చిన హావిూలను రాజ్‌నాథ్ సింగ్‌కు గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా బిల్లును పాస్ చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటోంది. సభలో సొంత పార్టీ సభ్యుల నిరసనలు ఎదురయ్యే అవకాశమున్నందున వారిని దారికి తెచ్చేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో వార్‌రూమ్‌లో చర్చలు జరిపింది. బిల్లు పాస్ అవడానికి సహకరించి పార్టీ మాటను నిలబెట్టాలని ఆదేశించింది. దీనికి ముందు సిఎం మార్పుతో గట్టి హెచ్చరిక చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లుపై సంప్రదింపులు జరపడం అనేది తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, జిఓఎం సభ్యుడు వీరప్ప మొయిలీ చెప్పారు. ఓ నిర్ణయం తీసుకునే ముందు పలుమార్లు చర్చించడంలో తప్పు లేదన్నారు. జిఓఎం సంప్రదింపులు ఎందుకు కొనసాగుతున్నాయన్న దానిపై ప్రశ్నలు అనవసరం అని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని మొయిలీ తెలిపారు. అవన్నీ పరిగణించేముందు ఒకటికి రెండుసార్లు భేటీ అయి చర్చించడంలో తప్పేవిూ లేదన్నారు. ఇదిలా ఉండగా, ఆంధప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జిఓఎం సభ్యులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం అయ్యారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. విభజన విషయంలో ఆంధ్ర, తెలంగాణ మనోభావాలపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపామన్నారు. తెలంగాణ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ వస్తుందా? రాదా? అనే ప్రసక్తి అవసరం లేదని తెలిపారు. సంకీర్ణ రాజకీయాలను అవకాశంగా తీసుకొని పరిస్థితులను వాడుకోవాలని చూడకూడదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రముఖమైనదన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా..? అని మొయిలీ ప్రశ్నించారు.
రాజకీయాలకు అతీతంగా టి.బిల్లులను ఆమోదించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఎంపీలందరికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఓ నిర్ణయం జరిగాక ఇప్పుడు అడ్డుకోవడం తగదన్నారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే పార్లమెంట్ సమావేవాల్లో అయినా దీనికి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన విూడియాతో మాట్లాడారు. సభలోని బిల్లులు కాంగ్రెస్ పార్టీకో, ప్రభుత్వానికో సంబంధించినవి కావని దేశహితం కోసం పెట్టినవని చెప్పారు. తెలంగాణ అంశం ఇరు ప్రాంతాల్లో తీవ్ర భావోద్వేగాలతో ముడిపడి ఉందని ఇప్పటికైనా దీనికి స్వస్తి పలకాలని కోరారు. ఇదిలావుంటే తమ డిమాండ్లను పరిశీలిస్తేనే విభజన బిల్లుకు మద్దతు తెలుపుతామని సీమాంధ్ర కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పట్టించుకోకుండా.. ముందుకు వెళ్తే టి.బిల్లుకు మోక్షం లభించదని చెప్పారు. రెండు నెలల క్రితమే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని స్పష్టం చేశారు. అయితే అప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జీవోఎంకు గట్టిగా చెప్పామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని ఈ సందర్భంగా జేడీ శీలం స్పష్టం చేశారు.