తెలంగాణకు కేబినెట్ పచ్చజెండా
కలసాకారం
వడివడిగా అడుగులు
హైదరాబాద్ యూటీకి సోనియా నో
భద్రాచలం ముంపు గ్రామాలు ఆంధ్రాకు
12న పార్లమెంటుకు బిల్లు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి7: విభజన అంశంలో కేంద్రం మరో ముందగుడు వేసింది. సోమవారం పార్లమెంటుకు బిల్లు తీసుకుని వస్తామన్న లక్ష్యం మేరకు అడుగు వేసింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో సుదీర్థంగా కేంద్ర మంత్రివర్గం రెండుగంటలపాటు సమావేశమై బిల్లుపై చర్చించింది. బిల్లును సీమాంధ్ర కేంద్రమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పోలవరం ముంపు ప్రాంతాలన్నీ సీమాంధ్రలో కలపాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించే అంశంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే యూటీ చేయాలన్న డిమాండ్‌ను కూడా పక్కన పెట్టింది. బిల్లుపై చర్చించేందుకు బిజెపి నేత వెంకయ్యనాయుడితో జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ మరోమారు భేటీ కానున్నారు. మొత్తంగా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెండూ వేగంగా అడుగులు వేస్తున్నాయని తెలిసింది. కేబినేట్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడిందని భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర విభజన అంశం దాదాపుగా క్లైమాక్స్ కు చేరినట్టయ్యింది. ఈ సమావేశానికి రాష్టాన్రికి చెందిన కేంద్ర మంత్రులు కేబినెట్ సమావేశానికి రాష్టాన్రికి చెందిన కావూరి సాంబశివరావు, పల్లంరాజు, జైపాల్ రెడ్డి హాజరయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదను జీవోఎం తోసిపుచ్చింది. అలాగే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనను పక్కనబెట్టింది. అసెంబ్లీ నియోజవర్గాలు పెంచే ప్రతిపాదన కూడా లేనట్లుగానే తెలుస్తోంది. కాగా పొలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపేలా ప్రతిపాదించింది. ఇదిలావుండగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారిస్తోంది. కేబినెట్ భేటి ముగిసన వెంటనే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నివాసానికి వచ్చారు. అక్కడే కోర్ కమిటీ సభ్యులు భేటి అయ్యారు. అంతకుముందు బీజేపీ నేత వెంకయ్య నాయుడుతో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ రహస్యంగా మంతనాలు జరిపారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరిస్తే మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత తెలిపినట్టు సమాచారం. బీజేపీ మద్దతు ఇస్తే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మార్గం సుగుమమైనట్టే. ఇక రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆ పార్టీ వారినే అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలకు తోడు తాజాగా వీరి దృష్టి శ్రీరాముడు కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలంపై పడింది. భద్రాచలం తమదంటే తమదంటూ ఇరు ప్రాంతాల నేతలు లాబీయింగ్ మొదలెట్టారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చాంబర్ లో ఖమ్మం నేతలు సమావేశయ్యారు. భద్రాచలం తెలంగాణకు వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఈ మేరకు కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన అవసరం ఉండబోదని ప్రతిపాదించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేంద్ర మంత్రుల బృందానికి లేఖ రాశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమైక్య నినాదం వినిపిస్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం హైదరాబాద్ యూటీ ప్రతిపాదన, సీమాంధ్రలో భద్రాచలం కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలంటూ కేంద్ర మంత్రి జేడీ శీలం జీవోఎంను కోరారు. తెలంగాణ బిల్లుకు 10 సవరణలు ప్రతిపాదించామని, వాటిని ఒప్పుకుంటే తెలంగాణపై తమ కెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. మొత్తానికి బిల్లు రాష్ట్రపతికి అక్కడి నుంచి పార్లమెంటుకు రానుంది.